డీఎస్సీకి ముందే టెట్‌

డీఎస్సీ కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం, ఆ వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం జరిగిపోయాయి.

Updated : 15 Mar 2024 05:26 IST

మే 20.. జూన్‌ 3 మధ్యలో పరీక్షలు
ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులు
నోటిఫికేషన్‌ విడుదల
జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం, ఆ వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం జరిగిపోయాయి. మే 20 నుంచి జూన్‌ 3 మధ్యలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీటీ) జరగనున్నాయి. అభ్యర్థులు  schooledu.telangana.gov.in వైబ్‌సైట్‌లో ఈ నెల 20 నుంచి సమాచార బులెటిన్‌, పూర్తిస్థాయి నోటిఫికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నెల 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తాజాగా టెట్‌ నిర్వహించకపోవడం వల్ల డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన సర్కారు డీఎస్సీకి ముందే వీలైనంత త్వరగా మరో టెట్‌ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో డీఎస్సీ రాసే వారి సంఖ్య భారీగా పెరగనుంది. టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున దీనికి భారీగా డిమాండ్‌ ఉంది. అయితే గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన తెలంగాణ పేపర్‌-1లో 82,489 మంది(36.89%) ఉత్తీర్ణత పొందగా.. పేపర్‌-2లో 29,073 మంది(15.30%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇదే సమయంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్‌ ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పూర్తిస్థాయిలో సన్నద్ధత కాలేకపోయామని, అందువల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు

ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించడంతోపాటు.. దరఖాస్తు గడువునూ పెంచింది. ఈ మేరకు జులై 17 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు. అలాగే ఏప్రిల్‌ 4 వరకు ఉన్న దరఖాస్తును గడువును జూన్‌ 20 వరకు పొడిగించామని ప్రకటించారు. తాజాగా టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని