ఉపాధి హామీకి కూలీలను పెంచాలి

రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని... కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది.

Updated : 18 Apr 2024 05:28 IST

ప్రభుత్వ ఆదేశాలు
 గ్రామానికి 200 మంది హాజరయ్యేలా చూడాలని నిర్దేశం

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని... కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రతి గ్రామంలో 200 మంది హాజరయ్యేలా చూడాలని నిర్దేశించింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు 53,01,314 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 35,66,536 మంది ప్రతి వేసవిలో పనులకు వస్తుండగా... ఈసారి ఆ సంఖ్య 13 లక్షల మందికే పరిమితమైంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో హాజరయ్యేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఉపాధి హామీ పనులకు వేసవి కాలం కీలకమైంది. ఏప్రిల్‌, మే నెలల్లో పనులు ముమ్మరంగా సాగుతాయి. మిగిలిన 10 నెలలు 40 శాతం పనులు జరిగితే ఈ రెండు నెలల్లో 60 శాతం చేస్తారు. ఈ వేసవిలోనూ పెద్ద ఎత్తున పనులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కూలీల సంఖ్య అనుకున్నంత పెరగడం లేదు. ఉపాధి హామీ పథకంపై రోజువారీ సమీక్షల్లో కూలీల సంఖ్య తక్కువగా ఉండటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు మంచినీటి కొరత, ఇతర సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది పనులకు రావడం లేదని వారు చెబుతున్నారు.

సంఖ్య పెరిగేలా...

ఎండల తీవ్రత ఉన్నా తగిన సంరక్షణ చర్యలు చేపట్టి కూలీల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, ఉపాధి హామీ అధికారులను ఆదేశించింది. ఉదయం, సాయంత్రం ఎండ తీవ్రత లేని సమయంలో పనులు జరిగేలా చూడాలని, మంచినీటి సరఫరాతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు హామీ ఇవ్వాలని, ఈ విషయాలు కూలీలకు చెప్పి వారు పనులకు హాజరయ్యేందుకు ఒప్పించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి కూలీలతో సమావేశం ఏర్పాటుచేసి పనులకు హాజరు కావాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు