Bandi Sanjay: ఆట మొదలైంది

ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్తానని, రాష్ట్రంలో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 06 Jan 2022 04:54 IST

317 జీవోను సవరించే వరకు పోరాటం ఆగదు

హైకోర్టు మొట్టికాయలతో కేసీఆర్‌ సిగ్గు తెచ్చుకోవాలి

జైలు నుంచి విడుదల అనంతరం బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్‌ జైలు ముందు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్తానని, రాష్ట్రంలో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ధర్మయుద్ధంలో ఈ గెలుపు ఆరంభమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 7.30 గంటలకు కరీంనగర్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.  ఆయన బయటికి వస్తున్న సమయంలో కేంద్ర సహాయమంత్రి భగవంత్‌ ఖుబాతోపాటు రాష్ట్ర నాయకులు ఎస్‌.కుమార్‌, మనోహర్‌రెడ్డిలు స్వాగతం పలికారు.అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘భాజపా కేసీఆర్‌ని ఇక వదిలిపెట్టేది లేదు. జైళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఆయనను, ఆయన కుటుంబసభ్యులను తప్పకుండా జైలుకు పంపుతాం. నేను జైలుకు వెళ్తే బయటకు రావాలని తెలంగాణ సమాజమంతా దేవుళ్లకు మొక్కింది. అదే కేసీఆర్‌ జైలుకు వెళ్తే బయటకు రావద్దని మొక్కుతారు. నన్ను జైలుకు పంపిన అని కేసీఆర్‌ సంతోషపడ్డడు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. నేను మోసం, దొంగ కేసుల్లో జైలుకు పోలేదు. ప్రజాసమస్యలపై జైలుకు వెళ్లడం నాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు తొమ్మిదోసారివెళ్లి వచ్చా. ఈ సారి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం వెళ్లాననే సంతోషం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను సవరించాలి. అప్పటివరకు మా పోరాటం ఆగదు. ఉద్యోగులు నరకయాతన పడుతున్నారు. సీఎం వైఖరి వల్ల సీనియర్లు, జూనియర్లకు కొట్లాటలవుతున్నాయి. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు సర్కారుకు కొమ్ముకాస్తున్నారు. అలాంటివారికి బుద్ధిచెప్పాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మేం అన్నిరకాలుగా అండగా నిలబడతాం. కేసీఆర్‌కు మమ్మల్ని కొట్టే అధికారం ఎవరిచ్చారు? దుండగులమా..? చీటర్లమా..? ఎందుకని గ్యాస్‌ కట్టర్లతో, క్యాన్‌లతో మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టించారు? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని. కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించలేదు.అయినా అమానుషంగా దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. మహిళా నాయకురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. ప్రజలు గల్లీల్లో ఏమనుకుంటున్నారో కేసీఆర్‌ తెలుసుకోవాలి. కేటీఆర్‌ జర కేసీఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. జైల్లో ఉన్నప్పుడు సహకరించిన జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకులకు అండగా నిలబడిన తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.తర్వాత జాగరణ దీక్ష సమయంలో గాయపడిన కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఎంపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు.


జైలు నుంచి విడుదలైన బండి సంజయ్‌తో కలిసి వస్తున్న కేంద్ర సహాయమంత్రి భగవంత్‌ ఖుబా

బండి సంజయ్‌ను కలిసిన కేంద్ర సహాయమంత్రి భగవంత్‌ ఖుబా

అంతకుముందు కరీంనగర్‌ జైల్లో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి భగవంత్‌ ఖుబా బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని ఆరోపించారు. కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ రాజకీయనేతలా వ్యవహరిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని