Afghanistan: భారత్‌లో మా ఎంబసీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం: ఆఫ్గానిస్థాన్‌

భారత్‌లో తమ ఎంబసీ కార్యకలాపాలను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆఫ్గానిస్థాన్‌ ప్రకటించింది.

Published : 01 Oct 2023 03:48 IST

దిల్లీ: భారత్‌ (Bharat)లో నేటి (అక్టోబర్‌ 1) నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆఫ్గానిస్థాన్‌ (Afghanistan) రాయబార కార్యాలయం ప్రకటించింది. తమ దేశం పట్ల భారత్‌ ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘భారత్‌, ఆఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అన్ని విధాలుగా ఆలోచించే భారత్‌లో మా దౌత్యపరమైన కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇందుకు మేమెంతో చింతిస్తున్నాం’’అని ప్రకటనలో పేర్కొంది. 

వివిధ కారణాలతో తమ రాయబార కార్యాలయంలో సిబ్బందిని, ఇతర వనరులను భారత్‌ తగ్గించిందని ఆఫ్గాన్‌ ఆరోపిస్తోంది. వనరుల లేమితో కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు ఆఫ్గాన్‌ పౌరులకు అత్యవసర కౌన్సిలర్‌ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం భారత్‌లో ఆఫ్గాన్‌ రాయబారిగా ఫరిద్‌ మముండ్జే వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గాన్‌ను ఆక్రమించకముందు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్‌ గని ఇతడిని నియమించారు. తాలిబన్ల ప్రభుత్వంలోనూ ఫరిద్‌ అదే పదవిలో కొనసాగుతున్నారు. భారత్‌లో ఆఫ్గాన్‌ రాయబార కార్యాలయంలో ట్రేడ్‌ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోన్న ఖాదిర్‌ షా కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జ్‌ని అంటూ భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఆఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్‌ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్‌ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆఫ్గాన్‌ తన కార్యకలాపాలను నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు