Imran Khan: ఇమ్రాన్‌ మెడకు రహస్యపత్రాల ఉచ్చు

తోషాఖానా అవినీతి కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఒకవేళ ఈ కేసు నుంచి బయటపడ్డా.. రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు.

Updated : 28 Aug 2023 08:46 IST

పాక్‌ మాజీ ప్రధానిని జైలులో విచారించిన ఫెడరల్‌ ఏజెన్సీ

ఇస్లామాబాద్‌: తోషాఖానా అవినీతి కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఒకవేళ ఈ కేసు నుంచి బయటపడ్డా.. రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు. అటక్‌ జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను ఈ ఏజెన్సీతోపాటు తీవ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడబ్ల్యూ) గంటకు పైగా విచారించినట్లు ఆదివారం ‘డాన్‌’ పత్రికాకథనం పేర్కొంది. గతేడాది ఇమ్రాన్‌ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ కొన్ని పత్రాలు చేతితో పట్టుకొని ఊపుతూ చూపించారు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి ఈ ఆధారాలు తాము సేకరించినట్లుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఇపుడు రహస్యపత్రాల వెల్లడి కేసు రూపంలో అదే ఇమ్రాన్‌ మెడకు చుట్టుకుంటోంది. ఆ పత్రాలు ఎక్కడున్నాయని విచారణ అధికారులు మాజీ ప్రధానిని ప్రశ్నించగా.. వాటిని ఎక్కడ పెట్టానో గుర్తుకురావడం లేదని ఆయన బదులిచ్చారు. ఆ రోజు ర్యాలీలో తాను చూపించింది ఎంబసీ పత్రాలు కావని, అవి కేబినెట్‌ సమావేశ మినిట్స్‌గా ఇమ్రాన్‌ తెలిపారు. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగంపై ఓ నిర్ధారణకు వచ్చిన ఏజెన్సీ ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఆయన సహచరుడైన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి అయిన షా మహమ్మద్‌ ఖురేషీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఖురేషీని ఆగస్టు 19న అధికారులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు