Japan: రూ.2.2 కోట్లకు అమ్ముడు పోయిన భారీ టూనా..!

జపాన్‌లోని రెస్టారెంట్లు కొవిడ్‌ తర్వాత పుంజుకొంటున్నాయి. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ భారీ టూనాను రూ.2.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 

Updated : 08 Jan 2023 13:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌(Japan)లోని టోక్యోలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఓ వేలం పాటలో 212 కిలోల టూనా చేప భారీ ధరకు అమ్ముడుపోయింది. టోక్యో నగరంలోని టయోసు చేపల మార్కెట్‌లో జరిగిన వేలంలో బ్లూఫిన్‌ రకం టూనాను వేలం వేశారు. గతేడాది వేలంలో పలికిన రేటు కంటే ఇది రెట్టింపు ధరకు అమ్ముడుపోయింది. ఈ చేపను ఉత్తర అమెరికాలో ఒమా వద్ద పట్టుకొన్నారు. ఒమా వద్ద దొరికే బ్లూఫిన్‌ రకం టూనాలను ‘బ్లాక్‌ డైమండ్స్‌’గా అభివర్ణిస్తారు. ఇవి చాలా ధర పలుకుతాయి.

తాజాగా జరిగిన వేలంలో ఈ బ్లూఫిన్‌ను సూషీ ఛైన్‌ ఆపరేటర్‌ ఒనోడెరా గ్రూప్‌ దక్కించుకొంది. ఇందుకోసం 2,75,000 డాలర్లు (రూ.2.26 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ టూనాను టోక్యోలోని తమ రెస్టారెంట్లలో వండి వడ్డిస్తామని ఒనోడెరా ప్రతినిధి తెలిపారు.  మరోవైపు ఈ టూనాకు భారీ ధర పలకడంపై టయోసు మార్కెట్‌ దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత జపాన్‌ (Japan) ప్రజలు రెస్టారెంట్లకు వెళ్లేందుకు తిరిగి ఆసక్తి చూపుతున్నారన్న దానికి దీనిని సంకేతంగా భావిస్తున్నారు. సాధారణంగా  జపాన్‌(Japan)లో ఏటా నూతన సంవత్సర సంబరాల్లో జరిగే వేలం ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సారి టూనాకు లభించిన ధర అంచనాలను మించి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని