Hamas: బందీల్లో చాలా మంది చనిపోయి ఉంటారు: హమాస్‌

Hamas: ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముగ్గురు బందీలతో మాట్లాడిస్తూ హమాస్‌ ఓ వీడియోను విడుదల చేసింది.

Updated : 15 Jan 2024 08:41 IST

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Israel Hamas war) ప్రారంభమై ఆదివారంతో 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా హమాస్‌ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తమ అధీనంలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలతో మాట్లాడించింది. వెంటనే తమని విడిపించాలని.. హమాస్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలని వారు కోరుతున్నట్లు వీడియోలో ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్‌ అధికార ప్రతినిధి అబు ఒబేదా ఆదివారం విడుదల చేసిన మరో సందేశంలో తెలిపాడు. దీనికి ఇజ్రాయెల్‌దే (Israel) బాధ్యతని ఆరోపించాడు. వారు చేపడుతున్న సైనిక చర్యల వల్లే చాలా మంది బందీలతో తాము సంబంధాలు కోల్పోయామని చెప్పాడు. ఇప్పటికీ సొరంగాల్లో ఉన్న బందీలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్‌ దాడులు విస్తరించే కొద్దీ వారు మరింత ప్రమాదంలోకి జారుకుంటారని హెచ్చరించాడు.

అంతమెరుగని యుద్ధం!

రానున్న రోజుల్లో ఇజ్రాయెల్‌ (Israel) సైన్యంపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అబు ఒబేదా హెచ్చరించాడు. గాజాలో మసీదులను కూల్చడం ద్వారా ఇజ్రాయెల్‌ మతపరమైన యుద్ధానికి తెరతీస్తోందని ఆరోపించాడు. హమాస్‌ సందేశాలపై స్పందించడానికి ఇజ్రాయెల్ తొలి నుంచీ నిరాకరిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో ఇజ్రాయెల్‌ ఫొరెన్సిక్‌ విభాగానికి చెందిన అధికారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చనిపోయిన బందీలు వైమానిక దాడుల్లోనే మరణించినట్లుగా శవపరీక్షలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

తమ సైనిక ఆపరేషన్‌లో బందీలకు పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుంటున్నామని ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం గతంలో ఓసారి చెప్పింది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించింది. మొత్తం 240 మందిని బందీలుగా తీసుకున్న హమాస్‌.. ఒప్పందం మేరకు నవంబర్‌లో కొంతమందిని విడిచిపెట్టింది. ఇప్పటికీ 132 మంది ఇంకా వారి అధీనంలోనే ఉన్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది. వీరిలో 25 మంది మరణించినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని