Kim Jong Un: ఆత్మాహుతి డ్రోన్లు.. బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌.. రష్యాలో ‘కిమ్‌’కు బహుమతులు!

రష్యా పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ఆత్మాహుతి డ్రోన్లు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ బహుమతిగా అందాయి.

Published : 17 Sep 2023 19:52 IST

మాస్కో: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) రష్యా (Russia)లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన ముగిసింది. ఆయన స్వదేశానికి తిరుగు ప్రయాణమైనట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. కరోనా మహమ్మారి తర్వాత కిమ్ చేపట్టిన మొదటి అధికారిక విదేశీ పర్యటన ఇది. తన రష్యా పర్యటనలో భాగంగా కిమ్‌కు డ్రోన్లు, ఓ బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ బహుమతులుగా అందినట్లు రష్యా అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. చైనా, ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న ప్రిమోరీ ప్రాంత గవర్నర్ ఆయనకు ఈ గిఫ్ట్‌లు అందజేసినట్లు తెలిపింది.

‘ఉత్తర కొరియా అధ్యక్షుడు.. అయిదు ఆత్మాహుతి డ్రోన్లు (Kamikaze Drones), ఒక నిఘా డ్రోను (Geran-25)ను బహుమతులుగా అందుకున్నారు. దీంతోపాటు ఆయనకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌, థర్మల్‌ కెమెరాలూ గుర్తించని ప్రత్యేక దుస్తులు అందజేశారు’ అని వార్తాసంస్థ వెల్లడించింది. మరోవైపు.. వ్లాదివొస్తక్‌లో చదువుతోన్న ఉత్తర కొరియా విద్యార్థులతో కిమ్‌ సమావేశమయ్యారు. ఇదొక మంచి భేటీ అని ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. స్నేహం, సంఘీభావం, సహకారం విషయంలో ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన శకం ప్రారంభమవుతోందని చెప్పింది.

కిమ్‌, పుతిన్‌ మధ్య ఏ ఒప్పందమూ జరగలేదు!

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలోనే కిమ్‌ రష్యాలో పర్యటించడం.. అమెరికా సహా దాని మిత్ర దేశాలను ఆందోళనకు గురిచేసింది. ప్యాంగ్యాంగ్‌లో తయారైన ఆయుధాలను మాస్కో సేకరిస్తుందేమోనని అవి అనుమానం వ్యక్తం చేశాయి. మరోవైపు.. తమ క్షిపణి కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు రష్యా సాయాన్ని ఉత్తర కొరియా కోరుతుందనే వార్తలు వచ్చాయి. అయితే, కిమ్‌ జోంగ్ ఉన్‌ రష్యా పర్యటన సందర్భంగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కిమ్‌ తిరుగు ప్రయాణమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని