మంచు పర్వతాల్లో శవం ఆనవాళ్లు.. 37ఏళ్ల క్రితం మిస్‌ అయిన పర్వతారోహకుడిగా నిర్ధారణ!

స్విట్జర్లాండ్‌లో (switzerland) హిమనీనదాలు (Glacier) కరగడంతో అదృశ్యమైపోయిన పర్వతారోహకుల (Mountain climber) ఆనవాళ్లు దొరుకుతున్నాయి. తాజాగా 37 ఏళ్ల కిందట కన్పించకుండా పోయిన ఓ వ్యక్తి మృతదేహం ఆచూకీ తెలిసింది.  

Published : 03 Aug 2023 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విట్జర్లాండ్‌లోని (switzerland) ఆల్ప్స్‌ పర్వతాలపైకి వెళ్లిన ఓ వ్యక్తి మృతదేహం ఆనవాళ్లు 37 ఏళ్ల తరువాత లభ్యమయ్యాయి. భూతాపం కారణంగా ఇటీవల అక్కడ మంచు కరగడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 12న జెర్మట్‌లోని థెడుల్ హిమనీనదంపై (Glacier) హైకింగ్‌ చేస్తున్న పర్యాటకులకు కొన్ని వస్తువులు, మృతదేహం అవశేషాలు కనిపించాయి. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అక్కడున్న వాటిని ఫోర్సెనిక్‌ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. సియాన్‌ పట్టణంలోని వలైస్‌ ఆస్పత్రి విభాగంలో వాటిని పరీక్షించారు.

అంతరిక్షంలో చనిపోతే.. భూమికి ఎలా తీసుకొస్తారో తెలుసా..!

ఆ ఆస్పత్రి ప్రయోగశాలలో చేసిన డీఎన్‌ఏ టెస్టుల్లో మృతదేహం 38ఏళ్ల ఓ పర్వతారోహకుడిదని తేలింది. జర్మనీకి చెందిన ఆ వ్యక్తి 1986లో పర్వాతారోహణకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అతడి అదృశ్యంపై అప్పట్లో ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఎలా చనిపోయాడనే పూర్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. మృతదేహానికి సంబంధించిన బూటు, మరికొన్ని వస్తువులను మాత్రం చూపించారు. 

భూతాపం కారణంగా స్విట్జర్లాండ్‌లో పలు హిమనీనదాలు కరుగుతున్నాయి. దాంతో ఎప్పటినుంచో మాయమైన వ్యక్తుల మృతదేహాల ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. గతేడాది అల్షెట్‌ హిమనీనదంపై 1968లో కుప్పకూలిన విమాన శిథిలాలు బయటపడ్డాయి. 2015లో మాటర్‌హార్న్‌లో ఇద్దరు జపనీస్‌ పర్వతారోహకుల అవశేషాలు కనిపించాయి. 1970లో సంభవించిన మంచు తుపానులో వారిద్దరూ తప్పిపోయారు. కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు చేసి ఆ మృతదేహాలను గుర్తుపట్టారు. 2014లో బ్రిటిష్ పర్వతారోహకుడు జొనాథన్‌ కాన్‌విల్లే మృతదేహం కనిపించింది. 1979లో తప్పిపోయిన అతని మృతదేహాన్ని ఓ హెలికాప్టర్‌ పైలట్‌ గుర్తించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని