Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం తీరు మారేనా?

గాజాపై ఇజ్రాయెల్‌ ప్రస్తుతం కొనసాగిస్తున్న యుద్ధం తీరు మారుతుందని, హమాస్‌ నేతలే లక్ష్యంగా దాడులు కొనసాగే అవకాశముందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ తెలిపారు.

Published : 15 Dec 2023 19:50 IST

జెరూసలెం: హమాస్‌ను (Hamas) నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ (Israel) తన యుద్ధ విధానాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతుండటంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేవలం హమాస్‌ నేతలనే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు యుద్ధం చేస్తాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌ అన్నారు. అయితే, ఈ మార్పు ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జాక్‌ సలీవాన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గాజాలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఇజ్రాయెల్‌ దళాలకు మరికొన్ని నెలలు సమయం పట్టొచ్చని అన్నారు. అయితే, ప్రస్తుతం కొనసాగిస్తున్న వైమానిక, భూతల దాడులు కాకుండా సరికొత్త యుద్ధ విధానాన్ని ఇజ్రాయెల్‌ అవలంబించబోతున్నట్లు చెప్పారు. దీనిపై ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి, ఆర్మీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని, సరైన సమయంలో వాళ్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒక వేళ యుద్ధ తీవ్రత తగ్గకపోయినా.. ఇజ్రాయెల్‌కు సాయంగా పంపిన బలగాలను అమెరికా ఉపసంహరించుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు. దానిపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 

అక్టోబర్‌ 7న దాడికి పాల్పడిన హమాస్‌ ఉగ్రవాదులు దాదాపు 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కనీసం 1900 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన మద్దతుదారుగా ఉన్న అమెరికా కూడా ఇటీవల ఇజ్రాయెల్‌ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. యుద్ధ తీవ్రతను తగ్గించాలని, పౌరుల ప్రాణాలు కాపాడటంపై దృష్టిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇజ్రాయెల్‌కు కాస్త కఠినంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కాస్త వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తోనూ త్వరలో జాక్‌ సలీవాన్‌ భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అబ్బాస్‌తో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని