North Korea: శత్రు వినాశనమే లక్ష్యంగా.. క్షిపణులతో అణు దాడుల సాధన!

దక్షిణ కొరియాను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు తమ క్షిపణులతో అణు దాడుల సాధన చేసినట్లు ఉత్తర కొరియా తెలిపింది. ఉత్తర కొరియా బుధవారం రెండు క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే.

Published : 31 Aug 2023 16:56 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా (North Korea) బుధవారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణుల (Ballistic Missiles)ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ ప్రయోగాలపై కీలక ప్రకటన చేసింది. ఒకవేళ యుద్ధం తలెత్తితే.. దక్షిణ కొరియా (South Korea)లోని ప్రాంతాలను కోలుకోలేని విధంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఆ క్షిపణులతో అణు దాడులను సాధన చేసినట్లు వివరించింది. దీంతోపాటు యుద్ధ సమయంలో ప్రత్యర్థి భూభాగాన్ని ఆక్రమించడాన్ని కూడా రిహార్సల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

‘దక్షిణ కొరియాలోని ప్రధాన కమాండ్‌ కేంద్రాలు, ఎయిర్‌ఫీల్డ్స్‌ లక్ష్యంగా అణు దాడుల సాధనకు బుధవారం రెండు వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా సైన్యం తెలిపింది’ అని కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించింది. గాల్లో పేలిపోవడం ద్వారా అణుదాడులు సాధన చేపట్టాయని, ఇవి నిర్ణీత ఎత్తులో నమూనా వార్‌హెడ్‌లను పేల్చాయని ఉత్తర కొరియా సైన్యం చెప్పింది. దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అమెరికా బాంబర్‌ చేపట్టిన యుద్ధ విన్యాసాలకు ప్రతిస్పందనగా ఈ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది.

భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ డుమ్మా..?

మరోవైపు.. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా ఇండో- పసిఫిక్‌ కమాండ్‌లు ఇప్పటికే తీవ్రంగా ఖండించాయి. దక్షిణ కొరియా, జపాన్‌లకు రక్షణ కల్పించే విషయంలో తమ నిబద్ధత చెక్కుచెదరలేదని అమెరికా పేర్కొంది. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాకు అండగా అమెరికా ఆయుధాలను మోహరిస్తున్న తీరుపై ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్న ఆగ్రహంగా ఉన్నారు. స్వదేశంలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ‘కేసీఎన్‌ఏ’ ఇటీవల తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని