North Korea: అమెరికా సైనికుడే విరక్తితో మా శరణుకోరి వచ్చాడు..: ఉత్తరకొరియా

అమెరికా సైన్యంలో వివక్షతో ఓ సైనికుడి మనసు వికలమై తమ వద్దకు ఆశ్రయం కోరి వచ్చాడని కిమ్‌ సర్కారు పేర్కొంది. ఇటీవల ఉత్తరకొరియాలో ప్రవేశించిన అమెరికా సైనికుడిపై తొలిసారి అధికారికంగా స్పందించింది.

Published : 16 Aug 2023 12:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తినడానికి సరైన తిండి దొరకదు.. కదిలితే ఆంక్షలు.. ఇక ఆధునిక టెక్నాలజీ వినియోగం ఎక్కడా కనిపించదు.. ఇది ఉత్తరకొరియా పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలే వీలు దొరికినప్పుడల్లా కంచెలు దాటి ఇతర దేశాల్లో ప్రవేశించి శరణు కోరతారు. కానీ, తాజాగా ఉత్తరకొరియాకే ఓ అమెరికా (USA) సైనికుడు శరణార్థిగా వెళ్లాడు.

ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ టి.కింగ్‌ పై ఉత్తరకొరియా( North Korea) ఆసక్తికర ప్రకటన చేసింది. అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే తాను సరిహద్దులు దాటి ఉత్తరకొరియాలోకి ప్రవేశించినట్లు ట్రవిస్‌ కింగ్‌ చెప్పాడని పేర్కొంది. ఈ మేరకు ఉత్తరకొరియా తొలిసారి అమెరికా సైనికుడిపై అధికారిక ప్రకటన చేసింది. ట్రావిస్‌ ఉద్దేశపూర్వకంగానే ఉత్తరకొరియాలో నివసించేందుకు సరిహద్దులు దాటినట్లు ప్యాంగ్‌యాంగ్‌ దర్యాప్తు బృందాలు కూడా నిర్దారించాయి.

‘‘అతడు అమెరికా సైన్యంలో అమానవీయ పరిస్థితులు, వివక్షతో బాధపడి ఉత్తర కొరియాలో ఉండేందుకు సరిహద్దులు దాటినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డీపీఆర్‌కే (ఉత్తరకొరియా)లో లేదా మరేదైనా మూడో దేశంలో శరణార్థిగా ఉండేందుకు సానుకూలంగా ఉన్నాడు’’ అని కేసీఎన్‌ఏ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. అతడి విషయంలో ప్యాంగ్‌యాంగ్‌ ఏం నిర్ణయం తీసుకుందో మాత్రం వెల్లడించలేదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన  అతడిని విచారించి శిక్షిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. 

బిల్‌గేట్స్‌ చేతిలో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో.. ఎందుకో తెలుసా?

జులై 18వ తేదీన కొందరు సందర్శకుల బృందంతో కలిసి 23 ఏళ్ల ట్రావిస్‌ సంయుక్త గస్తీ ప్రాంతానికి చేరుకొన్నాడు. అక్కడి నుంచి అతడు ఉత్తరకొరియాలోకి పారిపోయాడు. అతడిని ఉత్తర కొరియా నుంచి విడిపించేందుకు ఐరాస కమాండ్‌ సాయంతో అమెరికా యత్నాలు చేస్తోంది. ఈ సంస్థే సరిహద్దు ప్రాంతాన్ని నిర్వహిస్తోంది. దీనికి ఉత్తరకొరియా సైనిక దళాలతో నేరుగా ఫోన్‌లైన్లు ఉన్నాయి. తాజాగా ఉత్తర కొరియా ప్రకటనపై పెంటగాన్‌ అధికారి మాట్లాడుతూ .. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాడి ట్రావిస్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చడమే తమ ప్రాధాన్యమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని