North Korea: అమెరికా, దక్షిణ కొరియాలను నాశనం చేస్తాం: కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సయోధ్య, విలీనం సాధ్యం కాదని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. తమ జోలికి వస్తే వాషింగ్టన్‌, సియోల్‌ను నాశనం చేస్తామన్నారు.

Updated : 01 Jan 2024 10:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి ద.కొరియాతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తెగేసి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుదేశాల మధ్య మాదిరిగా మారాయని అభివర్ణించారు. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు. 2024లో అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్‌ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎరుపెక్కిన ఎర్రసముద్రం

ఆయన నిన్న మిలటరీ కమాండర్ల మీటింగ్‌లో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో మా సంబంధాలపై స్పష్టతనివ్వాల్సిన సమయం వచ్చింది. ఒక వేళ వాషింగ్టన్‌, సియోల్‌ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోం. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో ఎటువంటి సంబంధాలు కొనసాగించం’ అని స్పష్టం చేశారు.

వాస్తవానికి 1953లో సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. కానీ, ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు. దీంతో సాంకేతికంగా మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే లెక్క. ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి. చాలా కాలం వీటి సంబంధాలు ఉద్రిక్తంగానే సాగాయి. కానీ, కిమ్‌ అధికారం చేపట్టాక.. ఇవి పతాక స్థాయికి చేరాయి. తాజాగా కిమ్‌ ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది. భవిష్యత్తులో దక్షిణ కొరియా పాలకులు శాంతి ప్రతిపాదనలు చేసినా.. ఉత్తర కొరియా తిరస్కరించడం ఖాయం. ఆసియాలో ఘర్షణలు మరింత పెరగవచ్చు. కొరియా ద్వీపకల్పంలో కిమ్‌ ప్రకటన అత్యంత కీలక పరిణామం.

గత వారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దేశంలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా.. తట్టుకొనే విధంగా తయారీని వేగవంతం చేయాలని సూచించారు. ఈ విషయాన్ని అక్కడి జాతీయ మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. అమెరికా కారణంగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయని ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని