Kim Jong Un: కిమ్‌కు మళ్లీ ఎదురు దెబ్బ.. నిఘా ఉపగ్రహం ప్రయోగం విఫలం..!

కిమ్‌ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని పంపేందుకు చేసిన ప్రయోగం విఫలమైంది. మూడు నెలల వ్యవధిలో ఇది రెండో వైఫల్యం. 

Updated : 24 Aug 2023 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని చేర్చాలనుకొన్న ఉత్తరకొరియా(North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం గురువారం ఉదయం చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. మూడు నెలల క్రితం తొలిసారి ఉ.కొరియా చేసిన ప్రయోగం విఫలమై రాకెట్‌ సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ప్రయోగంలో రాకెట్‌ మూడో దశలో విఫలమైనట్లు ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. 

యుద్ధ సమయంలో శత్రుదేశాలపై నిఘా పెట్టేందుకు, తమ దేశ పైలట్లకు సహాయకారిగా ఉండేందుకు నిఘా ఉపగ్రహ ప్రాజెక్టును కిమ్‌ సర్కారు చేపట్టింది. తాజా ప్రయోగ వైఫల్యంపై ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ స్పందిస్తూ.. అక్టోబర్‌లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించింది. రాకెట్‌ మూడో దశ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్‌ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రయోగం విఫలమైందని కేసీఎన్‌ఏ కథనంలో పేర్కొంది. ఇదేమీ పెద్ద సమస్యకాదని వెల్లడించింది. 

విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మృతి!

దక్షిణ కొరియా నిఘా వర్గాల కథనం మేరకు..  ఎల్లో సీ మీదుగా ఉత్తరకొరియా రాకెట్‌ను ప్రయోగించింది. దీంతో జపాన్‌లో గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించి ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లలో తలదాచుకోవాలని పేర్కొన్నాయి. 20 నిమిషాల తర్వాత ఈ హెచ్చరికలను ఉపసంహరించుకొన్నారు. ఉత్తరకొరియా ప్రయోగాన్ని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఖండించారు. ‘‘ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా ప్రవర్తిస్తోంది. దీనికి తాము నిరసన వ్యక్తం చేస్తున్నాం’’ అని అన్నారు. మరోవైపు అమెరికా ఈ ప్రయోగంపై స్పందించింది. రెచ్చగొట్టే చర్యలను ఉత్తరకొరియా మానుకోవాలని సూచించింది. దౌత్యమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని పేర్కొంది. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలు వాషింగ్టన్‌లో భేటీ నిర్వహించిన అనంతరం ఈ ప్రయోగం జరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని