FTA: భారత్‌-బ్రిటన్‌ ‘వాణిజ్య ఒప్పందం’ పురోగతిపై మోదీ, సునాక్‌ సంతృప్తి

FTA: భారత్‌, బ్రిటన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. దీని పురోగతిపై మోదీ, సునాక్‌ మంగళవారం చర్చించారు.

Published : 13 Mar 2024 08:17 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలపర్చేందుకు జరుగుతున్న కృషిని స్వాగతించారు. అలాగే ఉభయ పక్షాలకూ ప్రయోజనం చేకూర్చే ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ ఖరారు దిశగా సాగుతున్న పురోగతిని ప్రశంసించారు.

రానున్న రోజుల్లో భారత్‌, బ్రిటన్‌ మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, సునాక్‌ (Rishi Sunak) నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే 36 బిలియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుందని గుర్తుచేశారు. దాన్ని మరింత విస్తరించేందుకు ఎఫ్‌టీఏ ఒప్పందం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. దీన్ని ఖరారు చేసుకునే దిశగా ప్రస్తుతం 14వ విడత చర్చలు కొనసాగుతున్నాయని.. మున్ముందూ ఈ విషయంలో పురోగతిని సమీక్షించేందుకు సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు.

మరోవైపు ‘రోడ్‌మ్యాప్‌ 300’ కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అత్యాధునిక సాంకేతికతలు సహా వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై మోదీ, సునాక్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని ఒకరికొకరు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు