Kate Middleton missing: కోమాలో బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌..?

బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) డిసెంబర్‌ నుంచి కనిపించకుండా పోయారంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 01 Mar 2024 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ రాజ కుటుంబానికి (Britain Royal Family) సంబంధించి ఏ విషయాన్నైనా యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంది. తాజాగా యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton)పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ నుంచి ఆమె కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్‌.. కోమా(Coma)లోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి.

కేట్‌ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. అయితే అప్పటినుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం తాజా వదంతులకు కారణమైంది.

Pakistan: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్‌ హోస్టెస్‌లు!

సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. తొలుత వీటిని ఓ స్పానిష్‌ టీవీ జర్నలిస్టు కొంచా కల్లెజా (Concha Calleja) వెల్లడించారు. అయితే, ఆమె ప్రకటనను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని పేర్కొంటున్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం కేట్‌ కనిపించకుండా పోయారనే వార్తలు ఆగడం లేదు. ఆమె భర్త ప్రిన్స్‌ విలియం ఇటీవల పలు కార్యక్రమాల్లో ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలాఉంటే, బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్‌ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్‌ యువరాణి కేట్‌ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం. ఇలా కేట్‌ త్వరలోనే ప్రజల ముందుకువస్తారని రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చని బ్రిటన్‌ మీడియా పేర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని