Updated : 17 Sep 2022 23:54 IST

ఏం బ్యాలెన్స్‌ గురూ!

ఉపాయం లేనివాళ్లని ఊరి నుంచి తరిమేయాలి అన్నది సామెత. చక్కని ఉపాయంతో ఓ వెయిటర్‌ తన పనిని ఎంతో సులువుగా చేస్తూ అందరి చేతా శభాష్‌ అనిపించుకుంటున్నాడు. రద్దీగా ఉండే హోటల్‌లో ఒకటీ రెండూ ప్లేట్లు పట్టుకొచ్చి కస్టమర్లకు అందిస్తూ కిచెన్‌లోకీ, హాల్లోకీ పరుగులు పెడుతుండేవాడు మహ్మద్‌. దాంతో సాయంత్రానికల్లా విపరీతంగా కాళ్లు నొప్పి పెడుతుండేవి. అలాగని ఉద్యోగం మానే పరిస్థితి లేదు. అందుకే ఓ మాంచి ఆలోచన చేశాడు. ఒకేసారి ఎక్కువ ప్లేట్లు తీసుకెళితే అటూ ఇటూ తిరిగే బాధ తప్పుతుందనుకున్నాడు. రాత్రిపూట హోటల్‌ మూశాక ప్లేటు మీద ప్లేటు పెట్టి నడుస్తూ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఆ·ర్నెల్లు తిరిగేసరికి ప్లేటులో పదార్థాలు ఒలికిపోకుండా ఒకదానికొకటి కలిసిపోకుండా ఒకేసారి 35 ప్లేట్లు పట్టుకుని నడవడంలో పట్టు తెచ్చుకున్న మహ్మద్‌ పట్టుదలకి హోటల్‌ యాజమాన్యం కూడా ఫిదా అయింది. అంతేనా, అతను ప్లేట్లు తీసుకొచ్చి అందించే తీరును చూడ్డానికి కూడా జనాలు బారులు తీరడంతో ఆ హోటల్‌కి ఇంకా గిరాకీ పెరిగిపోయింది. దాంతో యాజమాన్యం జీతం పెంచి మహ్మద్‌ని ప్రోత్సహిస్తోంది.


చలో సెల్ఫీబూత్‌

కొందరు చక్కగా రెడీ అయినప్పుడు... లేదంటే అందుకోసమే రెడీ అయ్యీ ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొందరేమో చక్కటి లొకేషన్లు కనిపిస్తే అక్కడే ఆగిపోయి ఫొటో షూట్‌లు చేస్తుంటారు. అలాంటి వాళ్లకోసమే హైదరాబాద్‌లో ఓ సెల్ఫీ మ్యూజియం ఏర్పాటైంది. ఇరవైకి పైగా త్రీడీ సెల్ఫీ సెట్స్‌ ఆధునికంగానూ పలు రకాల థీమ్‌లతోనూ యువతని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. అక్కడికెళితే అందమైన సెట్టింగుల మధ్య సెల్ఫీలూ తీసుకోవచ్చు... ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్ల చేత ఎంచక్కా ఫొటో షూట్లూ చేసుకోవచ్చు. రంగురంగుల బాల్‌పిట్స్‌, బార్బీ బాక్సులు, 19వ శతాబ్దపు టెలిఫోన్‌బూత్‌, మిలియనీర్‌ బెడ్‌రూమ్‌ వంటివెెన్నో సెల్ఫీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. అక్కడ బర్త్‌డే, మ్యారేజ్‌డే, ప్రీవెెడ్డింగ్‌ షూట్స్‌ వంటివీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ చేసేవారూ బారులు తీరుతున్నారు.


పేర్లతో అప్పడాలు

శుభకార్యాలప్పుడూ, ఇతర కార్యక్రమాలప్పుడు అతిథుల్ని ఆహ్వానిస్తూ  స్వాగతం బోర్డులు పెడుతుంటారు. వధూవరుల పేర్లతో, కార్యక్రమ వివరాలతో రకరకాల బ్యానర్లూ పోస్టర్లూ ఏర్పాటు చేస్తుంటారు. పెళ్లి తంతుకు వచ్చేసరికి అడ్డు తెరలపైనా, కొబ్బరి బోండాంలపైనా, కర్పూర దండలమీదా, మెహెందీతో చేతులపై కూడా వధూవరుల పేర్లు రాస్తున్నారు. ఆ ట్రెండ్‌ ఇప్పుడు అప్పడాల మీదకు కూడా వచ్చిచేరిందండోయ్‌. బ్యానర్లపైన రాసినట్టు వధూవరుల పేర్లు రాయడం, ఇంటి పేరుతో ఆహ్వానం పలకడం, వేదిక, ముహూర్తం వివరాలను రాయడం వంటివి చేస్తున్నారు. బారసాల అయితే పిల్లల చిత్రం వేేసి వారి పేర్లూ, థ్యాంక్యూ వంటివి రాసి వస్తున్నాయి. ఇలా వస్తున్న కస్టమైజ్డ్‌ అప్పడాలను ఈ మధ్య కొందరు భోజనాల్లో వడ్డించి అతిథుల చేత ఆహా అనిపిస్తున్నారు. బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టు ఎవరి అభిరుచి వాళ్లది మరి.


మత్య్సకన్యలా...

నిజంగా మత్య్సకన్యలు ఉంటారో ఉండరో మనకు తెలియదు. డిస్నీ సినిమాల్లో మాత్రం ఆ క్యారెక్టర్లు తారసపడుతుంటాయి. వాటిని చూసిన పిల్లలు ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఏదైతేనేం, మనకు ఊహాతీతమైన ఆ జలకన్య థీమ్‌తోనూ చిన్నారులకు కాస్ట్యూమ్స్‌ వస్తున్నాయి. వాటితో వారికి ఫొటో షూట్లు కూడా చేసేస్తున్నారు. అయితే ఒక అమ్మాయి మాత్రం జలకన్యగా రెడీ అయిపోయి నెలకు ఆరేడు లక్షలపైనే సంపాదిస్తోంది. ఆమె అమెరికాకు చెందిన ఎమిలీ అలెగ్జాండ్రా. మెర్మెయిడ్‌ దుస్తులు ధరించి బీచ్‌ ఒడ్డున, ఈత కొలనుల పక్కన జరిగే పార్టీల్లో మత్య్సకన్యలా నీళ్లలో తిరుగుతుంటుంది. పిల్లల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ విన్యాసాలు చేస్తుంటుంది. అందుకుగానూ ఆమెని పిల్లల పార్టీలకు ఆహ్వానిస్తూ వారికి కొత్త అనుభూతిని పంచుతున్నారు తల్లిదండ్రులు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని