క్లిక్‌ చేస్తే... గాల్లో తేలినట్టే!

నచ్చిన డ్రెస్సు వేసుకుంటే ఒక క్లిక్‌... ఓ కొత్తచోటుకు వెళితే ఇంకో క్లిక్‌... పాత దోస్తును కలిస్తే మరో క్లిక్‌... ఇలా రోజులో ఫోన్లో నిండిపోయే సెల్ఫీలూ, ఫొటోలూ ఎన్నెన్నో. ఎందుకంటే ఇప్పుడంతా ఫొటోల కాలమే కదా.

Published : 25 Feb 2023 23:21 IST

క్లిక్‌ చేస్తే... గాల్లో తేలినట్టే!

నచ్చిన డ్రెస్సు వేసుకుంటే ఒక క్లిక్‌... ఓ కొత్తచోటుకు వెళితే ఇంకో క్లిక్‌... పాత దోస్తును కలిస్తే మరో క్లిక్‌... ఇలా రోజులో ఫోన్లో నిండిపోయే సెల్ఫీలూ, ఫొటోలూ ఎన్నెన్నో. ఎందుకంటే ఇప్పుడంతా ఫొటోల కాలమే కదా. మరి అంత విలువైన ఫొటోలకి- ప్రత్యేక వేడుకల్లోనూ ఓ చోటు ఉండాలి కదా... ఇదిగో ఆ సరదా తీరేందుకే వచ్చేశాయి వెరైటీ ఫొటోబూత్స్‌!

వేడుక ఏదైనాకానీ అలంకరణతో అదిరిపోవాలనుకుంటాం. అందుకేగా ఫంక్షన్‌కు తగ్గట్టు చూడచక్కని థీమ్‌లతో వేదికల్ని సిద్ధం చేయడమే కాదు, మనమూ చక్కగా ముస్తాబవుతుంటాం. అన్ని అందాల్ని ఒకే దగ్గర మూటకట్టే ఆ సందర్భాన్ని ఎప్పటికీ దాచుకోవడానికి ఫొటోలూ, వీడియోలూ తీసుకుంటుంటాం. ఆ తీపి గుర్తుల్ని పదిలంగా అందించే ఫొటోల్లోనూ ఓ చక్కని అనుభూతిని ఇవ్వడానికి ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ వచ్చేసింది. వేడుకలో ఎక్కడో ఓ చోట కాకుండా... కేవలం ఫొటోలు తీసుకోవడానికే ప్రత్యేకంగా ఈ ఫొటోబూత్స్‌ పెడుతున్నారు. ఇదివరకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌లతో ఫొటోబూత్స్‌ వస్తే... ఇప్పుడేమో కెమెరామెన్ల అవసరమే లేకుండా ఫొటోలు తీసిపెట్టే బూత్స్‌ కూడా వచ్చేశాయి.

లైట్లూ, కెమెరా సెటప్‌లతో ఉండే ఈ ఫొటో బూత్స్‌లో చాలా రకాలే ఉన్నాయి. వీటిల్లో  పుట్టినరోజు వేడుక, పెళ్లి లాంటి శుభకార్యాలు మొదలు ఆఫీసు సెమినార్లూ, కార్పొరేట్‌ పార్టీల వరకూ సరిపోయేవి ఉన్నాయి. ఈ సేవల్ని అందించడానికి వివిధ నగరాల్లో ఫొటోబూత్‌ రెంటల్‌ సంస్థలెన్నో వచ్చాయి. మన దగ్గరా... ఫొటోబూత్‌ రెంటల్‌ సెల్ఫీబాక్స్‌, గోక్యాప్చర్‌, బీక్యాప్చర్డ్‌... లాంటివి అందుబాటులో ఉన్నాయి.

ఎన్ని రకాలో...

సెల్ఫీని కూడా చక్కని బ్యాక్‌గ్రౌండ్‌తో, ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి వచ్చినవే సెల్ఫీబాక్స్‌, మ్యాజిక్‌ మిర్రర్‌ ఫొటో బూత్స్‌. ఓ పెద్ద సైజు ఫోన్‌లా ఉండే వీటిల్లో బోలెడన్ని ఆప్షన్లుంటాయి. తాకే తెరతో ఫొటో ఫ్రేమునీ, కావాల్సిన లోగోల్నీ సెట్‌ చేసుకోవచ్చు. కేవలం టచ్‌ చేసి టైమ్‌ పెట్టుకుంటే చాలు... చకచకా ఫొటోలు తీసి పెడుతుంది. వేడుక అంటేనే మస్త్‌ మజా. ఆటాపాటలతో వధూవరులూ స్నేహితులూ కలిసి స్టెప్పులేస్తే... వాటిని 360 డిగ్రీల కోణంలో క్యాప్చర్‌ చేస్తే... సరదాగా ఉంటుంది కదూ. అలాంటి సందర్భాల్ని బంధించడానికి సరిగ్గా సరిపోతుంది స్పిన్‌ ఫొటో బూత్‌. మధ్యలో చుట్టూ తిరిగే స్టాండుకే కెమెరా, లైట్లూ అమర్చి ఉంటాయి. రిమోట్‌ కంట్రోల్‌తో వేగాన్ని సెట్‌ చేసుకుని దానిమీద నిలబడ్డామంటే... అన్ని యాంగిల్స్‌లో తిరిగిపోతూ ఫొటోలూ, వీడియోలూ తీసేసుకోవచ్చు. ఇంకా యాంటీ గ్రావిటీ ఫొటో బూత్‌ కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఓ ఫ్రేములోకి వెళ్లి మనం ఫొటో దిగామంటే గాల్లో తేలిపోతున్నట్టో, తలకిందులుగా కూర్చున్నట్టో ఫొటో వస్తుంది. ఇదివరకే ఆ ఫొటోఫ్రేములో తిరగేసి ఉంచిన వస్తువుల అమరిక వల్లే వెరైటీ ఫొటో వస్తుందన్నమాట. ఇంతకుముందు పెద్ద పెద్ద స్టూడియోల్లో మాత్రమే ఉండే ఈ ఫీచర్లన్నీ ఇప్పుడు నేరుగా ఫంక్షన్లకే వచ్చేస్తున్నాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు