ఇదీ ఒకందుకు మంచిదేగా

‘‘బస్‌ ఆపండి... ఇక్కడ ఎవరయినా డాక్టర్లు ఉన్నారా?’’ అని ఆదుర్దాగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్‌ అసంకల్పితంగా బ్రేక్‌ నొక్కేసరికి, బస్సు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది.

Published : 14 Oct 2023 23:32 IST

కొయిలాడ రామ్మోహన్‌ రావు

‘‘బస్‌ ఆపండి... ఇక్కడ ఎవరయినా డాక్టర్లు ఉన్నారా?’’ అని ఆదుర్దాగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్‌ అసంకల్పితంగా బ్రేక్‌ నొక్కేసరికి, బస్సు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది.

అందరూ ఆనందం చుట్టూ మూగారు. అతని పక్క సీట్లో ఉన్న, మార్కండేయులు గుండెను పట్టుకుని, రొప్పుతున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది. ఊపిరి అందక ఆయాసపడుతుంటే, చుట్టూ చేరిన వారిని పక్కకు నెట్టుతూ,‘‘ఫర్వాలేదు. ఫర్వాలేదు. విశాఖపట్నం దగ్గర్లోకొచ్చేశాం. మీకేమీ కాదు’’ అంటూ మార్కండేయులికి  ధైర్యం చెప్పాడు. రెండు క్షణాలు ఆగి, ‘‘డ్రైవర్‌ గారూ, డైరెక్ట్‌ పోనివ్వకుండా... అదిగో, అక్కడ కనిపిస్తున్న బ్రహ్మంగారి తోట పక్కనుంచి బస్సును పోనివ్వండి. అలా అయితే మనకు నాలుగు కిలోమీటర్లు కలిసి వస్తుంది. అంతేకాదు, అలా వెళ్తేనే, ఆసుపత్రికి దగ్గరవుతుంది’’ అని బతిమాలుతూ అరిచాడు.

‘‘కానీ... కానీ...’’ అంటూ నసిగాడు డ్రైవర్‌. ‘‘మీ రూల్స్‌ గురించీ రోడ్డు గురించీ ఆలోచించకండి. మనిషి ప్రాణం ముఖ్యం’’ అనేసరికి, అందరూ అతనికి వత్తాసు పలికారు. డ్రైవర్‌ తలూపి, బస్సును పక్క రోడ్డులోకి మళ్ళించాడు. ఆనందంతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఎట్టకేలకు బస్సు ఆసుపత్రికి చేరింది. ఆనందంకి ఆసుపత్రి యాజమాన్యంతో బాగా పరిచయం ఉండటం వల్ల, అతని పూచీకత్తుపై, మార్కండేయుల్ని ఐసీయూలో చేర్చడం జరిగింది.

*            *            *

సకాలంలో మార్కండేయుల్ని ఆసుపత్రికి చేర్చడం వల్ల, గండం గట్టెక్కింది. మర్నాడు సాయంత్రానికిగానీ అతనికి స్పృహ రాలేదు. కళ్ళు తెరవగానే, ఆనందం చేయి పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ,

‘‘మిమ్మల్ని ఆ దేవుడే పంపాడండి. బస్సు ఎక్కిన దగ్గరి నుంచి మీరు స్నేహపూర్వకంగా నాతో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తుంటే, నేనే పొగరుతో పట్టించుకోలేదు. ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది. ఈ రోజుల్లో మీలాంటి వారెవరయినా ఉంటారా?’’ అన్నాడు.

‘‘అయ్యో, దాందేముందండీ... నా స్థానంలో మీరున్నా అదే పని చేసేవారు’’ అన్నాడు.

‘‘లేదు లేదు. మీ స్థానంలో నేనుంటే, అలా పట్టించుకునేవాడిని కాదు. నాకెందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటూ సీటు మారిపోయేవాడిని. ఈ లోకంలో నాలాంటి స్వార్థపరులే ఎక్కువ’’ అన్నాడు.

‘‘సర్లే, అది వదిలేయండి. మీరిప్పుడు బాగున్నారు కదా. మీ వాళ్ళకు ఈ విషయం తెలియజేయాలి’’ అనగానే అతని భార్య మహాలక్ష్మి నంబర్‌ ఇచ్చి,

‘‘వాళ్ళు ‘చార్‌ ధామ్‌’ యాత్రకు వెళ్ళారు. అక్కడ సిగ్నల్‌ ఉంటుందో లేదో?’’ అన్నాడు సంశయపడుతూ.

ఆ మాట వినగానే ఆనందం గుండె గుభేలుమంది. చార్‌ ధామ్‌ యాత్రికులు వరద భీభత్సంలో ఇరుక్కున్నారనీ చాలామంది ప్రాణాలు కోల్పోయారనీ టీవీలో చూశాడతను. ఆ విషయం మార్కండేయులుకి చెపితే తట్టుకోలేడని దాచి,

‘‘నిజమే. అక్కడ సిగ్నల్‌ ఉండదు. అయినా ప్రయత్నిస్తాను’’ అన్నాడు.

ఆనందం వెళ్ళిపోయాక, అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు మార్కండేయులు. అతనికి బస్సు ప్రయాణం గుర్తుకొచ్చింది.

*            *            *

‘‘నమస్తే, నా పేరు ఆనందం. మీ పేరు?’’ అన్నాడు బస్సులో అతని పక్కన కూర్చుని పరిచయం చేసుకుంటూ. మార్కండేయులు పరధ్యానంలో ఉన్నట్లు నటించాడు.

‘‘అయ్యా, నా పేరు ఆనందం అని చెప్పాను. మీ పేరు?’’ అని మరోసారి ప్రశ్నించాడు. అతని స్నేహ ధోరణిలో ఏ మార్పూ లేదు. మార్కండేయులి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు.

‘‘విషాదం’’ అని సమాధానం ఇచ్చాడు. అందులో కాస్తంత వెటకారం తొంగి చూసింది. అదేమీ గమనించనివాడిలా,

‘‘ఆఁ ఏమన్నారూ... వినోదం అన్నారు కదూ. బాగుంది, బాగుంది. ఆనందం, వినోదం. మన జోడీ బాగా కుదిరింది’’ అన్నాడు నవ్వుతూ.

మార్కండేయులు విసుగ్గా చూసి,

‘‘ఏదో జోక్‌గా అన్నాను. నా పేరు మార్కండేయులు’’ అన్నాడు.

‘‘ఓ... చిరంజీవి అన్న మాట. బాగుంది’’ అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. మార్కండేయులికి చిరాకు పుట్టింది.

‘‘చిరంజీవి కాదూ పవన్‌ కల్యాణూ కాదు... మార్కండేయులు  అంతే’’ అన్నాడు విసురుగా. కొత్త వాళ్ళతో అలా మాట్లాడటం సంస్కారం కాదు అని అనిపించలేదతనికి. ఆనందంకి ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్ది క్షణాల తర్వాత నోరు విప్పాడు.

‘‘మార్కండేయులు, శివుని వరం వల్ల చిరంజీవి అవుతాడు’’ అంటూ చెపుతుండగా, అడ్డుకున్నాడు మార్కండేయులు.

‘‘ఆ కథంతా నాకు తెలుసండీ. దయచేసి మళ్ళీమళ్ళీ నా పేరు ఎత్తకండి. ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు. పాతకాలంనాటి పేరు పెట్టి నాకు అన్యాయం చేశాడు మా నాన్న’’ అంటూ విసుక్కుంటుంటే,

‘‘అయ్యో, ఎంతమాట అనేశారు? ఎంతమంచి పేరండీ అది’’ అని చెపుతుండగా మళ్ళీ అడ్డుపుల్ల వేశాడు. ‘‘అబ్బబ్బ... నన్ను విసిగించకండి’’ అనగానే, చిన్నబుచ్చుకున్న ఆనందం మరోమాట మాట్లాడలేదు.

ఎవరితోనూ మాట్లాడకుండా ముంగిలా కూర్చోవడం ఆనందంకి కష్టంగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూరప్రయాణం అయినా అవలీలగా చేసేయడం అతనికి అలవాటు. ఎప్పుడూ అలాగే జరిగేది. ఇలాంటి ఘటం తగలడం ఇదే మొదటిసారి. అయినా అతను నిరాశపడలేదు. ‘పోనీ వేరే ఏదయినా టాపిక్‌ మార్చితే ఉపయోగం ఉంటుందేమో?’ అన్న ఆలోచన వచ్చింది. సినిమాల ప్రస్తావన ఎత్తాడు, రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్‌లను చూపిస్తూ. పెద్దగా స్పందన లేదు. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాడు. కాస్త కదలిక కనిపించింది. ఏవో రెండుమూడు మాటలు మాట్లాడాడు. కోటా అయిపోయినట్లుంది. మళ్ళీ సైలెంట్‌ అయిపోయాడు. టాపిక్‌ మార్చి, క్రీడల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులోనూ అతను ఇంట్రెస్ట్‌ చూపించలేదు.

‘ఇతనికి నేనెందుకో నచ్చలేదు. కారణం ఏమై ఉంటుంది?’ అనుకుంటూ తల గోక్కున్నాడు ఆనందం, ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క. కానీ ఆ సమాధానం మార్కండేయులు దగ్గర ఉంది. బలిష్టంగా ఆరోగ్యంగా వయసు పైబడినా తరగని తేజంతో మెరిసిపోతున్న ఆనందం అంటే అతనికి అసూయ. ‘అతనెందుకు అలా ఉన్నాడు? నేనెందుకు ఇలా ఉన్నాను?’ అనుకుంటూ గుండా పిండి అయిపోయాడు.ఇలా గతమంతా గుర్తుకురాగానే, మనసు చేదుగా అయిపోయిందతనికి.

‘ఛీ, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను.ఆయన మంచివాడు కాబట్టి ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకున్నాడు’ అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.

*            *            *

ఆనందంకి అంతా అయోమయంగా ఉంది. తోటి ప్రయాణీకుడు కదా అని మానవత్వంతో సాయం చేయడానికి ముందుకొచ్చాడు గానీ, తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందేమోనని గాభరా మొదలైంది. ‘పాపం అతని కుటుంబీకులు ఏమయిపోయారో?  ఖర్మ కాలి సొంత మనుషులను పోగొట్టుకుంటే, ఈ వయసులో అతన్ని ఎవరు చూస్తారు? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశాక అతన్ని ఎక్కడుంచాలి? ఆసుపత్రి బిల్లు ఎలా కట్టాలి?’ ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర బద్దలయిపోతోంది.ఆ రోజంతా ఫోన్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమోనన్న భయం అతన్ని ఆవహించసాగింది. బాగా డీలా పడిపోయాడు. కానీ సాయంత్రానికి వచ్చిన మెసేజ్‌ అతనిలో ధైర్యం నింపింది. ‘సుమారు పదిహేను మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి. ఎవరు?’ అన్నది ఆ మెసేజ్‌ సారాంశం. వెంటనే బదులిచ్చాడు,

‘మార్కండేయులు గారికి గుండెపోటు వస్తే ఆసుపత్రిలో చేర్చాము. ఇప్పుడు బాగానే ఉన్నారు. నేను ఆయన తోటి ప్రయాణికుడిని. పేరు ఆనందం’ అని.
మళ్ళీ గంటన్నర తర్వాత గానీ మెసేజ్‌ రాలేదు. ‘అదృష్టం బాగుండి, అందరమూ ప్రమాదం నుంచి గట్టెక్కాము. కానీ ఎప్పుడు తిరిగి వస్తామో చెప్పలేము. మీరు ఆయన్ని కాస్త కనిపెట్టుకుని ఉండండి. వీలు కుదరగానే ఆసుపత్రి బిల్లు పంపించేస్తాం’ అని మెసేజ్‌ వచ్చింది.అప్పటికిగానీ అతను కుదుటపడలేదు.

*            *            *

‘‘మీరు గాభరా పడతారని అసలు విషయం చెప్పకుండా దాచాను. చార్‌ ధామ్‌లో వరదలు ముంచెత్తాయి. అయితే మీ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని సందేశం వచ్చింది. ఫోన్‌ మాత్రం కలవడం లేదు.

ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్‌ చేసేస్తున్నారు. కొన్ని రోజులపాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెపుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ప్రయాణం చేయకూడదు. మీవాళ్ళు వచ్చేంతవరకూ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి’’ అన్నాడు ఆనందం. తన దుస్థితిని తలుచుకుని కన్నీరు కార్చాడు మార్కండేయులు. కాదని చెప్పడానికి అతనికి మరోదారి లేదు. కన్నీరు కారుస్తూనే తలూపాడు. అతని కన్నీరు తుడుస్తూ,

‘‘ఛ... బాధపడకండి. కష్టాలు వస్తాయి, పోతాయి. మనం ధైర్యంగా ఉండాలి’’ అని సర్ది చెపుతున్న ఆనందానికి మనసులోనే వేయి దండాలు పెట్టాడు.

*            *            *

ఆనందం బలవంతం మీద అతని ఇంటికి వచ్చాడేగానీ, ‘అతని శ్రీమతీ పిల్లలూ ఆదరిస్తారో లేక ముఖం మాడ్చుకుంటారో’ అన్న భయం అతన్ని ఆవరించింది. ఆనందం కొడుకూ కూతురూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ స్థిరపడ్డారని తెలిసేసరికి, కొంత భయం వీడింది. ఆనందం శ్రీమతి ‘వాసిని’ ఆదరంగా ఆహ్వానించడంతో మిగిలి ఉన్న భయం కూడా పోయింది. అతని కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఆ మర్నాడు మహాలక్ష్మి భర్తతోనూ ఆనందంతోనూ ఫోన్లో మాట్లాడగలిగింది. విశాఖపట్నం చేరుకోవడానికి మరో వారంరోజులు పట్టవచ్చునని చెప్పింది. మార్కండేయులు గురించి దిగులుపడవద్దని భరోసా ఇచ్చాడు ఆనందం.

*            *            *

ఆనందం ఇంట్లో గడిపిన వారం రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నాడు మార్కండేయులు. జీవితాన్ని ఎలా గడపాలీ, ముఖ్యంగా వార్ధక్యం వచ్చాక ఏయే పనులు చేయాలీ, అరవై ఏళ్ళు దాటాక జీవితం ఎలా ఉండాలీ... ఇలాంటి విషయాలన్నీ అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి. ఇంతకాలం తానెంత అవివేకంగా బతికాడో అర్థమైంది. ఆ వాస్తవాలు గ్రహించగానే అతని కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.

ఉద్యోగంలో ఉన్నంతకాలం క్యాంపులూ ఇనస్పెక్షన్లూ అంటూ ఇంటిపట్టున ఉండేవాడు కాదు. భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కుటుంబంతో గడపడం అనే బాధ్యతను ఎప్పుడూ విస్మరించేవాడు. ఒక నియమం  లేదూ నిబద్ధతా లేదు. ఎంతసేపూ ‘ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమెలా?’ అనే ఆలోచనే. తను అనుకున్నది సాధించడానికీ ఉన్నత ఉద్యోగులనూ పెద్దవాళ్ళనూ మచ్చిక చేసుకోవడానికీ మందు పార్టీలు ఇచ్చి, తాను కూడా పీకలదాకా తాగి, ఆరోగ్యం పాడుచేసుకున్నాడు. బానపొట్టతో, ఊబకాయంతో అరవై రెండేళ్ళకే డెబ్భై ఏళ్ళవాడిలా కనిపిస్తున్నాడు. స్నేహాన్ని స్వార్థానికి ముడిపెట్టడం వల్ల, అతను పదవీ విరమణ చేశాక, స్నేహితులంటూ ఎవరూ మిగల్లేదు. అందరూ అవసరం కోసం అతని చుట్టూ చేరినవారే. ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా ఆత్మీయుల కోవలోకి చేరకుండా చేసుకున్నాడు.

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎవరో అన్న మాట అతని విషయంలో నిజమయింది. ఇన్నాళ్ళూ పోషించాడు కాబట్టి, అతనిపట్ల భార్యా పిల్లలూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారుగానీ, దాంట్లో ప్రేమ మాత్రం కొరవడింది. ఆనందం విషయం అలా కాదు. అతనంటే ప్రాణం పెట్టే మిత్రులున్నారు. ఆనందం- వాసినిల అన్యోన్య దాంపత్యమూ, ప్రతి వారం ఫోన్‌ చేస్తూ గంటల తరబడి మాట్లాడే పిల్లల ఆప్యాయతా, ఏడాదికి ఒక్కసారయినా నెల రోజులపాటు అమ్మానాన్నలతో గడపాలన్న వాళ్ళ ఆరాటమూ మార్కండేయుల్ని ముగ్ధుడిని చేశాయి.

‘పదవీ విరమణ చేశాక, జీవితాన్ని ఇలా కూడా గడపవచ్చన్నమాట’ అన్న విషయం ఆనందం దంపతులను చూశాకే అతనికి అర్థమైంది. తనున్న వారం రోజులూ వాళ్ళనే చూస్తూ, పూటకొక కొత్త విషయం తెలుసుకుంటూ వచ్చాడు. ఆనందం-వాసినిల ఆరోగ్య రహస్యం తెలిసిపోయిందతనికి.

ఉదయం లేచిన దగ్గరి నుంచీ వాళ్ళిద్దరూ ఏదో పనిలో నిమగ్నమయి ఉంటారు. అది తోటపని కావచ్చూ వంటపని కావచ్చూ ఇంటిపని కావచ్చూ... ఈ పని వీళ్ళే చేయాలనే నియమమేమీ లేదు వాళ్ళిద్దరికీ. ఆనందం ఆలస్యంగా లేస్తే, వాసిని బయటకు వెళ్ళి పాలూ కూరగాయలూ తెస్తుంది. ఆమెకు నలతగా ఉంటే, ఆనందమే వంటపని చూస్తాడు. ఆవిడ ఇడ్లీ, దోశ లాంటి ఫలహారానికి సిద్ధం చేస్తుంటే, ఇతను పచ్చడి చేసే పనిలో ఉంటాడు. ఆమె కూరలు చేయడానికి ఉల్లిపాయలూ పచ్చిమిర్చీ తరిగి సిద్ధం చేస్తాడు. చింతపండు పులుసు లాంటివిగానీ, కొబ్బరికోరుగానీ సిద్ధం చేసే బాధ్యత, పళ్ళు చక్కగా ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో పెట్టడం, పళ్ళరసాలు తయారు చేయడం లాంటివన్నీ తన నెత్తి మీదే వేసుకుంటాడు.

‘ఇద్దరూ ఉద్యోగాలేవీ లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా, ఎందుకింత హైరానా, తీరిగ్గా చేసుకోవచ్చు కదా?’ అనుకునేవాడు మార్కండేయులు. దానికి సమాధానం అతనికి తర్వాత తెలిసింది.  

‘నేను మగాడిని అన్న అహమే అలంకారం’గా వంటబట్టించుకున్న మార్కండేయులు ఏనాడూ భార్యకు కాసింత సాయం చేయలేదు. పిల్లలకు చదువు చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్నా, ఈ జంజాటం నాకెందుకని వాళ్ళను ట్యూషన్‌కి పంపేసేవాడు. ఎంసెట్‌, ఐఐటీ లాంటి పరీక్షలకు పిల్లలను దిగబెట్టి, వాళ్ళలో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపే పనులు చేసేవాడు కాదు.

పదవీ విరమణ తర్వాత సోఫాకీ టీవీకీ అతుక్కుపోయేవాడు. మంచినీళ్ళయినా, కాఫీ టీలయినా అక్కడికే రావాలి. కొన్నిసార్లు ఫలహారం, భోజనం కూడానూ.

కానీ ఆనందం ఇంట్లో అంతా అందుకు విరుద్ధంగా ఉంది. అతనికి అయోమయంగా ఉంది.

*            *            *

అతనొచ్చిన రెండ్రోజుల తర్వాత,

‘‘మార్కండేయులుగారూ... మరోలా భావించవద్దు. నేనూ వాసినీ బయటకు వెళ్ళాల్సి ఉంది. వంటంతా సిద్ధం చేసేశాం. మా పనిపిల్ల ‘మాలతి’ వడ్డించేస్తుంది. మీకు చెప్పడం మరిచాను, నేను ఇక్కడికి దగ్గర్లో ఉన్న పల్లెటూళ్ళకు వెళ్ళి, అక్కడి రైతులకు వ్యవసాయం గురించి సలహాలు ఇచ్చి, ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ఉంటాను. గతంలో గడించిన అనుభవం ఇలాగయినా ఉపయోగపడితే, నాలుగు గింజలు అదనంగా పండించవచ్చును కదా?

మా వాసిని, అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు ఇంగ్లీషు, లెక్కల పాఠాలు చెపుతూ ఉంటుంది. ఊరికే ఇంట్లో ఉంటే ఏమి తోస్తుంది? సాయంత్రం నాలుగు వరకూ మాకిదే కాలక్షేపం. మీకిక్కడ అలవాటు కావడానికి, రెండ్రోజులు నాగా పెట్టాం. ఇక బాగుండదు. వాళ్ళు మాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరేమీ అనుకోవద్దు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని. ఉచితంగా చేసే సేవయినా నిర్లక్ష్యం ఉండకూడదు కదా? టీవీ, ఏసీ లాంటి సౌకర్యాలన్నీ వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మమ్మల్ని మాత్రం క్షమించేయండి’’ అంటూ చేతులు జోడిస్తున్న ఆనందం వైపే చూస్తూ ఉండిపోయాడు, మాటా పలుకు లేకుండా.

*            *            *

ఉద్యోగ విరమణ చేశాక, ‘నేను ఏ పనీ చేయవల్సిన అవసరం లేదు. భారీగా పెన్షన్‌ వస్తుంది. బోలెడంత డబ్బు గడించాను. ఇన్నాళ్ళూ గాడిదలా చాకిరీ చేసి అలిసిపోయాను. ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. ఇక చేయడానికి మాత్రం ఏముంది?’ అనుకుంటూ బతికేస్తున్న మార్కండేయులు కళ్ళు తెరుచుకున్నాయి.

‘ఛ, నాదీ ఒక బతుకేనా? ఇంతవరకూ ఏదో వయసు ఉంది కాబట్టి ఎలాగోలాగా నెట్టుకొచ్చేశాను. ఇప్పుడొచ్చిన వార్ధక్య బాధలు అధిగమించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా చురుకుగా ఉండాలి. ఏదో ఒక పనిలో నిమగ్నమయి ఉండాలి. సమాజానికి కాస్తో కూస్తో సేవ చేయాలి. అప్పుడే శారీరక ఆరోగ్యమేకాక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పనీ పాటా చేయకుండా సోమరిలా ఉండిపోతే, ఒక నిరర్ధకమయిన వస్తువులా మిగిలిపోతాను. ఎందుకూ పనికిరాని వాడినన్న ఆలోచనతో కుంగిపోతాను. నాకూ ఆనందం గారికీ ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది’ అనుకున్నాడు.

*            *            *

‘భూమ్మీద ఇంతమంది ఉండగా తనకే ఎందుకొచ్చింది గుండెపోటు?’ అని తెగ బాధ పడిపోయే మార్కండేయులుకి తనకొచ్చిన గుండెపోటు ఇప్పుడొక వరంలా తోచింది.

‘ఏ ఉద్దేశంతో అన్నారో ఆనందం గారు, మార్కండేయులు అంటే చిరంజీవి అని. ఆయన చలవ వల్లే బతికి బట్ట కట్టానేమో?  ఏదయితేనేం, ఆ గుండెపోటే నాలో మార్పు తెచ్చింది కదా. ఇదీ ఒకందుకు మంచిదేగా’ అనుకుంటున్న అతని పెదవులపైన దరహాసం మెరిసింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, ఇకపైన తనెలా జీవించాలా అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..