Sunday Story: మనిషితనం

‘‘పదిలక్షలు లోన్‌ మంజూరైంది. ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట’’ అన్న వెంకటేష్‌ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటకు నడిచాడు భూపతి.

Updated : 03 Dec 2023 07:14 IST

- కటుకోజ్వల మనోహరాచారి

‘‘పదిలక్షలు లోన్‌ మంజూరైంది. ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట’’ అన్న వెంకటేష్‌ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటకు నడిచాడు భూపతి.

‘‘ప్లీజ్‌ మామయ్యా, ఈరోజే చివరిరోజు. సంతకం చేయకుంటే లోన్‌ క్యాన్సిల్‌ అవుతుంది’’ అంటున్నా వినకుండా ‘‘నీ లోన్‌కు నా ఉద్యోగాన్ని ఎర వేయాలా? అది కుదరదు. ఇంకేదైనా చూసుకో’’ అంటూ బైక్‌ తీసుకుని వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలి కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడిగిపోయాడు వెంకటేష్‌.

పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్‌ వర్క్‌ చూసుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భోజనం చేసి మూడింటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు. కరీంనగర్‌ నుండి పెగడపల్లికి బైకుమీద గంట ప్రయాణం. పదిలక్షల లోన్‌ కోసం ష్యూరిటీ సంతకం చేయడం అతనికిష్టం లేదు. ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడంపట్ల పెద్దగా ఆసక్తిలేదు భూపతికి.
వెదిర క్రాస్‌రోడ్డు వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకొచ్చి లిఫ్ట్‌ కావాలన్నట్లుగా చేయి ఊపాడు. హెల్మెట్‌లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు. ఆ వ్యక్తి ఆందోళనా ఆదుర్దా కలగలిసిన గొంతుతో ‘‘ప్లీజ్‌ సార్‌... గోపాల్రావుపేట దాకా లిఫ్టివ్వండి ప్లీజ్‌..! చాలా అర్జెంటుగా వెళ్లాలి’’ అన్నాడు. అతను హరినాథ్‌. వెదిర హైస్కూల్లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు.

భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు. హరినాథ్‌లో ఆందోళన ఉధృతం కాగా ‘‘ప్లీజ్‌ సార్‌... ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులొస్తున్నాయట’’ అన్నాడు వెనుక నుండి అరుస్తున్నట్లుగా. భూపతి ఒకసారి వెనక్కి తిరిగిచూసి లిఫ్టిచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడ్‌లో ముందుకు వెళ్ళిపోయాడు.

అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు. ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు, ఎట్లా..? అప్పటికి దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్‌ చేస్తున్నాడతడు.

వెదిర క్రాస్‌రోడ్డు నుండి గోపాల్రావుపేటకు దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్‌ రావాలంటే ఐదవుతుంది. ఒకట్రెండు ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు. లిఫ్టు కోసం చూస్తే... రెండు బైకులు వెళ్ళాయి కానీ, మొదటి రెంటికీ ఖాళీ లేదు. మూడో అతను భూపతి- కనీస కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

అలాగే అసహాయుడై మెయిన్‌ రోడ్డు వైపు చూస్తుండిపోయాడు హరినాథ్‌. రోజూ గోపాల్రావుపేట నుండి వెదిరకు బైక్‌ మీద వచ్చిపోతుంటాడతడు. ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్‌ పంక్చరై ఉంది. చేసేదిలేక టైమ్‌ అయిపోతుందని సమయానికొచ్చిన బస్సెక్కి, క్రాస్‌రోడ్డు నుండి ఆటోలో స్కూల్లో వచ్చిపడ్డాడు.

ఇంటిదగ్గర నెలలు నిండిన భార్య వసంత... తను నాల్రోజులు సెలవు పెడ్తానంటే వారించి పంపించింది. తీరా బడికొచ్చాక డాక్టర్‌ ఇచ్చిన డేట్‌కు పదిరోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు. లంచ్‌ టైమ్‌లో ఫోన్‌ రావడంతో మూడు గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్‌ నుండి క్రాస్‌రోడ్డుకు ఆటోలో ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్ళేందుకు ఏ వాహనమూ దొరకడం లేదు.

ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం- అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్‌ నిచ్చింది. అదీగాక నెలనెలా వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్‌ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం. ఇంటినుండి ఆటోలో బయలుదేరితే పదిహేను ఇరవై నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది. అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్‌. ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరకితే బాగుండని చూస్తున్నాడు. లిఫ్ట్‌ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్‌ రోడ్డువద్దే ఉన్నాడు.
ఎట్లా?

హరినాథ్‌ ఆశగా మెయిన్‌రోడ్డు వైపే చూస్తుండిపోయాడు ‘మరొక ఆపద్బాంధవుడెవరైనా రాకపోతారా’ అని. 

* * * * *

బైకు వెనుక కూర్చున్న హరినాథ్‌ ఉన్నట్టుండి ‘‘ఆపండి... ఆపండి...’’ అని అరిచాడు.

బైకు నడుపుతున్న పెద్దాయన ఉలిక్కిపడి బ్రేక్‌ వేశాడు. ‘‘ఏమైంది... ఏదన్నా పడిపోయిందా..?’’ అన్నాడు వెనక్కి తిరిగిచూస్తూ. దారినపోయే దానయ్య బండిమీద లిఫ్ట్‌ అడిగి కూచున్న హరినాథ్‌ చటుక్కున బండి దిగుతూ ‘‘అదిగో, అక్కడ చూశారా... రోడ్డు కింద ఎవరో బైకుతో సహా పడిపోయినట్లున్నారు’’ అన్నాడు పడిపోయిన బైకు వైపు అడుగులేస్తూ.

పెద్దాయన తను బండి దిగకుండానే ‘‘అర్జెంటుగా పోవాలన్నవ్‌ కదా? నీ ఇంటామెకు పురుటి నొప్పులంటివి మరి..?! జెల్ది పోవాలని లేదా?’’ అన్నాడు.

‘‘ఉంది, ఉంది. కానీ పాపం- ఎవరో ఏమిటో చూద్దాం. రెండు నిమిషాలు ఆగండి’’ అని పడిపోయిన బండివైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్ర్భాంతికి లోనయ్యాడు హరినాథ్‌.

అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఓ వ్యక్తి. తలకు గాయమై రక్తం కారిపోతోంది. ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు. హరినాథ్‌ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు. సన్నగా మూలుగు వినిపించింది.

‘హమ్మయ్య! చనిపోలేదు’ అనుకుంటూ నెమ్మదిగా భుజాలుపట్టి వెల్లకిలా తిప్పాడు. నడివయసులో ఉన్న వ్యక్తి. తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్నా, ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు. గొంతెత్తి అరవలేని స్థితిలో... ‘ఎవరాదుకుంటారా’ అన్నట్లు ఎదురుచూస్తున్నాడు.

అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్‌. రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. హరినాథ్‌ లేచి నిలబడి రోడ్డువైపు చూశాడు. పైన గట్టుమీద నిలబడి వీళ్ళవైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్‌ ఇచ్చిన పెద్దమనిషి.

‘‘రండి సార్‌, ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం. ఎవరి సాయంతోనైనా హాస్పిటల్‌కు తీసుకపోవచ్చు’’ హరినాథ్‌ కింద నుండి అరిచాడు.

‘‘ఏమయ్యా, పెండ్లాం నొప్పుల్తోటుందని అబద్ధం చెప్పి నాతో నొచ్చినవ్‌. గిప్పుడు గీడ గీయనకు సాయం జేద్దమంటవ్‌. ఏందివయా చేసేది? నాకు పని లేదనుకుంటున్నవా? గీయనగాని నడిమిట్ల పుసుక్కుమన్నడనుకో లేనిపోని రంప. నే బోతున్న’’ అన్నాడతను.

‘‘సార్‌... సార్‌... కనీసం పైదాకా సాయం పట్టండీ’’ అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు.

‘‘సాయం లేదు... గీయం లేదు. గాలికోయె కంప నేనంటివెట్టుకోను. నేబోతున్నా...’’ కొద్ది క్షణాల్లో బండి స్టార్టయ్యి వెళ్ళిపోయిన శబ్ధం.

హరినాథ్‌ నిస్సహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు. సంబరపడిపోయిన హరినాథ్‌ ‘‘రండి సార్‌... రండి. మీరన్నా సాయం పట్టండి. పాపం చనిపోయేలా ఉన్నాడు’’ అన్నాడు.

‘‘మీ మనిషేనా?’’ అన్నారు వాళ్ళు సాయంపడుతూ.

హరినాథ్‌ కాదన్నట్లు తల ఊపుతూ ‘‘పరిచయమేమీ లేదు... ఇప్పుడే పడిపోయినట్టున్నాడు. రోడ్డు మీదకు తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు గదా’’ అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు.

‘‘మీ మనిషి కాదంటున్నారు. ఇపుడేం చేద్దామని?’’ అన్నాడు వాళ్ళలో ఒకరు.

‘‘108కి కాల్‌ చేద్దాం!’’

‘‘ఓకే. హాస్పిటల్‌ దాకా తీసుకెళ్ళి, ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి. మేం చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం’’ హరినాథ్‌ వెనుకనుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్‌ చేసుకొని వెళ్ళిపోయారు.

మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్‌ దిక్కులు చూస్తుంటే... అదే టైమ్‌లో జేబులోని ఫోన్‌ మోగింది.

* * * * *

రేర్‌గా దొరికే తన నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూపు ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు... యాక్సిడెంట్‌ బాధితుని పక్క బెడ్‌ పైన పడుకుని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్‌ డాక్టర్‌ సలహా మేరకు నెమ్మదిగా బెడ్‌ దిగి హాల్లోకొచ్చి కూర్చున్నాడు. బాధితుడి జేబులో దొరికిన పాకెట్‌ డైరీలో ఒకే ఒక మొబైల్‌ నంబర్‌ కనిపించింది. ఎవరైనా కానీ అని ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్‌.

108లో అతన్ని కరీంనగర్‌ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు స్రవంతి ఫోన్‌ చేసి వసంతను హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశామనీ డాక్టర్‌ పరీక్షిస్తున్నారనీ చెప్పింది. పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం, అమ్మానాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకింత రిలాక్సయినా- హరినాథ్‌లో తను భార్య చెంతలేనన్న చిన్న చింత మాత్రం మిగిలుంది.
ఈలోపు డాక్టర్‌ బయటకొచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి, వెళ్ళి మాట్లాడొచ్చన్నాడు.

హరినాథ్‌ లోపలికి వెళ్ళగానే బెడ్‌ మీద లేచి కూర్చున్నాడతడు. ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడతడు. హరినాథ్‌ను చూస్తే ఏం మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకింత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు. బెడ్‌ పక్కనే స్టూల్‌ మీద కూర్చున్న హరినాథ్‌ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ... ‘‘నన్ను గుర్తు పట్టిండ్రో లేదో... రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా... కనీసం లిఫ్ట్‌ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను’’ అన్నాడు దాదాపు రోదిస్తున్నట్లుగా భూపతి.

‘‘తెల్సు’’ అన్నాడు సింపుల్‌గా హరినాథ్‌.

భూపతి విస్తుబోతూ ‘‘గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి, నాలాంటోడికి సాయంపట్టి, హాస్పిటల్‌కు తెచ్చి, రక్తమిచ్చి... మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్‌ ఈ రోజుల్లో’’ అతడు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు.

హరినాథ్‌ అతన్ని అనునయిస్తూ ‘‘అది సరే, ఇప్పుడెట్లా ఉంది మీకు?’’ అన్నాడు.

‘‘నాదేముంది సార్‌. మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి’’ ఆన్నాడు ఉద్విగ్నంగా.

అప్పటికే నర్సు వచ్చి ‘‘మీరు కాల్‌ చేసిన వ్యక్తి వచ్చిండు సార్‌’’ అంది.

హరినాథ్‌ లేస్తూ.. ‘‘మీరన్నట్లు... నేను మీకు చేసింది మంచే అయితే, అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్‌’’ అన్నాడు విశ్వాసంగా.

భూపతి ఉద్విగ్నంగా... ‘‘తప్పకుండా... తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. మంచే జరగాలి’’ అంటుండగానే హరినాథ్‌ చేతిలో ఫోన్‌ మోగింది. అటునుండి స్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతోంది... ‘‘బావా, అక్కకు నార్మల్‌ డెలివరీ. పాప... పాప పుట్టింది. అమ్మానాన్నా, పక్కింటి ఆంటీ... అందరం ఇక్కడే ఉన్నాం. ఎవ్రీబడీ హ్యాపీ’’ ఉబ్బితబ్బిబ్బవుతోందామె.

హరినాథ్‌ మొహం వెలిగిపోయింది. ‘‘మీరన్న మంచే జరిగింది సార్‌. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది’’ అతను షేక్‌హ్యాండిచ్చి కదలిపోతుంటే... ‘ఇలాంటివాళ్ళ మంచితనమే... అదే... ఆ మనిషితనమే తమకు ఏ ఆపదా రాదనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనుకుంటా..!’ అనుకుంటుండగా లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్‌.

‘‘ఎట్లా జరిగింది మామయ్యా... ఇందాక హరినాథ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పిండు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెంటనే పరుగెత్తుకొచ్చాను. ఈ గవర్నమెంటు ఆసుపత్రి ఏంటి మామయ్యా... ప్రైవేటు హాస్పిటల్‌కు షిఫ్ట్‌ అవుదాం’’ అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ.

భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు... ‘‘నేనిప్పుడు ‘మనిషితనం’ ఎరిగిన మనిషిని. నాకేం కాదు. ఇక్కడే ఉంటాను. నువ్వు లోన్‌ డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేయడానికి ఇదే చివరి రోజన్నావు కదా! ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా... సంతకం చేస్తాను’’ అన్నాడు.

అంత సడెన్‌గా అతనిలో వచ్చిన పరివర్తనేంటో అర్థంకాక నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..