కళ్లార్పకుండా ఆమెనే చూస్తా...

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగమై- ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగానూ గుర్తింపు సాధించాడు రామ్‌ చరణ్‌.

Updated : 12 Mar 2023 11:47 IST

కళ్లార్పకుండా ఆమెనే చూస్తా...

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగమై- ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగానూ గుర్తింపు సాధించాడు రామ్‌ చరణ్‌. ఈ క్రమంలో ‘మిస్టర్‌ సి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తన మాటల్లోనే...


క్రష్‌

యాభై ఐదేళ్ల వయసులోనూ ఇప్పటికీ అందంగానూ, ఆకర్షణీయంగానూ ఉండే జూలియా రాబర్ట్స్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ‘ప్రెట్టీ ఉమెన్‌’ సినిమా చూసి ఆమెకు వీరాభిమానినయ్యా. జూలియా తెరమీద కనిపిస్తే అలా కళ్లార్పకుండా చూస్తుంటా.


పేరు ఎందుకంటే...

ఓసారి లాస్‌ ఏంజెలెస్‌ వెళ్లినప్పుడు నేనూ, ఉపాసనా మిస్టర్‌ సి అనే హోటల్‌కి వెళ్లాం. దాని యజమాని, షెఫ్‌ అయిన మిస్టర్‌ చిప్రియానీతో చాలాసేపు మాట్లాడాం. అక్కడ ఆహారం, వాతావరణం ఎంతో బాగున్నాయి. ఆ మధుర క్షణాలకు వేదికైన మిస్టర్‌ సి హోటల్‌ పేరు ఉపాసనకు ఎంతగానో నచ్చి... నాకు నిక్‌ నేమ్‌గా పెట్టుకుంది.


మళ్లీ రావు

నా చిన్నతనంలో  నాన్నగారికి సినిమాలతో తీరిక ఉండేదికాదు. ఇప్పుడేమో నాకు ఉండట్లేదు. ఈ క్రమంలో ఆయనతో గడిపింది చాలా తక్కువ. ‘ఆచార్య’ చిత్రీకరణ సమయంలో 25 రోజులపాటు లేచింది మొదలు పడుకునే వరకూ నాన్నగారితోనే ఉన్నా. ఆ సమయం నాకెంతో ప్రత్యేకం.


క్రమం తప్పను

ఏడాది ఆరంభంలోనూ, చివర్లోనూ- నా పుట్టినరోజు తరవాతా అయ్యప్ప మాల వేసుకుంటా. ఆంజనేయుడికి కూడా భక్తుణ్నే. మాల, పూజల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలానే నిష్ఠగా చేసే దీక్ష వల్ల మన మీద మనకు ఎంత నియంత్రణ ఉందో అర్థమవుతుంది.


లక్కీ సినిమా

అవార్డుల పంట పండిస్తూ... ఆస్కార్‌కి నామినేట్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో భాగంగా జపాన్‌లో ఉన్నప్పుడే తండ్రి కాబోతున్నట్టు తెలిసింది. అందుకే 2022నూ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నూ లక్కీగా భావిస్తున్నా. అయితే, ప్రయాణాల వల్ల ఉపాసనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా. కనీసం ప్రసవ సమయంలోనైనా తనతో ఉండాలనుకుంటున్నా.


బాధపడ్డా...

‘సైరా’ పతాక సన్నివేశాల్లో నాన్నగారిని ఉరి తీస్తారు. ఆ దృశ్యాన్ని తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. తల తెగి ఉన్న ఆయన్ని చూడలేకపోయా. నిజానికి ఆ సీన్‌ ఎలా చేయాలో నిర్ణయించుకోవడానికి మాకు రెండు నెలలు పట్టింది.


లుంగీ ఇష్టం

ఈ కాలం అబ్బాయిల్ని ఇష్టమైన డ్రెస్‌ ఏమిటంటే షర్ట్‌, టీ షర్ట్‌, జీన్స్‌, బ్రాండెడ్‌ వేర్‌ ఇలా ఏవో చెబుతుంటారు. నాకు మాత్రం తెల్ల లుంగీ చాలా ఇష్టం. సాయంకాలం దాదాపుగా అవే కట్టుకుంటా. ‘రంగస్థలం’ కథ చెప్పడానికి సుక్కూ వచ్చినప్పుడు నేను లుంగీనే కట్టుకుని ఉన్నా. నా ఇష్టం తెలిసిన అక్క ఆ సినిమా కోసం రకరకాల రంగుల లుంగీలూ, తువాళ్లూ డిజైన్‌ చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..