స్వర్గ నరకాలు

భూమిపై ఆయువు తీరగానే పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళి అక్కడి సుఖాలు అనుభవిస్తారని, పాపాత్ములను యమదూతలు నరకానికి తీసుకుపోయి అనేక రకాల శిక్షలకు గురిచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. రకరకాల పాపాలు చేసేవారిని శిక్షించడానికి అంధతామిస్రం, రౌరవం వంటి ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయని శివపురాణం పేర్కొంది.

Published : 25 Jan 2022 00:22 IST

భూమిపై ఆయువు తీరగానే పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళి అక్కడి సుఖాలు అనుభవిస్తారని, పాపాత్ములను యమదూతలు నరకానికి తీసుకుపోయి అనేక రకాల శిక్షలకు గురిచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. రకరకాల పాపాలు చేసేవారిని శిక్షించడానికి అంధతామిస్రం, రౌరవం వంటి ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయని శివపురాణం పేర్కొంది. నరకానికి వెళ్ళేదారి- దుర్గంధం నిండి ఘోరాంధకారం వ్యాపించి ఉంటుంది. పాపులను శిక్షించడానికి ఇనుప ముక్కులు కలిగిన కాకులు, గద్దలు ఉంటాయి. కొన్నిచోట్ల వేడి ఇసుక, కాల్చిన పెద్ద పెద్ద ఇనుప గుళ్లు, అన్నిచోట్ల పాత్రలలో మరుగుతున్న తైలం, వాడి ముళ్లతో కూడిన బూరుగుచెట్లు ఉంటాయని మహాభారతం స్వర్గారోహణ పర్వం నరకాన్ని వర్ణించింది. ఈ వర్ణనలు చదివినవారు పాపాలు చేయడానికి భయపడతారు. మనిషి తన ప్రవర్తనతో ఇహలోకంలోనే స్వర్గ నరకాలను స్వయంగా సృష్టించుకుంటాడు.
శాంత స్వభావులు, సమస్త జీవులయందు దయగలవారు, పరోపకార పరాయణులు, సంప్రాప్తించిన దానితో సంతృప్తి చెందేవారి గృహాలు ఆనంద నిలయాలు. ఉదయాన్నే భగవంతుని ధ్యానించి, కార్యోన్ముఖుడై, నీతి నియమాలతో న్యాయబద్ధంగా సంపాదించే వారు సంతృప్తికర జీవనాన్ని గడపగలుగుతారు. మనోవేదన వారి దరి చేరదు. ధర్మపథంలో పయనిస్తూ నియమబద్ధ జీవితాన్ని గడిపేవారి స్వగృహమే స్వర్గతుల్యం.
తాను సృష్టించిన మనిషి దారి తప్ప కూడదని శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా భూమిపై అవతరించి, పదహారు సద్గుణాలతో శోభించి, సత్యధర్మాలను స్వయంగా ఆచరించి మానవాళికి ఆదర్శప్రాయుడైనాడు. నరకాసు రాది రాక్షసులను సంహరించి,  శ్రీకృష్ణుడు రాక్షస ప్రవృత్తి గలవారిని, అధర్మపరులను భగవంతుడు శిక్షించక మానడని సందేశ మిచ్చాడు. తాను ఉపదేశించిన గీతను అర్థం చేసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకొమ్మని భగవంతుడి సందేశం.
అత్యంత నిర్మల మనస్కులై ఎల్లప్పుడూ శ్రీహరినే మనసులో నిలిపి ధ్యానించే సత్పురుషుల జోలికి వెళ్లవద్దని యముడు తన కింకరులను ఆదేశించినట్లు విష్ణుపురాణం పేర్కొంది.
కలియుగంలో పాపవలయం నుంచి మనిషిని తప్పించే మార్గం భగవత్‌ చింతన మాత్రమేనని, నిష్కల్మష చిత్తంతో నిర్మలమైన బుద్ధితో సర్వేశ్వరుణ్ని స్మరించిన వారికి భగవదనుగ్రహం లభిస్తుందని, పరమేశ్వరారాధన పాపచింతనలను        దరికి రానీయదని శివపురాణం బోధిస్తోంది.
మూఢత్వం లేకపోవడం, కామక్రోధాలను త్యజించడం, దైన్యం, గర్వం, ఉద్వేగాలకు దూరంగా ఉండటం, నిష్కామభావంతో మనసును, శరీరాన్ని, వాక్కును నిగ్రహించుకోవడం ద్వారా మోక్షానికి శుద్ధమైన, నిర్మలమైన మార్గాన్ని ఏర్పరచుకోవాలని మహాభారతం ఉద్బోధిస్తోంది.
హరినామ స్మరణ మాత్రంగానే ముక్తి కరతలామలకమవుతుందని సూతుడు శౌనకాది మునులకు చెప్పినట్లు పురాణాలు ప్రవచిస్తున్నాయి. భగవంతుణ్ని నమ్మినవారు సక్రమమైన మార్గంలో పయనించి ఆనందాన్ని అనుభవిస్తారు.
క్షీరాన్ని గ్రోలేవాడు పాల మాధుర్యాన్ని అనుభవిస్తాడు, ఆరోగ్యంతో వర్ధిల్లుతాడు. మద్యం సేవించేవాడు మత్తులో జోగుతాడు. శరీరం బలహీనమై చిత్తవుతాడు. మంచి చెడుల విచక్షణ కలవాడు ఇహలోకంలోనే స్వర్గం సృష్టించుకుంటాడు.

- ఇంద్రగంటి నరసింహమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని