అనిమిత్త భయం

మహాభారత ఇతిహాసం ఒక శునకం కథతో ప్రారంభమవుతుంది! కుక్క అంటే అది సామాన్యమైన కుక్క కాదు... మాట్లాడే ఆడ కుక్క... దేవతల కుక్క... పేరు సరమ! కోపం పనికిరాదని, నియమనిష్ఠలతో యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే ఘనుడని చెప్పే కథ ఇది...

Published : 09 May 2022 00:17 IST

హాభారత ఇతిహాసం ఒక శునకం కథతో ప్రారంభమవుతుంది!

కుక్క అంటే అది సామాన్యమైన కుక్క కాదు... మాట్లాడే ఆడ కుక్క... దేవతల కుక్క... పేరు సరమ! కోపం పనికిరాదని, నియమనిష్ఠలతో యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే ఘనుడని చెప్పే కథ ఇది. ‘ఎదుటివాళ్లు కానిమాటలు మాట్లాడినా పట్టించుకొనకపోవడం, ప్రతీకారానికి పూనుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం’ అని హితం ఉపదేశించే దివ్యగాథ సరమది. స్నేహంతో ఉన్నవారిని అకారణంగా తూలనాడేవారికి సమీపంలో ఉండరాదని సలహా ఇస్తున్నది సరమ చరిత్ర. బలహీనులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే- ఎప్పటికైనా ఆ పాపం కట్టి కుడుపుతుందని వ్యాసమహర్షి భారతం ప్రారంభంలోనే హెచ్చరించాడు!

భయాలు రెండు విధాలు... నిమిత్త భయం, అనిమిత్త భయం. కొన్ని భయాలకు కారణం ఉంటుంది. కొన్నింటికి ఉండదు. నిరపరాధులను బాధిస్తే, ఏ సూచనా లేకుండానే భయాలు కలుగుతాయి. మనుషుల మధ్య ఏదో ఒక కారణంతో శత్రుత్వం కలుగుతుంది. జంతువులకు పుట్టుకతోనే వైరం ఉంటుంది. ఎలుకకు పిల్లిని చూస్తే భయం. పిల్లికి కుక్కను చూస్తే భీతి. పాములు, పులులను చూస్తే మనిషికి భయం! మనిషిని చూస్తే ప్రాణులన్నింటికీ భయమే! చివరికి సాటి మనిషిని చూసి మనిషే భయపడు తున్నాడు. బలహీనులను చూసి ఎవరూ భయపడరు. కానీ, బలహీనులపట్ల అమానుషంగా ప్రవర్తించేవారికి అనిమిత్త భయం కలగక తప్పుదు. దీనికి విరుద్ధ స్థితిలో కలిగేవి నిమిత్తభయాలు.

సరమ సంగతి రుగ్వేదంలోను వరాహపురాణంలోను కనిపిస్తుంది.  నిరుక్తకారులు ‘మాధ్యమిక వాణి’గా సరమను పేర్కొంటారు. దీని అర్థం ‘మేఘగర్జన’. వర్షాలు లేక బాధపడే ప్రజలు హఠాత్తుగా మేఘగర్జన విన్నప్పుడు ఆశ్చర్యపడే దృశ్యాన్ని గురించి చెప్పే సందర్భంలో వేదంలో ఈ పదం ఉంది. వరాహపురాణంలో సరమ పాత్ర ప్రవేశిస్తుంది. దేవతల గోవులకు కాపలా కాస్తూ ఉంటుంది. రాక్షసులు సమయం చూసి ఆ గోవులను కాజేశారు. దేవతలు ఇంద్రుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు గోవులకు కాపలాగా ఉన్న సరమను పిలిచి ప్రశ్నించాడు. సరమ ‘నాకు తెలియదు’ అని అబద్ధం చెప్పింది. సరమ రాక్షసుల వద్ద లంచం తీసుకొని ఆవులను అసురులకు ఇచ్చింది. ఇంద్రుడు కోపించి సరమను కొట్టాడు. దానితో సరమకు బుద్ధి వచ్చి జరిగింది చెప్పింది. ‘అయితే నువ్వే వెళ్ళి గోవులను తీసుకొని రా!’ అని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. ‘మరి నేను వెళ్లిపోతే నా పిల్లలకు పాలు ఎలా? దయతో వాటికి ఆవు పాలను ఇప్పించు!’ అని సరమ ప్రార్థించగా ఇంద్రుడు అంగీకరించాడు.

ఇక భారతంలో సరమ కథ- జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం ప్రారంభించాడు. ఆ సమయంలో సరమ కుమారుడు ఆడుకుంటూ ఆ యాగ ప్రాంతానికి వెళ్ళాడు. జనమేజయుడి తమ్ముళ్లు పసివాడని చూడకుండా సరమ కొడుకును కొట్టి హింసించారు. ఈ సంగతి సరమకు తెలిసింది. ‘అభంశుభం తెలియని పసిబిడ్డ అయిన నా ముద్దుల కొడుకును అనవసరంగా నీ తమ్ముళ్లు కొట్టి హింసించారు. పేదవారిని, సాధువులను, బలహీనులను హింసించేవారికి అనిమిత్త భయాలు కలుగుగాక!’ అని శపించి సరమ అదృశ్యం అయింది. దీన్ని భారత నీతిగా మనం గ్రహించవచ్చు!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని