ఎనిమిదో అడుగు

త్రేతాయుగం నుంచే వివాహ వ్యవస్థ ఉందని పురాణాలు చెబుతున్నాయి. వివాహం ఒక సాంఘిక సంప్రదాయం, సామాజిక సదాచారం. మనుషులకు వివాహ వ్యవస్థ అనేది లేకపోతే పశువులకు, మనుషులకు

Published : 02 Jul 2022 00:14 IST

త్రేతాయుగం నుంచే వివాహ వ్యవస్థ ఉందని పురాణాలు చెబుతున్నాయి. వివాహం ఒక సాంఘిక సంప్రదాయం, సామాజిక సదాచారం. మనుషులకు వివాహ వ్యవస్థ అనేది లేకపోతే పశువులకు, మనుషులకు వ్యత్యాసం ఉండేది కాదు. బంధాలు అనుబంధాలు ఉండేవి కావు. వివాహ వ్యవస్థ వల్లనే మనుషులు సామాజిక, సాంకేతిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించగలిగారనడం నిస్సందేహం.

ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్న పద్ధతితోనే వివాహ వ్యవస్థ మొదలైంది. భర్త అనే సూర్యరశ్మి భార్య అనే స్వాతిచినుకు ద్వారా ప్రయాణించి, పరావర్తనం చెందితే జీవితం అనే ఆకాశ తనువున ఏర్పడేదే దాంపత్యం అనే ఏడురంగుల హరివిల్లు. జీవనవనంలో దాంపత్యం సప్తవర్ణ, సంశోభిత, సుపరిమళ వర్ణకావ్యం. దంపతుల కలల కొలనులో కలువ బాలల్ని పూయించే నిత్య ఉషోదయం. కళ్ళలో కాంతిని, హృదయాల్లో శాంతిని ఎల్లప్పుడూ నింపే నిత్యనూతన ఉత్ప్రేరకం దాంపత్యం. దంపతుల మధ్య నిబద్ధత, నమ్మకం, ప్రేమ, పరస్పర అభిమానం, గౌర వం ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి. అప్పుడే రెండు గుండెల చప్పుడు ఒకటిగా వినిపిస్తుంది. అలా వినగలిగినవారే ఒక గుండె గూడు కింద ఎన్ని దశాబ్దాలైనా కలిసి జీవితాన్ని పంచుకోగలరు.

దాంపత్యం విజయవంతంగా కొన సాగాలంటే ఇరువురి ఆలోచనలూ వేర్వేరుగా ఉన్నా ముగింపు మాత్రం ఒక్కటిగా ఉండాలి. అప్పుడే ఇరువురి మధ్య స్వేచ్ఛగా భావప్రసారం కొనసాగుతుంది. జీవిత భాగస్వామిని ప్రేమించడం కంటే పరస్పరం ఇష్టపడటం, గౌరవించడంపైనే దాంపత్య బంధం పటిష్ఠంగా బలపడుతుంది. దీర్ఘకాల దాంపత్య బంధాల్లో ఇరువురి మధ్య ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కానీ ఇద్దరి మధ్య ఇష్టం, గౌరవం ఉంటే తుది శ్వాస వరకు ఆ బంధాన్ని నిత్యనూతనంగా మలచుకోవచ్చు.
సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. రాముడు చెంతనుండ అరణ్యములే అపరంజి మేడలౌ... అనే దృష్టి సీతాదేవిది. ఆమె సద్వర్తన, సౌశీల్యంతోనూ, సకల గుణాభిరాముడు ఏకపత్నీవ్రత నియమంతోనూ సీతారాములుగా నేటికీ మన్ననలు అందుకొంటున్నారు. దంపతులు ఏ విధంగానూ తమ ధర్మాన్ని విస్మరించరాదు. ధర్మవిరుద్ధమైన కార్యాలను చేయరాదు. అధర్మ కార్యాలకు పాల్పడితే అది వివాహ విచ్ఛేదానికి దారితీస్తుంది. దీని ప్రభావం ఇరువురి జీవితాలపైనే కాక వారి సంతానం, కుటుంబం, సమాజాలపై ప్రసరిస్తుంది. దాంపత్య జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం ఎలాగన్న ప్రశ్నకు ఒకరి కోసం మరొకరు శ్వాసిస్తున్నాం అనుకోవాలి అని బదులిచ్చారు స్వామి రామతీర్థ.

వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన స్త్రీపురుషులు నాతిచరామి అంటూ ఒకటిగా ఏడడుగులు నడుస్తారు. జీవితాన్ని పంచుకోవడానికి వేసే ఎనిమిదో అడుగుతోనే దాంపత్య పరిపూర్ణత సిద్ధిస్తుంది. అప్పుడే ఏడడుగుల పాణిగ్రహణ జీవితానికి ఎనిమిదో అడుగు ప్రామాణిక పునాది అవుతుంది.

- ఎం.వెంకటేశ్వర రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని