సార్థక జీవన సూత్రాలు

దినదిన ప్రవర్ధమానులై బాలలు పౌరులుగా మార్పుచెందుతారు. తల్లిదండ్రుల రెక్కల చాటున పెరిగి విద్యాబుద్ధులతో స్వతంత్రులుగా సమాజంలోకి అడుగు పెడతారు. అది గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుకగా మారే దశ. ఓర్పు నేర్పులతో ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాల్సిన

Published : 19 Sep 2022 01:00 IST

దినదిన ప్రవర్ధమానులై బాలలు పౌరులుగా మార్పుచెందుతారు. తల్లిదండ్రుల రెక్కల చాటున పెరిగి విద్యాబుద్ధులతో స్వతంత్రులుగా సమాజంలోకి అడుగు పెడతారు. అది గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుకగా మారే దశ. ఓర్పు నేర్పులతో ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాల్సిన సమయం. పౌరధర్మాలు తెలుసుకొని సక్రమంగా అడుగులేస్తే ఉత్తములుగా పేరు గడిస్తారు. పుట్టుకతోనే మనిషికి లభించిన గొప్ప వరం చిరునవ్వు. మందహాసాన్ని ముఖాన నిలిపి కష్టసాధ్యమైనవాటినీ సులభతరం చేసుకోవచ్చు. చిరునవ్వుతో కూడిన సంభాషణ కీర్తి గౌరవాలను ఆర్జించి పెడుతుంది. కఠినమైన సమస్యలను కరిగించివేస్తుంది. ప్రేమాభిమానాలు పెంచి పరుల మదిలో శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. కష్టంలో కూడా చిరునవ్వు విసిరేవాళ్లే స్థితప్రజ్ఞులు. మనుషులను దగ్గరచేసేది అందమైన భాష. భావప్రకటన సంస్కా రవంతమైతే స్నేహబాంధవ్యాలు పటిష్ఠ మవుతాయి. మాట రెండంచుల కత్తి లాంటిది. మెత్తగా ఉపయోగించి మిత్రులను పెంచుకోవచ్చు. కఠినంగా వాడి వైరం కొనితెచ్చుకోవచ్చు. మాట తూటా లాంటిది. ప్రయోగమే తప్ప ఉపసంహరణ లేనిది. ‘పరిధి దాటని మాట విజయానికి బంగారుబాట’ అంటారు రమణ మహర్షి. మృదువైన పదప్రయోగంతో మొండివారిని కూడా దారికి తీసుకురావచ్చు. అర్థరహిత  మాటలు, అసందర్భ ప్రలాపాలు సమస్యలను సృష్టిస్తాయి. పెద్దల వాక్కులు పెన్నిధిరాశులు. పూర్వీకుల అనుభవాలు అపార జ్ఞానబోధలు. వారి మాటల్ని తోసిపుచ్చక ఆలోచించి పాటించాలి. జటిల సమస్యల పరిష్కారానికి అవి ఎంతో ఉపకరిస్తాయి.

ఎంతటి ఉన్నతులనైనా, ఉత్తములనైనా బలహీనపరచేవి కాంతాకనకాలు. అవి నోరు తెరిచిన తిమింగిలాల్లాంటివి. అప్రమత్తం కాకపోతే వాటి బారినపడి జీవితాన్ని కోల్పోతారు. తారసపడే తరుణుల్లో తల్లిని, తోడబుట్టిన చెల్లిని చూసి గౌరవించాలి. పరస్త్రీలను మాతృమూర్తులుగా గౌరవించేవారే మహనీయులు. అపమార్గం తొక్కితే జీవితం కాలిపోయి కూలిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో పోటీతత్వం ఉండాలి. ఇతరుల కంటే ముందు నడవాలి అనేది ప్రధాన సూత్రం. అంతర్గతంగా ఎన్నో రహస్యాలుంటాయి. గుండెల్లో వాటిని పదిలంగా భద్రపరచుకోవాలి.

నిత్యం తారసపడేవారిలో చిన్నవారినైనా, పెద్దలనైనా స్థాయీభేదం లేక తప్పనిసరిగా గౌరవించాలి. ఇచ్చిపుచ్చుకోవడం మనిషి ధర్మం. చిన్న వారని హీనంగా చూస్తే ఒక్కోసారి వారినుంచి ఊహించని రీతిలో పాఠాలు నేర్వాల్సి వస్తుంది. పూర్వం గురుకులాల్లో విద్యతోపాటు సంఘజీవనం, సుఖదుఃఖ- సమస్వీకరణ, ఓర్పు నేర్పు, ఔదార్యపు విలువలు బోధించేవారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురుశుశ్రూష చేస్తూ సర్వవిషయాలను ఆకళింపు చేసుకుని గురువుల మెప్పు పొందారు. భోగజీవితాన్ని వదిలి కందమూలాలకు, కఠిన భూశయనానికి అంకితమయ్యారు. దురదృష్టవశాత్తు నేడు పాఠశాలల్లో పిల్లలను పాఠ్యాంశాలకే పరిమితం చేస్తూ సంఘజీవన బోధనాంశాలను విస్మరిస్తున్నారు. ఈ స్థితినుంచి బయటపడాలి. చుట్టూ ఉన్న జీవితాలను బాలలు నిశితంగా పరిశీలించాలి. సమాజంలో నలుగురినీ కలుపుకొని ఎలా ముందుకు నడవాలో వారికి వివరించాలి. సాటివారిని ఎలా గౌరవించాలో చెప్పాలి. బాలలు నవభారత భాగ్య విధాతలయ్యేందుకు తోడ్పడాలి.

- మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని