బతుకు భారతం

మనిషికి అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. ఎవరికి వారు వారి స్వభావాలనుబట్టే ప్రవర్తిస్తుంటారు. కష్టాలను తప్పించుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేస్తూనే, సుఖాల కోసం పరుగులు తీస్తుంటారు.

Published : 10 Nov 2022 01:34 IST

నిషికి అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. ఎవరికి వారు వారి స్వభావాలనుబట్టే ప్రవర్తిస్తుంటారు. కష్టాలను తప్పించుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేస్తూనే, సుఖాల కోసం పరుగులు తీస్తుంటారు.

గుహల్లో నివసించే మనిషి ‘నీ సంపద నాది’ అన్నాడు. తన బలాన్ని ప్రదర్శించాడు జంతువులాగా. రాతియుగపు మానవుడు చేసిన అనైతికమైన పనులు ఈ రోజున చెల్లుబాటు కావు. మనిషి నైతికతకు ఎంతవరకూ కట్టుబడి ఉన్నా పూర్తిగా తన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. మరొకరి సంపదను దోచుకోవాలనుకునేవారు, పరస్త్రీలను వశపరచుకోవడంలో ఆనందం వెతుక్కునేవాళ్లు నేటికీ కనిపిస్తూనే ఉంటారు. మనిషిలో ప్రవృత్తులకు, అంతరాత్మకు మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

ప్రతి క్షణం భారం చాలామందికి. ప్రతి పరిస్థితీ నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. పరస్పర చర్య ఉద్రిక్తతకు దారితీస్తుంది. అహం నిండిన గుండెకు ఎప్పుడూ నిప్పులమీద నడకే. అహం నింపుకొన్న మనిషి అనుక్షణం ప్రతి పరిస్థితిలోనూ గెలుపుకోసం పోరాడుతుంటాడు. ఇతరులకంటే తాను గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయంతో బతుకుతాడు.

మహాభారతం విశాల విశ్వంలోని ప్రతి అంశాన్నీ ప్రతిబింబిస్తుంది. ఈ మహేతిహాసంలోని పాత్రలు చిన్నా- పెద్దా, మంచీచెడు, ప్రాముఖ్యం కలిగినవి, లేనివి... అన్నీ ఏ కాలానికైనా పోల్చదగినవి. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు... కనిపించని కాలం గోచరించదు.

భిన్న మనస్తత్వాలు, చిత్రమైన గుణగణాలు కలిగిన మనుషులు ఇందులో కనిపిస్తారు. ఇది వ్యక్తిత్వాలకు దర్పణం పట్టే పవిత్ర గ్రంథం. విభిన్న వ్యక్తిత్వాలు గలవారితో ఎలా వ్యవహరించాలన్నది తెలుసుకోవడం, తెలుసుకుని మసలుకోవడం కోసం మనం అభిమానించేవి కొన్ని, గుర్తించుకునేలాంటివి మరికొన్ని మహాభారత పాత్రలు. ద్రౌపది- అయిదు గొప్ప గుణాలు కలిగిన భర్తను కోరుకుంటుంది. ఒకరిలోనే ఆ గుణాలు కనబడక అయిదుగురిలో చూసుకుంటుంది.
భారతంలో మంచివాళ్లు సైతం తప్పులు చేస్తారు... అయితే, వారి ఉద్దేశాలు హానికరమైనవి, చెడ్డవి కావు. ఎవరూ పరిపూర్ణులు కారు అనడానికి అది తార్కాణం. ఒక చిన్న లోపం కూడా పాత్రకు అందాన్ని జతచేస్తుందనిపిస్తుంది.  మనిషి తన లోపాలను కనబడకుండా దాచాలనే ప్రయత్నం చేయకూడదు. కపట ధోరణి పనికిరాదు. వ్యక్తిత్వం మెరుగుపడాలంటే ఆత్మపరిశీలన అవసరం, తమకు తాము నిష్పాక్షికంగా తప్పొప్పులను స్వీకరించే గుణం పెంచుకోవాలి. ఏ మనిషైనా బాధతో జీవించడానికి లెక్కలేనన్ని మార్గాలున్నాయి. సంతోషంగా జీవించాలంటే మాత్రం కొన్ని మార్గాలే కనిపిస్తాయి. సంతోషంగా ఉండటానికి అవసరమైన మార్గాలను పెంచుకోవడం, బాధపెట్టేవాటిని తగ్గించుకోవడంలోనే మనిషికి వివేకం అవసరమవుతుంది. వివేకం కలిగిన మనిషి జీవితం నందనవనం.

- మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని