పరమార్థం

శ్రీరామచంద్రుడు ధర్మావతారుడు, ధర్మమే రాముడి రూపంలో అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. రామచంద్రుడిలోని స్థితప్రజ్ఞ లక్షణం అతడి జీవితానికే వెన్నెముకగా నిలిచింది. స్థితప్రజ్ఞ అంటే- ఆనందం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం అనేవి లేకుండా మనసు చలించకుండా సమభావంతో జీవితాన్ని గడపడం.

Published : 22 Nov 2022 00:31 IST

శ్రీరామచంద్రుడు ధర్మావతారుడు, ధర్మమే రాముడి రూపంలో అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. రామచంద్రుడిలోని స్థితప్రజ్ఞ లక్షణం అతడి జీవితానికే వెన్నెముకగా నిలిచింది. స్థితప్రజ్ఞ అంటే- ఆనందం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం అనేవి లేకుండా మనసు చలించకుండా సమభావంతో జీవితాన్ని గడపడం. తనవారు, పరాయివారు అనే భేద భావంతో కాకుండా అందరినీ సమభావంతో చూశాడు రాముడు. గుహుణ్నీ భరతుడితో సమానంగా సోదరుడిగానే చూశాడు. రాముడి ప్రవర్తనలో పెద్దా చిన్నా అనే భేద భావం, నిమ్న కులస్థుడూ ఉన్నత కులస్థుడూ అనే తేడాలు కనిపించవు. ఈ సమభావాన్నే రాముడి జీవితం నుంచి స్వీకరించడానికి మనం సన్నద్ధులమైననాడు పరమార్థం వైపు పయనించగలుగుతాం.

జయాపజయాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు, శోకహర్షాలు మొదలైన ద్వంద్వ భావాలతో చిత్తం నిశ్చలంగా ఉండటాన్నే కృష్ణపరమాత్మ యోగమని గీతలో ఉద్బోధించాడు. అందుచేత సమబుద్ధి కలిగిన వ్యక్తి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే షడ్వికారాలను జయించి పరమానందాన్ని(మోక్షాన్ని) పొందగలుగుతాడని మనం గ్రహించాలి.

‘విశ్వమందంతటా భగవంతుడు(విష్ణువు) వ్యాప్తమై ఉన్నాడు. ఇందులో సందేహం లేదు’ అని భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి ఎదుట స్పష్టీకరించాడని పోతన సరళమైన పదజాలంతో సర్వులకూ తేటతెల్లం చేశాడు. భగవంతుడు సకల ప్రాణుల్లోనూ నిండి ఉన్నాడు. ఈ ప్రాణులన్నీ అతడి సంతానమే. తన సంతానమైన మనలనందరినీ అతడు సమానంగానే చూస్తాడు. ఏ ప్రాణినీ ద్వేషించడు. అందుచేత అతడి వారసులం, జ్ఞానవంతులం అయిన మానవులం కూడా ఏ ప్రాణి పట్లా ద్వేషభావాన్ని చూపించకూడదు. సమభావాన్నే కనబరచాలి. అన్ని జీవుల పట్ల సమదృష్టి కలిగి ఉండాలని గీతలో కృష్ణపరమాత్మ చెప్పినదదే.

సమదృష్టితో సకల జీవుల్ని చూడటమంటే- ఉన్నతుడూ నీచుడూ అనే భేద భావం లేకుండా ప్రాణులన్నింటినీ ప్రేమతో దయతో చూడాలని మనం గ్రహించాలి. ఇరుగు పొరుగువారిని సోదరులుగా భావించి మనతో సమానంగా చూడాలి. వారి కష్టాలను మన కష్టాలుగా భావించి వాటిని దూరం చేయడానికి త్రికరణ శుద్ధితోప్రయత్నించాలి. అప్పుడే విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే ‘గీత’లోని అమృత వచనానికి మనం నిలువుటద్దాలం కాగలం.

జడ చేతన మయమైన ఈ ప్రకృతిలో అంతటా పరమాత్మ భాసిస్తున్నాడు. ఆ పరమాత్మే సకల జీవుల్లోనూ ఆత్మగా నెలకొని ఉన్నాడు. మరి అలాంటప్పుడు మానవులమైన మనం ఇతర జీవరాశిపై ద్వేషభావాన్ని ఎలా చూపించగలం? చూపించలేం. చూపిస్తే పరమాత్మను ద్వేషించినట్లవుతుంది. మనల్ని మనమే ద్వేషించుకున్నట్లు అవుతుంది. అందుచేత మనలో ఉండవలసింది ప్రేమ భావమేగానీ ద్వేషభావం కాదు. ఈ సమభావమే ‘లోకమంతా నాదే’ అనే సన్మార్గంలో మనల్ని నడిపిస్తుంది. సమభావం పరార్థభావనకు మూలమవుతుంది. పశువులకు చేసే సేవ పరమాత్ముడికి చెందుతుంది. ఎందుకంటే జీవులకు చేసిన సేవ శివుడికి చెందుతుందని శాస్త్ర వచనం కదా! ఈ సేవానిరతితోనే పరమార్థ భావన వైపు మన ప్రయాణాన్ని కొనసాగించాలి. పరులకు మనం చేసిన సేవ పరమాత్ముడిపై మనకు గల భక్తిని నిరూపిస్తుంది. ఈ భక్తి సాధనం ద్వారా ముక్తి సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు.

- కాలిపు వీరభద్రుడు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు