మరణ శాసనం

మనిషి తన జీవితకాలంలో ఎంతో కొంత సంపద ఆర్జిస్తాడు. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కాని, బీదవాడిగా మరణించడం తప్పు’ అంటారు. ఎంతో కిందిస్థాయి నుంచి గొప్పస్థాయికి చేరినవాళ్లు మనకు చాలా మంది కనిపిస్తారు.  

Published : 10 Jan 2023 01:02 IST

నిషి తన జీవితకాలంలో ఎంతో కొంత సంపద ఆర్జిస్తాడు. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కాని, బీదవాడిగా మరణించడం తప్పు’ అంటారు. ఎంతో కిందిస్థాయి నుంచి గొప్పస్థాయికి చేరినవాళ్లు మనకు చాలా మంది కనిపిస్తారు.  

స్థాయీభేదం వివిధ రంగాలకు సంబంధించి ఉంటుంది. ప్రపంచం ధనం అనే ఇరుసు మీద తిరుగుతుంటుంది. అభినందించేవాళ్లకంటే అసూయచెందేవాళ్లే సమాజంలో ఎక్కువ. పువ్వులిచ్చేవాళ్లకన్నా రాళ్లు విసిరేవాళ్లే విరివిగా కనిపిస్తారు.

ప్రపంచ సంపదల్లో ఐశ్వర్యానికి ప్రథమ స్థానం ఉన్నా, మరికొన్నింటి గురించీ ముచ్చటించుకోక తప్పదు. విద్య, ఆధ్యాత్మిక సాధన, లలితకళలు, సంగీత సాహిత్యాలు- ఇలా వివిధ రంగాల్లో కృషికి తగిన స్థాయి లభిస్తుంది. స్థాయికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి.

ప్రతి వ్యక్తీ, వారసులకు తన ఆర్జనలో భాగస్వామ్యం కల్పించాలని తహతహలాడతాడు. అక్రమార్జనాపరులు కొన్ని తరాలవరకు తమ వంశీకులు సుఖజీవనం గడపాలని అపారంగా ఆస్తులు కూడబెడతారు. చట్టానికి పట్టుబడకుండా అనామకుల పేర్లమీద ఆస్తులు రాస్తారు. చట్టానికి కళ్లు లేకపోయినా దృఢమైన చేతులున్నాయి. వాటికి చిక్కినప్పుడు విలాపం తప్పదు. అప్పుడు పశ్చాత్తాపం, ఆత్మ విచారం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

ధనం సుఖాన్నిస్తుంది. కాని, దుఃఖాన్ని నివారించలేదు. కాబట్టి, జీవిత పరమా వధి ధనార్జన మాత్రమే కాకూడదు. కేవలం ధనార్జనలో జీవితాన్ని గడిపిన వాళ్లను ఈ లోకం గుర్తుపెట్టుకోదు. ఆ ధనాన్ని లోకక్షేమం కోసం వెచ్చించిన వారిని మరిచి పోదు. కేవలం తనవారి కోసమే పాటుపడినవాళ్లను, అయినవాళ్లే మరిచి పోతారు.

ఆచారాలు పాటించినా ఆశ్రితులను ఆదుకునేవాళ్లను ప్రపంచం పూజిస్తుంది. నడిచే దేవుడిగా, పెరియవగా ప్రసిద్ధి కెక్కిన కంచి పెదస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆ కోవకు చెందినవారు. ఇప్పటికీ వేలాది భక్తులు ఆయన్ను మనసు అనే గుడిలో ఆరాధిస్తుంటారు. ఆయన ఆర్తులను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందరో సాధకులకు, ఆధ్యాత్మికవేత్తలకు ఆయన ఆదర్శం. ఎవరు ఆధ్యాత్మిక ఆదర్శాన్ని పాటిస్తారో వారు ధన్యజీవులు.

జన్మించినవారికి మరణం తప్పదు. జననం- మరణాలకు మధ్యగల కాలమే మనది. అందులో కొంత భాగాన్ని కాలం హరిస్తుంది. మిగిలిన స్వల్పకాలం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంతగా జన్మ సాఫల్యం కలుగుతుంది. మరణించే ముందు తమ సంపదను వారసులకు కట్టబెట్టేది మరణశాసనం. జీవి ఏ విధంగా మరణించాలో నిర్ణయించేది కూడా మరణశాసనమే. మనిషి ఘనత జననంలో కంటే మరణంలోనే తెలుస్తుందంటారు. అభిమన్యుడు వీరమరణం చెంది అమరుడైనాడు. కర్ణుడు మహాదాతగా ప్రఖ్యాతి పొందాడు.

అంత ఘనులం కాకపోయినా మన స్థాయికి తగిన విధంగా ప్రపంచ క్షేమం కోసం పాటుపడాలి. మరణంలోగా భూమాత రుణం తీర్చుకోవాలి. మాతతోపాటు మాతృదేశానికి మనస్ఫూర్తిగా సేవలందించాలి. మన వారసులకే కాదు, సమాజంలో మనసున్న వారందరికీ మన జీవితం ఆదర్శం కావాలి. ఈ ఆదర్శమే మనం జాతికి ఇచ్చే సంపద. మహానాయకులు జాతికి ఇచ్చిన వారసత్వ సంపద ఇదే. వారి త్యాగాలే మన స్వేచ్ఛా జీవనానికి పునాదులయ్యాయి. ఆస్తుల పంపకానికి రాసేది లిఖిత మరణ శాసనం. ఆదర్శాలను పంచేది అలిఖిత మరణశాసనం!

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని