సౌందర్యం

భగవంతుడి సృష్టిలో ఎన్నెన్నో అందాలు. అందాన్ని ఆస్వాదించడం ఆరాధించే లక్షణం జీవుల్లో మనిషికే లభించిన గొప్ప వరం. పక్షులు, నదులు, లోయలు, పర్వతాలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, చల్లని వెన్నెల, వసంతరాత్రులు, రుతువులతోపాటు అలంకరణ మార్చుకొనే ప్రకృతికాంత... అంతా సౌందర్యమయమే. ‘అందమైనదాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు.

Published : 13 Jan 2023 00:55 IST

భగవంతుడి సృష్టిలో ఎన్నెన్నో అందాలు. అందాన్ని ఆస్వాదించడం ఆరాధించే లక్షణం జీవుల్లో మనిషికే లభించిన గొప్ప వరం. పక్షులు, నదులు, లోయలు, పర్వతాలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, చల్లని వెన్నెల, వసంతరాత్రులు, రుతువులతోపాటు అలంకరణ మార్చుకొనే ప్రకృతికాంత... అంతా సౌందర్యమయమే. ‘అందమైనదాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే, అందం దేవుడి చేతిరాత’ అంటారు ఒక తత్వవేత్త. అందం ఒక రూపమే కాదు, ఒక పరవశం. అందుకే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని తాపత్రయపడతారు. వారు పూజించే దైవాలను సైతం అత్యంత సౌందర్యమూర్తులుగా ఆవిష్కరించుకొంటారు.

కంటికి కనిపించేది, రూపురేఖలకు చెందినది బాహ్యసౌందర్యం. గుణాలకు,  వ్యక్తిత్వానికి  చెందినది అంతస్సౌందర్యం. నిత్యమైనది సత్యమైనది నాశనం లేనిది- శాశ్వత సౌందర్యం. బాహ్యసౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. అది సుమశరుడి సమ్మోహనాస్త్రం. చక్రవర్తులను సైతం పాదాక్రాంతుల్ని చేసుకోగలిగేది, తాపసులను సైతం తపింపజేయగలదు. అది ప్రకృతి సహజం.  

అంతస్సౌందర్యం కంటికి కనిపించేది కాదు, అది హృదయంలో పొందే అనుభూతి. అది మనుషుల వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమవుతుంది. నడతలో ఆత్మవిశ్వాసం, హృదయంలో నిర్మలత్వం, చూపులో సానుభూతి, మాటల్లో మర్యాద నిజాయతీ, చేతల్లో సహాయం మొదలైనవి వారి లక్షణాలు. అటువంటివారు అందరి అభిమానాన్నీ పొందుతారు. బాహ్య సౌందర్యం వసంతమాసంలో వికసించే పుష్పం. అంతస్సౌందర్యం వినీల ఆకాశంలో ప్రకాశించే తార. భారతీయ తాత్విక చింతనలో ‘సత్యం శివం సుందరం’ అనేవి విడదీయరానివి. ఏది నిత్యమో అదే సత్యం. ఏది సత్యమో అదే శివం. ఏది శివమో అదే సుందరం. అదే శాశ్వత సౌందర్యం!

ఈ దృశ్యమాన జగత్తులో అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నింటా ఆత్మరూపంలో వెలుగుతూ, క్షణక్షణం మారుతున్న ఈ దృశ్య జగత్తులో తాను మాత్రం మారక కాలాతీతుడై ఉండేవాడు పరమాత్మ. దేహానికి, దానిలోని అంతఃకరణాలైన మనసు బుద్ధి చిత్తం అహంకారాలకు అతీతంగా ఉండి, అవి జరిపే కార్యకలాపాలకు సర్వసాక్షిగా నిలిచి, దేహం నశించిన తరవాతా ఆత్మగా వెలుగొందే నిత్యం సత్యం అయిన ఆ పరమాత్మే శాశ్వత సౌందర్యం. శాశ్వత సౌందర్యాన్వేషణ అంతర్ముఖుణ్ని చేస్తుంది.

ధనుర్దాసు గొప్ప విలుకాడు,  మల్లయోధుడు. అంతకు మించి సౌందర్య పిపాసి. ప్రేయసి నేత్ర సౌందర్యానికి దాసుడు. సదా ఆమె కన్నులనే చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయి  వాటి  సోయగానికి  ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని తిరిగేవాడు. అది గమనించిన భగవద్రామానుజులు ‘ఈ సౌందర్యం కొన్నాళ్లకు తరిగిపోతుంది. నీకు శాశ్వత సౌందర్యాన్ని చూపిస్తాను’ అని కోవెలలో శ్రీ రంగనాథుని దర్శింపజేస్తారు. శాశ్వత సౌందర్యానుభూతి చెందిన ధనుర్దాసు రామానుజుల శిష్యుడై రంగనాథుడి భక్తుడై జన్మ సార్థకం చేసుకొన్నాడు.

బాహ్య సౌందర్యంలోను, అంతస్సౌందర్యంలోను, అన్నింటా ప్రకాశిస్తూ వీటికి అతీతంగా వెలిగే శాశ్వతమైన ఆత్మ సౌందర్యాన్వేషణ చేయాలి. అందుకు త్రికరణ శుద్ధిగా సాధన చేయాలి. అప్పుడే అది అనుభవైకవేద్యమవుతుంది. ఆ స్థితికి చేరిన క్షణం బ్రహ్మానందసింధువులో బిందువులమవుతాం.

కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు