గొప్ప స్నేహితుడు

నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మేలు చేసేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహితుణ్ని పొందాలంటే అటువంటి స్నేహాన్ని ముందు అతడికి అందించే అర్హత మనం సంపాదించుకోవాలి.

Updated : 05 Mar 2023 06:20 IST

నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మేలు చేసేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహితుణ్ని పొందాలంటే అటువంటి స్నేహాన్ని ముందు అతడికి అందించే అర్హత మనం సంపాదించుకోవాలి. నిజమైన స్నేహవృక్షం త్యాగాన్ని పూస్తుంది. సేవను ఫలిస్తుంది. ఆదర్శ బీజాన్ని ప్రసాదిస్తుంది. విశ్వకల్యాణానికి నీడనిస్తుంది. భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. మిత్రుడి ఆపదలను తనంతతానే గ్రహించి, ఆదుకునేవాడే అసలైన మిత్రుడు.

మనిషికి విపత్తులు రావడం కూడా మంచిదేనని, ఆ విపత్తులలో ఎవడు తానుగా వచ్చి ఓదార్పును, సలహాలను ఇవ్వడమే కాకుండా గట్టెక్కిస్తాడో వాడే నిజమైన మిత్రుడని మనకు అర్థమవుతుంది. చెరువునిండా నీరున్నప్పుడు కప్పలు ఎన్నో చేరతాయి. చెరువు ఎండిపోగానే, అక్కడ ఒక్క కప్పా కనిపించదు. వేమన చెప్పిన ఈ సూక్తిలో ఎంతో అంతరార్థం ఉంది. స్నేహానికి దీన్ని అన్వయించుకోవాలి.

రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహశపథం చేసి పరస్పరం సహకరించుకున్నారు. వాసుదేవుడు సుదీర్ఘ కాలం తరవాత తనను చూడవచ్చిన కుచేలుడికి సకల మర్యాదలు చేసి, అతడి దీన స్థితిని గ్రహించి, అపార సంపదను ఇచ్చి అనుగ్రహిస్తాడు. ఫలితం ఎలా ఉన్నా మైత్రీబంధానికి కర్ణదుర్యోధనుల స్నేహమూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

స్నేహసౌధానికి పునాది వేసేది ప్రేమ. సకల ప్రాణికోటి మనుగడకు మూలం ప్రేమే. ప్రేమ అహింసను ఆహ్వానిస్తుంది. స్నేహానికి మొగ్గ తొడు గుతుంది. ప్రశాంత జీవన యాగానికి సమిధ అవు తుంది. ప్రేమ, స్నేహం... ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయి.

తైలం వేయకపోయినా వెలిగే దీపం స్నేహం. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేదే స్నేహం. ఏ కోరికా లేకుండా త్యాగానికి సిద్ధపడేదే స్నేహం. ఇవాళ మనిషి స్నేహాన్ని సృష్టి నుంచి, సకల జీవజంతుజాలం నుంచి  నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. గాలి మబ్బుతో స్నేహం చేస్తుంది. మబ్బు నీటితో స్నేహం చేస్తుంది. నీరు మొక్కతోను, మొక్క పూవుతోను, పూవు పరిమళంతోను స్నేహం చేస్తాయి. పరిమళం మళ్ళీ గాలితో స్నేహం చేస్తుంది. ఇది ఒక ఆవృత్తం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనుషుల్లో ఇలాంటి స్నేహం ఎక్కడో అరుదుగా గాని కనిపించదు.

నిస్సంకోచంగా, నిర్భీతిగా, నిరాపేక్షగా సాయపడేందుకు కావాల్సిన శక్తి, ఉత్సాహం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, ఔదార్యం, ఆత్మీయత- ఈ లక్షణాలు సన్మిత్రుడికి ఉంటాయని గుప్తుల కాలంనాటి నీతి గ్రంథం ‘కామందికీ నీతిసారం’లోని శ్లోకం చెబుతోంది. ‘శవం మహాప్రస్థానం చేరినప్పుడు దహనం అయ్యేవరకు నిలిచేవాడే నిజమైన హితుడు, స్నేహితుడు’ అని చాణక్య శతకం చెబుతోంది.

‘నన్ను సర్వభూతాలకు స్నేహితుడిగా గ్రహించేవాడు శాంతి పొందుతాడు’ అన్న వాసుదేవుడి గీతావాక్యం విన్నాక, భగవంతుణ్ని మించిన స్నేహితుడు లేడని నిర్ద్వంద్వంగా సర్వులూ అంగీకరిస్తారు. చిత్తశుద్ధితో భగవన్నామస్మరణ చేసేవాడికి పరమాత్మే గొప్ప స్నేహితుడిగా కనిపిస్తాడు. భగవంతుణ్ని గొప్ప స్నేహితుడిగా భావించేవాడు సృష్టిని ప్రేమిస్తాడు. సమస్త ప్రాణికోటినీ ప్రేమిస్తాడు. తన విధ్యుక్త ధర్మం నిర్వర్తిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సముపార్జించే తపస్సులో నిమగ్నుడై ఉంటాడు. జగత్తునే స్నేహమాధుర్యమయంగా దర్శిస్తాడు.

మనం దేనికి యోగ్యులమో అదే ప్రసాదిస్తాడు భగవంతుడు. అనుభవించే అర్హత లేనప్పుడు ఎంత ప్రార్థించినా అనుగ్రహించడు. ఈ అక్షరసత్యాన్ని ఎరిగినవాడు పరమేశ్వరుడే గొప్ప స్నేహితుడని నమ్ముతాడు. అహంకారం, అజ్ఞానం విడిచి, ఆత్మసమర్పణ భావం పొందినవాడే జ్ఞాని అని, ఆ జ్ఞానికే సర్వ శ్రేష్ఠ మిత్రుడి రూపంలో శ్రీహరి దర్శనమిస్తాడని విజ్ఞులు విశ్వసిస్తారు.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని