అందిపుచ్చుకోవాలి

గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కదలాడుతుండటమే ఆశావాదానికి ఆయువుపట్టు. ప్రాచీన భారతీయ సాహిత్యం ఈ విషయాన్ని అనేక ప్రక్రియల్లో ఘోషిస్తోంది.

Published : 13 Mar 2023 00:27 IST

గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కదలాడుతుండటమే ఆశావాదానికి ఆయువుపట్టు. ప్రాచీన భారతీయ సాహిత్యం ఈ విషయాన్ని అనేక ప్రక్రియల్లో ఘోషిస్తోంది. సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలే ఉందన్న ఆశతో మనిషి జీవించాలని దాని సారాంశం. ‘కలిసి ఉందాం. కలిసి భుజిద్దాం. కలిసి పనిచేసి శక్తిని ధైర్యాన్ని సృష్టిద్దాం. కలిసి ధ్యానం చేసి తేజస్సును  సృష్టించుకుందాం. వీటి ద్వారా అందరం శాంతి పొందుదాం’ అని సమష్టి తత్వాన్ని బోధించింది వేదం.

‘జీవం తొణికిసలాడుతూ నిండు నూరేళ్లు జీవిద్దాం... నూరేళ్లు విందాం... నూరేళ్లూ మాట్లాడుతూ ఉందాం’ అని మరో వేదవచనం. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయతీరాలకు తప్పక చేరుస్తాయని చాటిచెబుతోందీ సాహిత్యం.-వ్యక్తీకరణ. ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసిపాపకు ఎవ్వరూ పరిచయం ఉండరు. అయినా తన బోసినవ్వులతో తనంత తానే అలవోకగా పలకరించి అందరినీ ఆకట్టుకుంటుంది. పరవశింపజేస్తుంది. అదే తొలి పరిచయంగా పరిణమిస్తుంది. ఆ చిరునవ్వే స్నేహానికి బీజం అవుతుంది. పసిపాపకు ఉన్నంత చనువు చాలదూ- మనసుల మధ్య మాసిపోని బంధం ఏర్పడటానికి. ఆ మాత్రం త్యాగం చేయలేమా- బుద్ధిజీవిగా పుట్టిన మనం?
అలవోకగా గిరవాటు వేసినా గింజ నిస్తేజం, నిరాశలకు గురికాదు. మట్టి, గాలి, తేమ, వెలుగులతో చెలిమి చేసి మొలకగా రూపుదాల్చుతుంది. ఆ మొక్కే చెట్టయి, ఆ ఒక్క చెట్టే పుష్పించి ఫలించి మరిన్ని వృక్షాల సృష్టికి దోహదం చేసి ఒక అడవికే ప్రాణం పోస్తుంది. అందాలను చిందిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, పర్యావరణ సమతౌల్యం పంచుతుంది. అలాగే ఆశావాది ప్రతి  అవకాశాన్నీ బంగారు భవితకు మార్గంగా చేసుకోవాలి. ఆ ఆశయంతోనే మరింతమందికి స్ఫూర్తిని రగిలించాలని ‘ఎదురీదే చేతులుంటే ఏరు దారియివ్వక ఏం చేస్తుంది... పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది?’ అంటాడో కవి.

మనసు చేసే అతి ముఖ్యమైన పని ఆలోచన. అది లేని మనసు, రాని మనిషి ఉండడు. ఆలోచన సముద్ర తరంగాల్లా నిరంతర ప్రక్రియ. అది ఎంత గొప్పదంటే ఒక ఆలోచన భవిష్యత్తును నిర్దేశించగలదు. భవితను మార్చగలదు. చరిత్ర గతిని తలకిందులు చేయగలదు. అంత శక్తిగల ఆలోచనలను ఉన్నతంగా ఉండేటట్లు చేసుకోవాలి... ప్రతి ఒక్కరూ. ఒక ఆశ కిరణంలా ఉత్సాహాన్ని పెంచుతుంది. నేను నీకు ఆసరాగా ఉన్నాను అని నోటితోనే చెప్పనక్కర్లేదు. ఒక స్పర్శ, ఒక ఆత్మీయ పలకరింపు, ఒక చల్లని చూపు మీరు తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుపుతాయి. ఆ భావ వ్యక్తీకరణే ఎదుటి వారికి ఒక భరోసా అయి జీవితంలో ఒక కొత్త మార్పును తెస్తుంది. ఆత్మీయుల్ని పెంచుతుంది.

‘ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైన కలత ఉన్నదా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైన నలత ఉన్నదా? ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైన కొరత ఉన్నదా? ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైన కోత ఉన్నదా?’ అన్న సినారె మాటలు ఆశావహ దృక్పథానికి  కచ్చితమైన ఉదాహరణలు. చిక్కని చీకటిలో మిణుగురు వెలుతురు, చిమ్మచీకటిలో తళుక్కుమనే మెరుపురేఖ వెలుగు, ప్రవాహపు వడిలో ఒక గడ్డిదుబ్బు ఆసరా, నిరాశ నిండిన జీవితంలో చిన్న ఆత్మీయ పలకరింపు... ఇవన్నీ మానసికంగా శక్తిని, ఉత్సాహన్ని, స్ఫూర్తిని ఇస్తాయి. విజయం సాధించాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు. దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో గుర్తించి సత్వర కార్యాచరణకు సన్నద్ధం కావడమే ముఖ్యం.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని