అనువైన స్థితి
కొందరు తాము ఉన్నస్థితిని అనువైనది (కంఫర్ట్ జోన్)గా భావించి జీవితంలో ఎదిగేందుకు పెద్దగా కృషి చేయరు. అందివచ్చిన అవకాశాలను సైతం బేఖాతరు చేస్తారు.
కొందరు తాము ఉన్నస్థితిని అనువైనది (కంఫర్ట్ జోన్)గా భావించి జీవితంలో ఎదిగేందుకు పెద్దగా కృషి చేయరు. అందివచ్చిన అవకాశాలను సైతం బేఖాతరు చేస్తారు. జీవిత చరమాంకంలో సమీక్షించుకుంటే వారు ఏం కోల్పోయిందీ స్పష్టంగా తెలిసివస్తుంది. ఆ సమయంలో పశ్చాత్తాపపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ ప్రపంచం ఓ మహత్తర అవకాశాల గని. తవ్వి తీయగలిగినవారికి బంగరు పంటలు అందివస్తాయి. చాలమంది అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోరు. ఉన్నస్థితి వారికి చాలినంత సంతృప్తిని ఇవ్వకపోయినా కొత్త అవకాశాలను స్వీకరిస్తే ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయోనన్నది వారి భయం. అందుకే ఉన్నంతలో రాజీపడి జీవయాత్ర సాగిస్తారు. చిరుద్యోగులుగా మిగిలిపోతారు. తాము ఉన్నస్థితిని అనువైనదిగా భావించి జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయరు. కొత్త బాధ్యతలకు భయపడనివారు మాత్రమే విజయాలను కైవసం చేసుకొని తాము ఏమిటో ప్రపంచానికి చాటిచూపుతారు. పనికి భయపడి కొందరు, బదిలీలకు భయపడి కొందరు, బాధ్యతాయుత విధినిర్వహణలో తమకు గల సామర్థ్యం గుర్తించలేక అల్పజీవి తాలకు పరిమితం కావడం సమా జంలో అప్పుడప్పుడు జరుగుతుంది.
ఏనుగు, పిల్లగా ఉన్నపుడు ఓ చిన్నతాడుతో గుంజకు కట్టివేస్తారు. పిల్లఏనుగును పట్టి ఉంచగల కొద్దిపాటి సామర్థ్యం ఆ చిన్న తాడుకు ఉంటుంది. కానీ అదే ఏనుగు ఎదిగి పెద్దదయినా సంర క్షకుడు అదే తాడుతో బంధిస్తాడు. ఏనుగు తాడు తెంచుకొని పారిపోయే ప్రయత్నం చేయదు. అందుకు కారణం- ఆ సామర్థ్యం తనకు ఉందని ఏనుగు భావించకపోవడమే. చాలాËమంది యువత సైతం అదే బాటలో పయనించడం శోచనీయం. తమ శక్తిసామర్థ్యాలు తెలుసుకోలేక సామాన్యులుగా మిగిలిపోయి సంతృప్తిలేని జీవితాలు గడపడం సమాజంలో కనిపిస్తోంది.
మహాభారతంలో కనిపించే ఉత్తర కుమారుడు అనువైన స్థితిని ఎంచుకున్నవారికి ప్రతీక. భయం వల్ల, అంతకు మించి కోరిక లేకపోవడం వల్ల సాహసానికి ప్రయత్నించలేదు. వీరత్వాన్ని ప్రదర్శించ లేదు. అందుకు భిన్నంగా అనువైన స్థితిని దాటి నిలిచినవాడు కర్ణుడు. సూతకుమారుడైన అతడు ద్రోణాచార్యుడు నిర్వహించిన విలువిద్య పోటీలో అర్జునుడికి ప్రత్యర్థిగా తలపడటానికి సిద్ధపడి దుర్యోధనుడి మెప్పుపొందాడు. అంగరాజ్యాభిషిక్తుడు అయ్యాడు. ‘లెమ్ము! నీ లక్ష్యాన్ని సాధించు!’ అన్న స్వామి వివేకానంద పలుకులు అనువైన స్థితిని ఎంచుకున్న వారిని ఉద్ధరించేందుకు ఉద్దేశించినవే!
అవకాశాలు పదేపదే తలుపు తట్టవు. అంది వచ్చినప్పుడు వాటిని లాఘవంగా చేజిక్కించుకోవాలి. తనతో సమానంగా జీవితాన్ని ప్రారంభించిన స్నేహితులు అందలాలు ఎక్కడం, తాను ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా జీవితంలో మిగిలిపోవడం యాదృచ్ఛికం అనుకోకూడదు. అభ్యాసం వల్ల క్లిష్టమైన కార్యాల్నీ సమర్థంగా చేయగలుగుతాం. యువత సవాళ్లకు భయపడక అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని పురోగమించడం జాతి శ్రేయస్సుకు చాలా అవసరం.
గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ