విశ్వరూపం

మనుషులు గొప్ప గొప్ప ఆశయాలతో మంచి వృత్తులు ఎన్నుకుని, ఎంతో కృషి చేసి విజయం సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. కొందరైతే పుట్టుకతోనే గణనీయమైన ప్రతిభ, ప్రజ్ఞతో పుడతారు. లోక ప్రసిద్ధులవుతారు. మానవ జీవితంలో ఇంతకంటే ఆనందం ఏం ఉంది? ఏదో ఒకటి సాధించి గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి.

Published : 18 Jan 2024 01:23 IST

నుషులు గొప్ప గొప్ప ఆశయాలతో మంచి వృత్తులు ఎన్నుకుని, ఎంతో కృషి చేసి విజయం సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. కొందరైతే పుట్టుకతోనే గణనీయమైన ప్రతిభ, ప్రజ్ఞతో పుడతారు. లోక ప్రసిద్ధులవుతారు. మానవ జీవితంలో ఇంతకంటే ఆనందం ఏం ఉంది? ఏదో ఒకటి సాధించి గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి. ఆ పేరువల్ల కన్నవారికి ఇంటికి ఊరికి దేశానికి ఖ్యాతి తేవాలి. అదే నిజమైన జన్మ! అలాంటివారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమవుతుంది. వారికి జేజేలు పలకాలి కాని ఇదొక్కటే కాదు, ఇంకా ఉంది అని చెబుతున్నాడు గీతాచార్యుడు. విలువిద్యలో అపరిమితమైన కృషి చేసి, అగ్రగామి అయిన అర్జునుడికి అదొక్కటే చాలదని, మానవ జీవన పరమార్థమైన ఆత్మను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొమ్మని చక్కగా బోధించాడు.

ఆత్మజ్ఞానం సూర్యుడిలాంటిది. సర్వజ్ఞానాలకు తల్లి వంటిది. అది సర్వాన్నీ ప్రకాశింపజేస్తుంది. జగద్విఖ్యాతి పొందిన విలుకాడైన అర్జునుడు యుద్ధంలో గడగడ వణికిపోవడానికి రథం దిగి పారిపోవడానికి కారణం ఆత్మజ్ఞానం లేక పోవడమేనని నిరూపించాడు!

‘నేను’ తెలియకపోతే ‘మనం’ గురించి తెలియదు. మనం తెలియకపోతే మనల్ని నడిపించే చైతన్యం గురించి తెలియదు. చైతన్యం తెలియకపోతే అంతరంగ దివ్యత్వం తెలియదు. అంత రంగంలోని దివ్యత్వం తెలియకపోతే మనిషి మహనీయుడని ఎన్నటికీ తెలియదు. ఇంత అధునాతన కాలంలోనూ మానవుడికి అనంత సత్యం గురించి తెలియాలా అని ఆశ్చర్యపోకూడదు. ఆ సత్యమే తన ఆత్మగా నడిపిస్తుందనే నిజం తెలియాలి. ఈ నిజం తెలిసిన మరుక్షణమే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలన్నింటికీ పరి ష్కారం దొరుకుతుంది. నీ చదువు పూర్తి అయిందా అని తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు చదువుల మర్మమెల్ల తెలిసిందని సమాధానమిచ్చాడు.

ఆత్మే సర్వానికి మూలం అని తెలిసిన మరుక్షణమే మన జీవన విధానం మారిపోతుంది. మంత్రం వేసినట్లు మాటలు మారిపోతాయి. చివరికి ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. లోకాన్ని చూసే విధానంలో ఇంతవరకు ఉన్న లోపాలేమిటో స్పష్టంగా తెలుస్తాయి. అయ్యో ఇంతకాలం వృథా అయిందని మనసు పశ్చాత్తాప పడుతుంది. ఇంతవరకు మనం ఎవరిని తిరస్కరించామో వాళ్లందరూ మన మిత్రులుగా కనిపిస్తారు. శత్రువులో శత్రువు మాయమైపోతాడు. అందరిపట్లా అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. శ్రీకృష్ణుడి బోధ తరవాత, అతడి పాదాల మీద పడి శరణు కోరాడు అర్జునుడు. ఎంతో తప్పు చేశానని విలపించాడు, మన్నించమని కోరాడు.

లోకజ్ఞానం అవసరం. ఆత్మజ్ఞానం అత్యవసరం. ఆ విషయం అందరికీ తెలియదు. లోకజ్ఞానానికి ఆత్మజ్ఞానం తోడవ్వాలి. అప్పుడు మనం చేసే ప్రతి పనీ సమాజోద్ధరణకు ఉపయోగపడుతుంది. తనను తాను క్షుణ్నంగా తెలుసుకున్నవాడు లోకహితం కోసం బతుకుతాడు. అందరిలో కలిసి ఉన్న నేనే నిజమైన నేను అని గ్రహిస్తే- ఆ నేను నుంచి వెయ్యేనుగుల బలం పొందుతాడు. చెట్టు తెలిస్తే అడవి తెలుస్తుంది. నది గురించి తెలిస్తే సముద్రం తెలుస్తుంది. మట్టిముద్ద గురించి తెలిస్తే భూమి మొత్తం తెలుస్తుంది. స్వస్వరూపం తెలిస్తే విశ్వరూపం తెలియదా?

ఆనందసాయి స్వామి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని