సచ్చిదానందం

మనం సంపాదించి కూడబెట్టే ప్రతిదీ, మనలాంటి మరొకరి అవసరాలకు ఉపయోగపడేదేే. ప్రపంచంలో ఎన్నోకోట్ల మంది ఆకలి తీర్చుకోలేని దీన స్థితిలో, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ధర్మబద్ధంగా సంపాదించుకుని భోజనం చేసేటప్పుడు తెలియకుండానే మన వైపు ఎన్నో ప్రాణులు చూస్తుంటాయి. ఒక బిచ్చగాడు చెయ్యి చాచి దీనంగా అభ్యర్థిస్తాడు.

Published : 25 Jan 2024 00:54 IST

మనం సంపాదించి కూడబెట్టే ప్రతిదీ, మనలాంటి మరొకరి అవసరాలకు ఉపయోగపడేదేే. ప్రపంచంలో ఎన్నోకోట్ల మంది ఆకలి తీర్చుకోలేని దీన స్థితిలో, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ధర్మబద్ధంగా సంపాదించుకుని భోజనం చేసేటప్పుడు తెలియకుండానే మన వైపు ఎన్నో ప్రాణులు చూస్తుంటాయి. ఒక బిచ్చగాడు చెయ్యి చాచి దీనంగా అభ్యర్థిస్తాడు. ఓ జాగిలం మనం వేసే ముద్ద కోసం ఆత్రంగా చూస్తుంటుంది. చెట్టుపై కాకి అరుస్తుంటుంది. తమకోసం ఏమీ కూడబెట్టుకోలేని ఎన్నో ప్రాణులు ఇతరుల దయపై ఆధారపడి జీవిస్తుంటాయి. సంపదలను భద్రపరచడం వాటి పరిరక్షణ కోసం కాపలాదారులా జీవించడం- గొప్పతనంగా భావించే అజ్ఞానం.

ఆధునిక యుగంలో మనిషి విషయ భోగాల వెనక పరుగులు తీస్తున్నాడు. సంపాదించి కూడబెట్టడంపైనే ఆసక్తి కనబరుస్తున్నాడు. జీవిత సత్యం (మరణం) గురించి తెలిసినవారు జీవితంలో  ఏదీ శాశ్వతంగా మన వద్ద ఉండదు, మనతో రాదని గ్రహిస్తారు. అలాంటి స్థితప్రజ్ఞులే విలువైన సమయాన్ని, శక్తి సామర్థ్యాలను  సంపాదించడం, కాపలా కాయడం కోసం వృథా చేసుకోరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తుడి యోగక్షేమాల్ని తానే చూసుకుంటాను అన్నాడు.  సకల ప్రాణుల యోగక్షేమాలను అంతర్యామే చూసుకుంటాడు.ఒక దొంగ తులసీదాసు కుటీరంలో దొంగతనానికి వెళ్ళాడు. కుటీరం ముందు ధనుర్బాణాలు ధరించిన ఇద్దరు రాకుమారులు కాపలా ఉండటం చూశాడు. వారి దివ్యతేజస్సు చూసిన దొంగ వచ్చినపని మరిచిపోయి, వెనుతిరిగాడు. మరుసటి రోజు దొంగ తులసీదాసు దగ్గరకు వెళ్ళి తన అనుభవం గురించి చెప్పాడు. అది విన్న తులసీదాసు సాక్షాత్తు రామలక్ష్మణులే తనను సంరక్షిస్తున్నారని గ్రహించాడు. సిగ్గుపడి తన వద్ద మిగిలిన వస్తువులను కుటీరాన్ని పరిత్యజించాడు.

నేడు మనిషి  విలాసవంతంగా బతకడమే నాగరికత అనే భ్రమలో జీవిస్తున్నాడు. సాధన ద్వారా స్వచ్ఛందంగా అవసరాలు, సౌకర్యాలపై నియంత్రణ కలిగి ఉండటం, అవి లేని సమయంలోనూ ఆనందంగా జీవించడమే అసలైన నాగరికత అని తెలుసుకోలేకపోతున్నాడు. అనవసరమైన ఆలోచనలు మనసు నిండా నింపుకోవడం వల్లనే భ్రాంతి, కోరికలు కలుగుతాయి. దైవం వైపు మనసును మళ్ళించలేని ఆలోచనలన్నీ ఆధ్యాత్మిక సాధనకు అవరోధాలే. జీవన పరిపూర్ణత సాధించాలనుకునే సాధకులు తాపత్రయ లంపటం నుంచి విముక్తులు కావాలి.

ధనం హోదా ఆస్తుల్ని సౌఖ్యానికి అవసరమైన ఉపకరణాలుగా మాత్రమే భావించాలి. ఆనంద నిధి పైవాటిలో లేదని గ్రహించాలి. అది తెలుసుకున్న  మరుక్షణం మనకు అన్ని వైపులా విస్తరించి ఉన్న భగవంతుడి వైపు ఆలోచనలు ప్రసరిస్తాయి. ఆ ఆధ్యాత్మిక దృక్కోణం గోచరమైనప్పుడు విషయ వాంఛలకు మూలమైన శరీరం ఓ ఉపకరణం మాత్రమేనన్న భావన కలుగుతుంది. అప్పుడు నిరాశ్రయం, రేపటి గురించిన చింత అంతరించిపోతాయి.

శరీర పంజరానికి బందీ కాని సర్వాంతర్యామి నిరంతర సాహచర్యమే పరమావధిగా మారుతుంది. అప్పుడు కలిగే సచ్చిదానందం సమస్త చైతన్యానికి, సర్వ పరిపూర్ణతకు మూలమని తెలుస్తుంది. అది తెలుసుకున్నవారికి చెప్పడానికి ఏమీ ఉండదు. దాచుకోవడానికి, కాపలా కాయడానికి ఏమీ మిగలదు. ముల్లోకాలను కాపలా కాసే అంతర్యామి ముందు, మనం కాసే కాపలా క్షణభంగురం అవుతుంది. ఆ అనుభూతి స్వానుభవంతోనే సిద్ధిస్తుంది. అది అద్వితీయం.

ఎం.వెంకటేశ్వర రావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని