సుఖ దుఃఖాలు

ప్రతి మనిషీ సుఖాన్ని, ఆనందాన్ని కోరుకుంటాడు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండి, భోగభాగ్యాలు అనుభవిస్తున్న కొందరు ‘ఆహా... జీవితం ఎంత ఆనందమయంగా ఉంది’ అనుకుంటారు. మరో కోణంలో ఎందరో, ఎన్ని రకాలుగానో మానవ జన్మను దుఃఖమయంగా అభివర్ణించారు.

Published : 30 Jan 2024 00:24 IST

ప్రతి మనిషీ సుఖాన్ని, ఆనందాన్ని కోరుకుంటాడు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండి, భోగభాగ్యాలు అనుభవిస్తున్న కొందరు ‘ఆహా... జీవితం ఎంత ఆనందమయంగా ఉంది’ అనుకుంటారు. మరో కోణంలో ఎందరో, ఎన్ని రకాలుగానో మానవ జన్మను దుఃఖమయంగా అభివర్ణించారు. ఈ జన్మ నీటి బుడగలాంటిది. అశాశ్వతమైనది. దుఃఖాలకు నిలయం. జన్మ దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణం దుఃఖం... ఇలా జీవితమంతా దుఃఖాల మయం. దానికి కారణం ప్రాపంచిక సుఖాల వల్ల ఏర్పడ్డ సుఖం క్షణికం కావడమే. ఒకవేళ కాస్త సుఖం కనిపించినా అది ఎండమావిలా భ్రమింపజేసి వెంటనే కనుమరుగైపోతుంది. దీన్నే ఆభాససుఖం అంటారు. ధర్మబద్ధమైన సుఖంలో దోషం లేదు. కానీ వెంపర్లాడి పొందే సుఖాలు మనిషి జీవితాన్నే నాశనం చేస్తాయి. కష్టాలను కొనితెస్తాయనీ ఎందరో బోధించారు.

సుఖానుభవం ఆనందదాయకమే అయినా ఎల్లప్పుడూ వాటిలోనే మునిగితేలితే జీవితం యాంత్రికంగా మారి మనిషిలో స్తబ్ధత చోటుచేసుకుంటుంది. కష్టాలు ఉన్నప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది. నిజానికి జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం. మనసుకు ఆనందం కలిగించే అనుభవాలను సుఖాలని, కష్టం కలిగించేవాటిని దుఃఖాలని పిలుస్తాం. ఇవి ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కోలాగా మారుతూ ఉంటాయి.

‘మనిషి జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా ఉంటుందని, దానికి కారణం కోరికలే అని, అవే ఈ దుఃఖానికి మూలమని జ్ఞానోదయం పొందిన బుద్ధుడు కనుగొన్న సత్యం. వాటిని జయించాలంటే ధర్మ మార్గాన్ని అనుసరించాలి. అలాచేస్తే మనిషి దుఃఖం నుంచి విముక్తి పొందగలడంటారు వేదాంతులు. సిద్ధార్థుడు భార్యాబిడ్డలను, సర్వాన్ని త్యజించి సత్యాన్వేషణ సాగిస్తూ విశాల విశ్వంలో అనేక ప్రదేశాలు పర్యటించడానికి కారణం ఇదే. అప్పుడే దుఃఖదాయకమైన మానవ జీవితానికి పరిష్కార మార్గంగా తాత్విక సిద్ధాంతం ఆయన మనో ఫలకంపై సాక్షాత్కరించింది. బోధివృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమై బుద్ధుడు అయ్యాడు. కష్టం, శ్రమ లేకుండా జీవితంలో దేన్నీ సాధించలేం. ‘శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీకు బానిస అవుతుంది’ అన్నారు మహాత్మా గాంధీ. 

భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో సుఖదుఃఖాలు బండిచక్రపు రేకుల్లా పైకి కిందికి తిరుగుతూ ఉంటాయంటాడు. తులసీ దాసు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ- ప్రతివారూ రెండింటినీ తప్పక అనుభవించాలి, వాటిని ఆపడం ఎవరి తరమూ కాదంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ బాహ్య సౌఖ్యాలను నమ్మి మోసపోవద్దని బోధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరమాత్మను ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను పాటించాలి. భగవంతుడిపై విశ్వాసం ఉంచి తదనుగుణంగా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. దుఃఖాన్ని కోరనివారు సుఖాలను అభిలషించేవారు చేయవలసిన పని ఇదే. 

మధ్వాచార్యులు తన శిష్యులకు మనిషి జీవితంలో చేయకూడని పనులు రెండు ఉన్నాయని చెప్పేవారు. అవి- ‘సుఖాలను అనుభవిస్తున్నప్పుడు భగవంతుణ్ని మరవడం, దుఃఖసమయంలో ఆయన్ని నిందించడం’. నిజానికి సుఖాలు గానీ దుఃఖాలు గానీ కల కాలం స్థిరంగా ఉండేవి కావు. అందుకే వాటిని ఆకాశంలో కదిలే మేఘాలుగా వర్ణించారు ఆధ్యాత్మికవేత్తలు. గ్రహించగలిగితే కష్టాల్లోనూ సుఖాలు, ఆనందాలు ఉన్నాయంటారు ఆశాజీవులు. ఎలాగంటే... గడిచిన కష్టాలను నెమరువేసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాల దొంతర మనసుకు ఓ విచిత్రమైన అనుభూతినిస్తుంది. గతంలో అనుభవించిన, అధిగమించిన బాధల్ని తలచుకుంటే వర్తమానంలోని సుఖమాధుర్యం రెట్టంపవు తుందంటారు వారు. దుఃఖానికి నిలయమైన మానవ జన్మ మాయలో పడకుండా ఉండాలంటే ఆ భగవంతుణ్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం అంటారు వేదాంతులు.

వి.ఎస్‌.రాజమౌళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని