ఆనందం చిరునామా

మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖపెట్టకూడదు అంటోంది బృహదారణ్యక   ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఆ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వం రుషులెందరో ఆనందంకోసం ఏళ్లకు ఏళ్లు తపస్సు చేశారు.

Updated : 01 Feb 2024 06:08 IST

మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖపెట్టకూడదు అంటోంది బృహదారణ్యక   ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఆ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వం రుషులెందరో ఆనందంకోసం ఏళ్లకు ఏళ్లు తపస్సు చేశారు. పరమాత్మ అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందంలో హాయి ఎంత దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు. కపటత్వం పశుబలం వల్ల దొరికే ఆనందం తాత్కాలికమైందే కనుక శాశ్వతానందం కోసం తపోవనాలకు వెళ్లారు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పారమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు. సుఖం దుఃఖం ఈ భూమ్మీద విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకొని రెండోదాన్ని విడదీయడం ధరణిపై కుదరదు. ఇక్కడ ఆనందం పరిమితంగానే అనుభవానికి వస్తుంది. మరింత ఆనందం కావాలనుకొంటే ఇంకొకరినుంచి నయానో భయానో లాక్కోవలసిందే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే అంతులేని పారమార్థిక ఆనందాన్ని ఇతరులకు నష్టం లేకుండా సాధనతో సొంతం చేసుకొని అనుభవించడం కుదురుతుంది. ఆనందం చిరునామా ఆధ్యాత్మిక జ్ఞానమని వసిష్ఠుడు శ్రీరాముడికి చెబుతాడు. నూనె గానుగలో తిరిగే ఎద్దులాంటిదే ఈ భూమిపై ఆనందం కోసం మనిషి వెతుకులాట. గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేళ్ళాడదీసిన గడ్డి మోపును ఎప్పుడూ అందుకోలేదు. మనమూ అంతే! మనకు ఈ భూమిపై  ఎన్నడూ అనుభవానికి అందని దివ్యానందాన్ని అలా వెంటాడుతూనే ఉంటాం.

ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో తొలుత ప్రస్తుత స్థితితోనే సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం తగని పని. ఇందుకోసం నైతిక జీవితాన్ని గడపడం అవసరం. మనసుకు ఆనందానికి అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మనసనే సాధనాన్ని పరమాత్మ ఇచ్చాడంటారు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం కావాలనే అంతర్బుద్ధి మనసులోనే పుడుతుంది. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు శూన్యం చేసుకొని ప్రేమభావనలు కలిగి ఉంటే శ్రావ్యమైన సంగీత స్వరాలు వినిపిస్తాయని చెబుతారు. గుట్టల పైనుంచి చెట్ల కొమ్మల కదలికలోనుంచి ప్రవహించే నదుల జల తరంగాలనుంచి వినపడే రాగాలు దివ్య ఆనందానికి ప్రేరణ కలిగిస్తాయి. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆ రాగాలు కల్పిస్తాయి. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు చేస్తున్న తప్పు. అలా అనుకుని జీవిస్తే ఆనందం భౌతికమైన వస్తువులకే పరిమితం అవుతుంది.

ఆనందాన్ని నిర్వచించలేం. ఎందుకంటే, అదిక్కడ భూమ్మీదనే లభ్యమయ్యేది కాదు. దాని కోసం వెతకాలి. మనసును సమాయత్తం చేసుకోవాలి. ప్రతి జీవి పరమావధి ఆనందమే. అందుకోసం మనం  ప్రయత్నించాలనే దృష్టితోనే ఈ భూమిపై దైవం ఆనందం ఛాయలు కల్పించాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఆనందాలు. ఈశ్వరుడి సాన్నిధ్యంలో లభించే ఆనందమే నిజమైన అనంతమైన అపరిమితమైన ఆనందం. ఆనందం చిరునామా అక్కడే... అదే శాశ్వతానందం!

అప్పరుసు రమాకాంతరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని