నియమబద్ధ జీవనం

ఏదైనా ఒక పని సరైన రీతిలో జరిగిందని మనసు సంపూర్ణంగా అంగీకరించాలి. అప్పుడే ఆ కార్యం నియమాలకు అనుగుణంగా జరిగినట్లు భావించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

Published : 02 Feb 2024 01:06 IST

దైనా ఒక పని సరైన రీతిలో జరిగిందని మనసు సంపూర్ణంగా అంగీకరించాలి. అప్పుడే ఆ కార్యం నియమాలకు అనుగుణంగా జరిగినట్లు భావించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడే మనిషికి తృప్తి చేకూరుతుంది. దానికిగాను పురాణాలు, శాస్త్రాలతోపాటు పెద్దలు అనేక మార్గాలను సూచించారు. వాటిలో సత్యం, శాంతి, దయ, జ్ఞానం, ధ్యానం, నియమబద్ధ జీవనం వంటివి మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయన్నది పెద్దల మాట. మనిషి ఆలోచన, పలికే మాట, ఆచరించే ప్రతి పని... ఈ మూడింటిలోనూ ఏకత్వం ఉండాలి. నిర్మలత్వం, స్వచ్ఛత, పవిత్రత అనే మూడు విషయాలు వాటిలో స్పష్టంగా వ్యక్తం కావాలి.

మనసులో పొటమరించిన భావానికి అనుగుణంగా మాట ఉండాలి. ఆపైన నోటి నుంచి బయటికి వెలువడిన మాట ఏ మార్పూ లేకుండా మనసు చెప్పిన ప్రకారమే ఉండాలి. ఈ నియమం రెండోది. అదేమాట యథాతథంగా చేతల్లోనూ కనిపించాలి. ఈ లక్షణమే మూడో నియమం. ఈ మూడు లక్షణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండే ఆ స్థితినే నియమబద్ధత అంటారు పెద్దలు. దీన్నే ‘మనసా, వాచా, కర్మణా’ అనే మాటగా ప్రజలు ఉపయోగిస్తారు. ఆ ప్రకారం నడుచుకునేవారినే మహాత్ములు అంటారు.

మహాత్ములు అనిపించుకోవడం అంత సులభం కాదు. నియమబద్ధత అనే మాట లౌకిక వ్యవహారాలతో జీవనం గడిపేవారికి ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా మానవులు రాగద్వేషాది మానసిక రుగ్మతలకు లోనై ఉంటారు. చాలా మంది పైకి ఒకలాగ, లోన ఒకలాగ ఉంటారు. మనసులో చెడు ఆలోచనలున్నా తామెంతో మంచివాళ్లమన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తారు. దీనికి ఉదాహరణ- భీముణ్ని కౌగిలించుకునే నెపంతో అతణ్ని బిగించి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రేమ నటించిన ధృతరాష్ట్రుడే. అలాగే తీయని మాటలతో తమ మనసులో ఉన్న చెడును కొందరు దాచేస్తారు. దీనికి ఉదాహరణ కౌరవుల పట్ల అంతర్గత ద్వేషం ఉన్నా పైకి శ్రేయోభిలాషిలాగా మెలిగి వారి నాశనానికి కారకుడైన శకుని. ఇలా చాలామంది కనిపిస్తారు. మాటలు బాగున్నా చేతల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ల దుష్ట స్వభావం బయటపడుతుంది. అటువంటివాళ్లను నమ్మిన ఎవరైనా తీవ్రంగా నష్టపోతారు. చెడ్డపనులు చేస్తూ చెడుమార్గంలో వెళ్ళేవారు ప్రజాకంటకులుగా ఛీత్కారాలు పొందుతారు. దానికి ఉదాహరణ భారతగాథలోని కౌరవులు.

మంచి చేతలు మానవుణ్ని లోకారాధ్యుణ్ని చేస్తాయి. దీనికి ఉదాహరణ, శ్రీరామచంద్రుడు. ఆయన మెలిగిన తీరు అందరికీ అనుసరణీయం. మాటల్లో మాధుర్యం, దానికి తగినట్టు చేతలు మంచిగా ఉండాలి. అప్పుడే ఆ మాటలకు విలువ వస్తుంది. మాటకు విలువ ఉన్ననాడు అది పది కాలాలపాటు బతికి ఉంటుంది. మాటలో సత్యం ఉన్ననాడే ఆ మాటకు విలువ వస్తుంది. మాటకు తగ్గట్లు చేత ఉండాలి. అప్పుడే ఆ మాటకు విలువ, శాశ్వతత్వం చేకూరతాయి.

సదాశయంతో నిండిన స్వార్థరహిత చేతలతోనే సమాజానికి సుఖశాంతులు సమకూరతాయి. నిస్వార్థమైన సేవలే సమాజాన్ని సన్మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాయి. అందువల్ల ప్రతి మానవుడూ నియమబద్ధ జీవితాన్ని గడపాలి!

 కాలిపు వీరభద్రుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని