లబ్ధిపైనే దృష్టి

సమాజంలో ఈ మాట కొందరు బయటికి అంటారు, కొందరు మనసులో అనుకుంటారు. ‘అయితే, నాకేమిటి?’- ఈ ఆలోచనే రానివారు మహాత్ములు, మహోన్నతులు. ఈ మాటలు స్వార్థానికి బీజాల్లాంటివి. ఇవి విషవృక్షాలై మనిషిని అపఖ్యాతిపాలు చేస్తాయి. సాటిమనిషి నిస్సహాయుడై దీనంగా ‘ఈ సాయంచేసి పెట్టండి’ అని అడిగినప్పుడు తనకు తోచిన విధంగా, తన శక్తి మేరకు సహాయపడటం కనీస ధర్మం.

Published : 05 Feb 2024 00:46 IST

సమాజంలో ఈ మాట కొందరు బయటికి అంటారు, కొందరు మనసులో అనుకుంటారు. ‘అయితే, నాకేమిటి?’- ఈ ఆలోచనే రానివారు మహాత్ములు, మహోన్నతులు. ఈ మాటలు స్వార్థానికి బీజాల్లాంటివి. ఇవి విషవృక్షాలై మనిషిని అపఖ్యాతిపాలు చేస్తాయి. సాటిమనిషి నిస్సహాయుడై దీనంగా ‘ఈ సాయంచేసి పెట్టండి’ అని అడిగినప్పుడు తనకు తోచిన విధంగా, తన శక్తి మేరకు సహాయపడటం కనీస ధర్మం. ఆ సహాయానికి ప్రతిఫలం ఆశించడం కుసంస్కారం.

లోకంలో ఎన్నో ప్రాణులు మన జీవన పురోగతికి ఉపయోగపడుతున్నాయి. ఫలితంగా మనల్ని ఏమైనా అడుగుతున్నాయా? నదులు నీరిస్తున్నాయి. వృక్షాలు- నీడ, కాయ, పండు, కలప ఇస్తున్నాయి. బదులుగా అవి ఏమి అడుగుతున్నాయి? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మనిషికి లేకపోతే మనిషి మనుగడకు అర్థం ఏముంటుంది?

సంపద కలవాడు తన సంపదలోంచి కొంతయినా అభాగ్యులకు దానం చెయ్యాలి. ఏమీ లేనివాడు ప్రేమనివ్వాలి, ధైర్యమివ్వాలి. మనసునివ్వాలి. కనీసం ఇచ్చేవారిని చూపించాలి.

అహంకారాన్ని పెంచే ఐశ్వర్యం దుఃఖహేతువు. లోభత్వాన్ని పెంచే సంపద వినాశహేతువు. ‘నాది’ అనుకున్న కొద్దీ మిగిలేది అశాంతే! అధికారి తన ఉద్యోగానికి ఫలితంగా ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నాడు. తన విధ్యుక్తధర్మ/ నిర్వహణను మరచి, అదనంగా ప్రజల నుంచి ఏదో రూపంగా ప్రతిఫలాన్ని ఆశించడం అంటే అవినీతికి అద్దం పట్టడమే కదా! ఈ అత్యాశ అనర్థం. ఇటువంటి అక్రమార్జన ప్రమాదకరం.

మన పూర్వీకులైన రుషులు, తాపసులు, అవధూతలు, యోగులు, సాహితీవేత్తలు మననుంచి ఏమి ఆశించి, ఇంతటి అపూర్వ సాహితీ సంపదను అందించారు? ఇంతటి మహోత్కృష్టమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి ఫలితంగా ఏమైనా అడిగారా? అనుభవించమన్నారు. ఆనందించమన్నారు. అందరికీ పంచమన్నారు. మనం పంచడం లేదు. అమ్ముకుంటున్నాం. ఏవేవో ఐహిక ప్రలోభాలకు బానిసలమై సొమ్ము చేసుకుంటున్నాం. ఏదో లబ్ధి చేకూరితేనే బాంధవ్యం. ఏదో రాబడి వస్తేనే స్నేహం. ఫలితం ఉంటుందనుకుంటేనే పరిచయం పెంచుకోవడం. లేకపోతే కన్నెత్తి చూడం. రోడ్డుమీద ప్రమాదం జరిగితే బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేయం. స్వీయ చిత్రాలు తీసి విశ్వవ్యాప్తంచేసే పనిలో మునిగిపోతాం. ‘స్వార్థమే అనర్థకారణం, అది చంపుకొనుటె క్షేమదాయకం’ అన్న కవి పలుకుల్లో ఎంత సత్యముంది! ‘నీది నీది అనుకున్నది నీదికాదురా’ అన్న కవి మాటలు అక్షరసత్యాలు. సొంత లాభం కొంత మానుకుని, పొరుగువాడికి తోడ్పడుతున్నామా లేదా అని అంతర్విశ్లేషణ చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుంటే, వస్తువులే వచ్చి మన పస్తుల్ని పోగొడతాయి. ఏ పనిచేస్తున్నా ముందు వచ్చే లాభం మీదనే ఆశ! లాభం గురించే కల! ఈ వ్యామోహం పోతేనే, భక్తికి దాసోహం అంటేనే- మానవ జన్మకు సార్థకత. సంతృప్తిని మించిన సంపద లేదు. అసంతృప్తిని మించిన ఆపదలేదు. అయితే నాకేంటి’ అనే మాటను మరిచిపోతే వచ్చే నష్టమేమిటి?

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని