కాల పరీక్ష

ప్రతి మనిషీ జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటాడు. వేసే ప్రతి అడుగూ పూలబాట కావాలని ఆశిస్తాడు. తన ఆశయాలను నిజం చేసుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తాడు. కలలు కనడం మనిషి స్వభావమైతే అతణ్ని పరీక్షించడం కాలం సహజగుణం. ఒక్క మనిషికే కాదు- అన్ని ప్రాణులకు పరీక్ష నిర్వహించే ఏకైక గురువు కాలం.

Published : 15 Feb 2024 01:17 IST

ప్రతి మనిషీ జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటాడు. వేసే ప్రతి అడుగూ పూలబాట కావాలని ఆశిస్తాడు. తన ఆశయాలను నిజం చేసుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తాడు. కలలు కనడం మనిషి స్వభావమైతే అతణ్ని పరీక్షించడం కాలం సహజగుణం. ఒక్క మనిషికే కాదు- అన్ని ప్రాణులకు పరీక్ష నిర్వహించే ఏకైక గురువు కాలం. పాఠం నేర్పించి పరీక్ష నిర్వహించడం మానవ విద్యా విధానం. అందుకు భిన్నంగా పరీక్ష పెట్టిన తరవాత జయాపజయాలను బట్టి అతడే స్వయంగా నేర్చుకునేలా చేయడం కాలపరీక్షలోని ప్రత్యేకత. అందుకే అనుభవాన్ని మించిన గురువు లేడన్న సామెత పుట్టింది.

కాలం నిర్వహించే పరీక్షకు నిర్దేశిత ప్రశ్నపత్రం అంటూ ఏమీ ఉండదు. ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాక ఎదురయ్యే ఆటుపోట్లు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు అన్నీ చిక్కు ప్రశ్నలే. ఇన్ని సమస్యల నుంచి గట్టెక్కడం ఎలాగని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదు. అలా చేస్తే లక్ష్యసాధనకు అవసరమయ్యే విలువైన అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది. సందర్భోచితంగా, సమయస్ఫూర్తితో వేగంగా నిర్ణయం తీసుకోగల నేర్పును మనిషి ఒంటపట్టించుకోవాలి. కాలపరీక్షలో మరో ప్రత్యేకత ఏమిటంటే- ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి మరొక ప్రశ్నను విడిచిపెట్టే ఐచ్ఛిక విధానం ఇందులో ఉండదు. లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఎదురయ్యే అన్నిరకాల కష్టాల్ని ఎదుర్కోవాలి. బాధ్యతలను చెక్కుచెదరని ధైర్యంతో పూర్తి చేయాలి.

తెలిసో తెలియకో తప్పు చేయడం మానవ స్వభావం. చేసిన పని తప్పని తెలిసిన తరవాత దాన్ని కప్పిపుచ్చాలనుకోవడం మోసం అవుతుంది. మోసగించాలనుకునే వ్యక్తి సాక్ష్యం లేనప్పుడు వాగ్వాదం మొదలుపెడతాడు. తనను మంచివాడని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషి చేసే ప్రతి పని కాలపరీక్షలో ఒక భాగమే. మంచి చెడ్డల్ని గుర్తించే సాక్ష్యం లేదనుకోవడం అజ్ఞానం. ఎప్పుడు, ఎవరెలా ప్రవర్తిస్తున్నారో చూసే పర్యవేక్షకుడు సైతం కాలమే కావడం విశేషం. ఈ విషయాన్ని పెద్దలు సైతం నిర్ధారిస్తున్నారు. దుష్యంత మహారాజు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొని కొన్నాళ్ల తరవాత ఆమె ఎవరో తనకు తెలియదంటూ మోసగించే ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో శకుంతల వేదాలు, పంచభూతాలు, ధర్మం, సంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్ర సూర్యులు, పగలు, రాత్రి... ఇవన్నీ మనిషి చేసే అన్ని కర్మలను గమనిస్తూ ఉంటాయని చెబుతుంది.

ప్రతిఫలాపేక్ష లేని కాలం ఆశించేది ఒక్కటే. మనిషి తన విలువ తెలుసుకుని మసలుకోవాలని. ఆ ఉద్దేశంతోనే ప్రతి మనిషినీ నిరంతర విద్యార్థిగా మలచుకొని అతడి సమర్థత రాటుతేలే విధంగా ఊహించని కష్టాలతో పరీక్షిస్తుంది. అయితే విద్యా సంబంధమైన పరీక్షకు పరిమిత సమయం ఉంటుంది. నిర్ణీత వ్యవధి అంటూ లేకపోవడం కాలపరీక్షలో ప్రయోజనకరమైన అంశం. సామాన్య వ్యక్తులు గంటల్ని నిమిషాల్లా వృథా చేసుకుంటారు. కాలం దైవస్వరూపం కనుక దాన్ని దుర్వినియోగం చేయడం అంటే భగవత్‌ సాన్నిధ్యానికి దూరం కావడమే. కాలం విలువ తెలుసుకొని దాన్ని గౌరవించేవారు అందరికీ ఆదర్శప్రాయులవుతారు. కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచినవారు అన్నింటా విజేతలుగా స్థిరపడతారు.

పరీక్ష రాసిన తరవాత ఫలితాన్ని ఆశించడం మనిషి నైజం. కాలం నిర్వహించే పరీక్షల ఫలితం ఒక్కోసారి తక్కువ వ్యవధిలోనే వస్తుంది. మరోసారి సంవత్సరాల పాటు సమయం పట్టవచ్చు. ఆ వచ్చే ఫలితం సానుకూలమైనా, ప్రతికూలమైనా మనిషి దాన్ని ఆశావహ దృక్పథంతోనే స్వీకరించాలి. నిరంతరం లక్ష్యసాధకుడై కాలపరీక్షలకు సిద్ధపడాలి. ఎక్కువ పరీక్షలను ఎదుర్కొని విజయుడై నిలిచిన వ్యక్తి పొందే తుది ఫలితం కాలమనే మహాకావ్యంలో తనకంటూ ఒక పుటను శాశ్వతంగా నిలుపుకోవడం. అందుకోసమే ప్రతి మనిషీ కాలాన్ని గౌరవించాలి.

గోలి రామచంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని