జీవన లయ

ఏది చూసినా దృష్టికి గోచరించే విషయాలు రెండు- ఆది, అంతం. జీవితంలోని వ్యతిరేకతలు విశ్వంలో సమతుల్యతకు అవసరం. శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం (ఉచ్ఛ్వాస నిశ్వాసాలు)- విశ్వంలో నిరంతరాయంగా సాగే లయ.

Published : 18 Feb 2024 00:38 IST

ది చూసినా దృష్టికి గోచరించే విషయాలు రెండు- ఆది, అంతం. జీవితంలోని వ్యతిరేకతలు విశ్వంలో సమతుల్యతకు అవసరం. శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం (ఉచ్ఛ్వాస నిశ్వాసాలు)- విశ్వంలో నిరంతరాయంగా సాగే లయ. ఉనికిలో రాత్రి లేనిదే పగలు లేదు. అదే విధంగా జీవితంలో ఇతర విషయాలు- జననం మరణం, స్త్రీ పురుషులు, శిఖరాలు లోయలు మంచి చెడులు, శీతోష్ణాలు, సానుకూల ప్రతికూలాలు... అన్నీ ఒకదానికొకటి భిన్నంగా అనిపిస్తాయి. అయితే అవి పరస్పర ఆధారితాలు. అదే విశ్వసామరస్యం. దీన్ని సృష్టిలో శివుడి కంటే గొప్పగా వేరెవరూ వివరించలేరు.

లేనిది ఏదైతే ఉందో అదే ‘శి-వ’. ఐక్యభావన రూపానికి మూర్తీభవించిన స్వరూపం... అర్ధనారీశ్వరతత్వం. స్త్రీ పురుష శక్తుల కలయిక... కోపం కరుణల మిశ్రమం. ఈ చైతన్యంతో కూడిన సంతులనం లేకపోతే జీవితం గందరగోళమని శివుడు భక్తులకు గుర్తుచేస్తుంటాడు. రాత్రీ పగలు లేకపోతే జీవితం నిస్తేజం... స్త్రీ లేకపోతే పురుషుడు అసంపూర్ణం. భిన్నధ్రువాలుగా గోచరించినా వారు ఒక్కటే.

చావు లేకుండా పుట్టుక ఎందుకుండదని మనిషి మనసు తరచూ ఉద్రేకపరుస్తుంటుంది. ఆ రెండూ వేరువేరు కాదనే మర్మాన్ని మనిషి గ్రహించాలి. ప్రతి పుట్టుకా చావును మోసుకొస్తుంది. ప్రతి చావూ కొత్త జన్మకు ఊపిరిపోస్తుంది. శివుడు మానవ పరిణామ శిఖరానికి ప్రాతినిధ్యం వహిస్తాడు లోకవిదితం చేసేందుకు. జీవితంలో అదే అంతిమం. ఆ క్రమంలో నూటపన్నెండు ధ్యానమార్గాలను శివుడు సప్తరుషులకు అందించాడు మానవాళికి చేరేందుకు. అందుకే శివుడు- ఆదియోగి... ఆది గురువు.

రూపుదాల్చిన జీవం, మరణంతో రూపం లేకుండా పోతుంది. శివ అంటే రూపం లేకపోవడం. అందుకే శివాలయాల్లో ఆయన ఒక రూపంతో కాకుండా శివలింగంగా సాక్షాత్కరిస్తాడు. ‘ఏకత్వం’ అనే ఆలోచన గురించి భారతీయ రుషులు ఎప్పటినుంచో ఉద్ఘాటిస్తున్నారు. వివిధ రూపాల్లో జీవితాన్ని గ్రహించేవారు, తమ అంతర్గత వాస్తవికతకు దూరమవుతారు. ఈ ఉనికిలోని ప్రపంచం, దేవతలు, వేదాలు, జీవులు... అన్నీ అంతరంగంలోని ఒక భాగమేనని బృహదారణ్యక ఉపనిషత్‌ చెబుతుంది.
వివిధ వాయిద్య పరికరాలు భిన్నమైన స్వరాలు కలిగివున్నా, అన్నీ కలిసి అందమైన శ్రావ్యమైన సంగీతాన్నే అందిస్తాయి. అర్ధనారీశ్వరతత్వంలో శక్తి స్త్రీత్వం, శివుడు పురుషత్వం. కానీ, రెండూ విడదీయరాని విధంగా కలిసిపోయి ఒక సామరస్యంతో ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఆ లక్షణాలుంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకమైనవైనా సక్రమమైన రీతిలో పనిచేసే అవకాశం కలిగిస్తాయి. ప్రకృతికి విరుద్ధంగా కదిలితే మనిషి సంతోషానికి దూరంగా, దయనీయంగా మారతాడు. పరిస్థితిని చక్కజేసుకోవాలనే హెచ్చరికగా భావించి సమతౌల్యం సాధించాలి.

దయనీయమైన పరిస్థితి, సంతోషం వేరు కావు. సంతోషం లోపించినప్పుడే దయనీయమని భావించాలి. విడదీసి చూసే మనసును పక్కన పెట్టినప్పుడే మనిషి మొత్తంగా ఐక్యభావంతో చూడగలుగుతాడు. వైవిధ్యం, ఏకత్వం- రెంటినీ శివుడిలో చూడగలం. అదే పరమశివుడి ప్రత్యేకత!

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని