మధుర భక్తి

పరమాత్ముడిపై చూపే పరమ ప్రేమే భక్తి. అది నిరంతరం సాగిపోయే ప్రవాహంలా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని భక్తి అంటారని భగవద్రామానుజులవారి ప్రబోధం. భక్తిలో అనేక మార్గాలున్నాయి.

Published : 23 Feb 2024 01:24 IST

పరమాత్ముడిపై చూపే పరమ ప్రేమే భక్తి. అది నిరంతరం సాగిపోయే ప్రవాహంలా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని భక్తి అంటారని భగవద్రామానుజులవారి ప్రబోధం. భక్తిలో అనేక మార్గాలున్నాయి. ఈ సాధనలో చెప్పుకోదగ్గ మార్గం మధుర భక్తి.

తలపులో, కీర్తనలో, సేవలో, ఆరాధనలో మాధుర్యాన్ని చవిచూడటంలో భక్తుడు మధుర భావనకు లోనవుతాడు. పరమాత్మను తన ప్రాణనాథుడిగా, తనను నాయికగా ఊహించుకుంటాడు. భక్తురాలు ఆ పరంధామనే ప్రాణనాథుడిగా తలచి వారికోసం పరితపిస్తుంది. సకల ఉపచారాలు చేస్తుంది. ఆయన ఎడబాటును ఒక్క క్షణం కూడా సహించలేదు. అనుక్షణం ఆయన్నే కీర్తిస్తుంది. ఆయన సాన్నిధ్యాన్ని తరగని పెన్నిధిగా భావిస్తుంది. ఆ పరమాత్మలోనే ఐక్యం కావాలని మనసారా కోరుకుంటుంది.

మధుర భక్తి అనగానే మొదట మనకు గుర్తొచ్చేది గోపికలు. శ్రీకృష్ణుడి పట్ల వారు చూపించే ప్రేమకు మూలం శ్రీరామావతార సమయంలో ఉంది. పురుషులకు సైతం మోహం కలిగించే రూపం రాముడిది. ఆ రూపాన్ని చూసి మోహితులైన మునులు ఆయన ఆలింగనాన్ని అభ్యర్థించారు. శ్రీకృష్ణావతార సమయంలో వారి కోరిక తీర్చగలనని శ్రీరాముడు అనుగ్రహించాడు. దాన్ని అనుసరించి ఆ మునులంతా దేహ త్యాగం చేసి   శ్రీకృష్ణావతారంలో గోపికలుగా ఉద్భవించినట్లు చెబుతారు.

గోపికలను జీవాత్మకు, శ్రీకృష్ణుణ్ని పరమాత్మకు ప్రతీకగా తీసుకుంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమే జీవిత చరితార్థమనే సత్యాన్ని రాసక్రీడ ఘట్టం తెలుపుతుంది. అయితే లోక విదితమైన శృంగార ఛాయ ఇందులో కనిపించదు. లౌకికమైన దివ్యభావనకు సోపానమై విరాజిల్లుతుంది. గోపికల భక్తిపారవశ్యం అద్వితీయం. వారికి మరో తలంపు లేదు. ఎల్లప్పుడూ శ్రీకృష్ణ లీలలను స్మరించేవారు. ఆయన రూపాన్ని చూస్తూ తమ ఇల్లు బిడ్డలు బంధువులను సైతం మరచిపోయేవారు. కృష్ణుడి  కోసం పరితపిస్తూ ఇంటికి వెళ్ళడానికి కూడా మనస్కరించక యమునా తీరంలో ఇసుక తిన్నెలపై విహరించేవారు.

రేపల్లెలో గోపికలు పూర్వజన్మ తపఃఫలం వల్ల శ్రీకృష్ణుడి పట్ల గాఢానురక్తులై ఆయన ప్రేమపూర్వక ఊరడింపు కోసం నిరీక్షణలో కాలం గడుపుతున్నారు. గోపికల పట్ల కరుణాపూరిత మనస్కుడైన శ్రీకృష్ణుడు వారికి పరతత్వజ్ఞానాన్ని కలిగించి జన్మ కర్మ దోష నివారణ మార్గాలు చూపి ముక్తుల్ని చేశాడు.

మధుర భక్తి సంప్రదాయంలో రాధాకృష్ణ ప్రేమ ప్రత్యేకమైంది. రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. పరమాత్మను చేరుకోవడానికి జీవాత్మ చేసే సాధనే వారి ప్రణయ స్వభావం. జయదేవుడు రాధాకృష్ణ ప్రణయాన్ని, విరహాన్ని వర్ణిస్తూ మధురమైన కీర్తనలను రచించాడు. అవే అష్టపదులుగా ప్రసిద్ధి చెందాయి.

మీరాబాయి, సక్కుబాయిల భక్తి సైతం ఈ కోవకే చెందుతుంది. వల్లభాచార్యులు మధురాష్టకంలో శ్రీకృష్ణుని స్తుతించిన తీరు చాలా మధురంగా ఉంటుంది. అధరం మధురం అంటూ సాగుతుంది. పెదవి, ముఖం, నేత్రాలు, చిరునవ్వు, హృదయం, నడక... ఒకటేమిటి- ఆయన సర్వస్వం మధురమే అన్నారు. అంత మధురమైన ఆయన ప్రేమ సైతం మధురం.

భాగవతంలోని గోపికల శృంగారం లౌకికమైంది కాదు. అది వారి ప్రేమకు పరాకాష్ఠ. శ్రీకృష్ణుడి రూపంలో పరమాత్మలో తాదాత్మ్యం చెందడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే వారి ఆ భావవ్యక్తీకరణ.

వి.ఎస్‌.రాజమౌళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని