ఆధ్యాత్మిక ఎదుగుదల

రాజు దర్బారుకు వెళ్ళేటప్పుడు రాజ దర్పానికి చిహ్నంగా కిరీటాన్ని ధరించేవారు. కొలువు ముగిసిన తరవాత మకుటాన్ని తీసి మందిరాలకు వెళ్ళిపోయేవారు. అది రాజధర్మం. కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఉన్నతాధికారి హుందాగా కోటు వేసుకుంటాడు.

Published : 24 Feb 2024 00:29 IST

రాజు దర్బారుకు వెళ్ళేటప్పుడు రాజ దర్పానికి చిహ్నంగా కిరీటాన్ని ధరించేవారు. కొలువు ముగిసిన తరవాత మకుటాన్ని తీసి మందిరాలకు వెళ్ళిపోయేవారు. అది రాజధర్మం. కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఉన్నతాధికారి హుందాగా కోటు వేసుకుంటాడు. ఇంటికి రాగానే కోటు విప్పి మామూలు దుస్తులు ధరిస్తాడు. ఇది వృత్తిధర్మం. బాహ్యంగానే కాదు, ఆంతరంగికంగానూ ఆడంబరాలను దూరంగా ఉంచుకోగలిగితే వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మహారాజులా జీవించవచ్చు.

పేరు ప్రఖ్యాతులైనా, ప్రతిభా పాటవాలైనా పుట్టుకతో వెంట వచ్చేవి కావు. అవి జీవితాంతం మనతో ఉంటాయన్న నమ్మకమూ లేదు. జీవనగమనంలో అవి ఒక భాగమే. అవే జీవిత సర్వస్వం కాదు. వాటిని పట్టించుకుంటే అహంకారాన్ని పెంచి అయినవాళ్లను కూడా ఆమడ దూరంలో నిలబెడతాయి. చాలామంది మధ్యలో వచ్చి చేరే సంపదలు, హోదాలే  జీవితంగా మమేకమైపోతుంటారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఓ చిత్రకారుడు ఉండేవాడు. అతడు వేసిన చిత్రాలు రాజ్యమంతటా ప్రబలమై, చివరికి రాజువరకు వెళ్ళాయి. రాయలు ఆ చిత్రకారుడి ప్రతిభను మెచ్చుకుని తగిన సత్కారం చేశాడు. తరవాత అతడి కీర్తి రాజ్యం నలుమూలలా విస్తరించింది. అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా చూసేవారు. దానితో ఆ చిత్రకారుడు వృత్తి ద్వారా వచ్చిన ఖ్యాతితో మమేకమైపోయాడు. ఇంట్లో భార్యాబిడ్డల దగ్గర, బంధుమిత్రుల దగ్గర బయట తనకు లభించే గౌరవ మర్యాదల్ని ఆశించేవాడు. రానురాను అహంకారం తలకెక్కి బాహ్యపరమైన గౌరవ మర్యాదలు ఆశించడం ఎక్కువైపోయింది. భార్యాపిల్లలు అతణ్ని భరించలేక వదిలి వెళ్ళిపోయారు.

ఆడంబరాలను, హోదాను పట్టుకుని వేలాడేవాళ్లు చివరికి ఏకాకులై ఒంటరిగా మిగిలిపోతారు. చేతినిండా సాధించిన పతకాలు పట్టుకు తిరిగేవారికి ఎవరు వచ్చి కరచాలనం చేస్తారు? ఒంటినిండా హోదా హారాలు వేలాడుతుంటే ఎవరు వచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు? ‘ప్రపంచంలో అహంకారంతో సాధించేదేమీ లేదు... ఒక్క అపకీర్తి తప్ప. అహంకారంతో విర్రవీగేవాడు ఇతరులను బాధిస్తాడు. కానీ అంతకన్నా ముందు తానే ఎక్కువ బాధకు గురవుతాడు...’ అన్నారు పాల్‌ బ్రింటన్‌ అనే ఆంగ్ల తత్వవేత్త. చాలామంది ఆత్మీయులు, సన్నిహితుల దగ్గర  తరచూ తమ ప్రతిభను గురించిన గొప్పలే చెబుతుంటారు.

సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు. ప్రతిభ ఉంటే మేధావి అవుతావు. వయసు పెరిగితే వృద్ధుడివవుతావు. వాటితోపాటు అరిషడ్వర్గాలనూ వదిలితే మంచి మనిషివి అవుతావు. నిరంతరం పక్కవారి కంటే పై స్థాయిలో ఉండాలని వేసే ప్రతి అడుగూ మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. మనిషి దుఃఖాన్ని వదిలేసినంత తొందరగా సంతోషాన్ని వదిలేయలేడు. విజయ కిరీటాన్ని తలపై ధరించి స్వోత్కర్షతో గతాన్ని మరిచిపోతుంటాడు.

మనిషి ఒక్కడైతే మౌనంగా ఉంటాడు. ఇద్దరైతే మాట్లాడుకుంటారు. పదిమంది కలిస్తే కలిసికట్టుగా దేన్నైనా సాధించగలరు! ఒక్కడైతే నవ్వగలడు. నలుగురు కలిస్తే నవ్వుకోగలరు. ఇదే విజయ రహస్యం. విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదు సమష్టి కృషి అని గ్రహించినవారు స్థితప్రజ్ఞ కలిగి ఉంటారు.

స్వామి వివేకానంద దేశవిదేశాల్లో హిందూ ధర్మం గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖ్యాతి గడించారు. విదేశాల నుంచి స్వదేశం రాగానే సాధారణ వ్యక్తిలా మారిపోయేవారు. తనవారిని కలిసినప్పుడు వాళ్లకు తెలిసినవాడిలాగే మెలగేవారు. అలా ఎక్కడివక్కడే వదిలేయడం అలవరచుకోవాలి. అదే నిరాడంబర ఆధ్యాత్మిక ఎదుగుదల.

ఎం.వెంకటేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని