ధనవ్యామోహం

మనిషి డబ్బును సృష్టించాడు. తాను సృష్టించిన ధనానికి దాసుడయ్యాడు. అంతులేని ధనదాహం దీర్ఘవ్యాధిలా మనిషిని వ్యాకులపరుస్తుంది. బాధను రగులుస్తుంది. గృహాల్లో ప్రశాంతతను చెడగొడుతుంది.

Published : 03 Mar 2024 00:48 IST

నిషి డబ్బును సృష్టించాడు. తాను సృష్టించిన ధనానికి దాసుడయ్యాడు. అంతులేని ధనదాహం దీర్ఘవ్యాధిలా మనిషిని వ్యాకులపరుస్తుంది. బాధను రగులుస్తుంది. గృహాల్లో ప్రశాంతతను చెడగొడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలతలు రేపుతుంది. 

ధనవిన్యాసం విచిత్రంగా ఉంటుంది. అది మనిషిని మర్కటంలా మార్చి ఆడిస్తుంది. ఆశలు కల్పించి అందలం ఎక్కిస్తుంది... అంతలోనే అగాధంలోకి తోసేస్తుంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి. ధనవంతుడు బికారిగా మారుతుంటాడు. సామాన్యుడు కోటీశ్వరుడు అవుతుంటాడు. కొన్ని సందర్భాల్లో కష్టపడేవాడికి కూడు దొరకదు. సోమరిపోతుకు ఆస్తి కలిసి ధనవంతుడు అవుతాడు. లక్ష్మీ కటాక్షం అందరినీ వరించదు. అంతా మాయ. భగవంతుడి ఆటలో మనమందరం పావులం. దానం, భోగం, నాశం అనే మూడు మార్గాలుగా ధనం ఖర్చవుతుందని, ఒకరికి ఇవ్వక తాను అనుభవించక దాచుకునే ధనానికి మూడోదైన నాశనమే ప్రాప్తిస్తుందని భర్తృహరి సుభాషితం.

ధనం సంపాదించడంలో దుఃఖం, సంపాదించినదాన్ని రక్షించడంలో దుఃఖం, ఆ ధనం వ్యయమైతే దుఃఖం... ఇన్ని విధాలుగానూ దుఃఖకారకమైన ధనం మనిషిని వ్యామోహంలో ముంచుతుంది. అనేక విషయాల్లో శుచిగా ఉండవచ్చు. అన్నింటిలోకీ అర్థ శుచిత్వమే గొప్పది. ధనం విషయంలో శుచిగా అనగా తనది కానిదాన్ని ఆశించక దూరంగా ఉండగలవాడే శౌచవంతుడని బోధిస్తుంది మనుస్మృతి.

దుష్టుల నుంచి ధనాన్ని లాక్కొని సత్పురుషులకు ఇచ్చే రాజు అన్నిరకాల ధర్మాలూ తెలిసినవాడని భారతం చెబుతోంది. ధర్మం, అగ్ని, రాజు, దొంగ ధనానికి దాయాదులని, ఇందులో జ్యేష్ఠుడికి అనగా ధర్మానికి హాని కలిగితే ధనం మిగతా ముగ్గురి దగ్గరకు పోతుందంటారు. అంటే అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని పండిత వాక్యం.

ధనం గర్విష్ఠికి మదాన్ని పెంచితే, సజ్జనులను వినయశీలురుగా మారుస్తుంది. మద్యపానం కలిగించే మత్తుకన్నా సంపద వల్ల కలిగే మత్తు మరింత చెడ్డది. ఐశ్వర్యంతో మదించినవాడు పూర్తిగా చెడిపోయాక గాని తెలివి తెచ్చుకోడు. తన శక్తిని అనుసరించి ధనాన్ని సంపాదించుకునేవాడు ఉత్తముడు. అధర్మంగా ఆర్జించిన సంపదవైపు ఏ మాత్రం ఆకర్షితుడు కానివాడు పాము తన కుబుసాన్ని వదిలివేసినట్లు దుఃఖాలను విడిచి సుఖంగా నిద్రించగలడని బోధిస్తుంది విదురనీతి.

ఆధునిక కాలంలో ధనం చుట్టూనే ప్రపంచం తిరుగుతోంది. మానవ సంబంధాలు ధనబంధాలుగా మారిపోయాయి. డబ్బుతోనే మనిషి మనుగడ ఆధారపడింది. కాసులు కురిపిస్తేనే కార్యసాధన. డబ్బు ఖర్చుపెడితేనే ఆధునిక సౌకర్యాలు అమరుతున్నాయి. పేదవాడికి సంఘంలో గౌరవం దక్కడం లేదు. మితిమీరని సంపాదన ఉత్తమం. న్యాయబద్ధంగా సంపాదించడమే అభిలషణీయం. నోటుకు రెండువైపులా పదునుంది. మనుషుల మధ్య విద్వేషాలను రగిలించే డబ్బు మనిషి విజయానికి బాసటగా నిలుస్తుంది. ధనం ధైర్యాన్నిస్తుంది. 

ధనసంపాదన మనిషి కర్తవ్యం. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయాలి. తన అవసరాలకు తగినట్లుగా ఎంత సంపాదించాలో, ఏ విధంగా ఖర్చుపెట్టాలో తెలుసుకున్నవాడే విజ్ఞుడు.

 ఇంద్రగంటి నరసింహ మూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు