దైవానుగ్రహం

ఆరాధనలతో అల్లాహ్‌ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్‌ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్‌ పవిత్ర మాసాన్ని అల్లాహ్‌ తిరిగి అందించాడు.

Published : 12 Mar 2024 00:18 IST

రాధనలతో అల్లాహ్‌ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్‌ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్‌ పవిత్ర మాసాన్ని అల్లాహ్‌ తిరిగి అందించాడు. ఒకరికొకరు తోడై కలిసి నమాజులు ఆచరించేందుకు త్వరపడుతూ మసీదులకు చేరుకునే అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. దృఢ సంకల్పాలతో ముందుకు నడిచే వారికి దైవానుగ్రహం చేరువ అవుతుంది.

రాత్రి నలుపు రేఖల నుంచి తెల్లవారి ధవళరేఖలు ప్రస్ఫుటమయ్యే లోపు ఆహారం నీరు తీసుకోవచ్చు. ఆహార పానీయ సమయాలలో మార్పులు తట్టుకుంటూ రంజాన్‌ నెల అంతా అల్లాహ్‌ విశ్వాసులు ఉపవాసం ఉండాలి. అయిదు పూటల నమాజులతో పాటు రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనలు తరావీహ్‌ నమాజును ఆచరించాలి. ప్రార్థనల్లో లీనమయ్యే ప్రతి నిమిషాన్ని ప్రజలు ఆనందపారవశ్యాన్ని అనుభవిస్తారు. కొందరు మసీదుల్లో ఉండి ఏతికాఫ్‌ పాటిస్తూ తమ కుటుంబ శ్రేయస్సుతోపాటు సమాజంలో శాంతి స్థాపనకై అల్లాహ్‌ను అర్థిస్తారు. అల్లాహ్‌ ఏర్పరచిన హద్దులను అతిక్రమించక మహాప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) అడుగుజాడలలో నిగ్రహం పాటిస్తూ క్రమశిక్షణగా జీవితకాలాన్ని పటిష్ఠపరచుకుంటారు.

రంజాన్‌ మాసంలో అనంత కరుణా మయుడు అల్లాహ్‌ సందేశాల సారం పవిత్ర ఖురాన్‌ గ్రంథంగా అవనిపై అవతరించింది. ఇది మానవులందరికీ మార్గదర్శకం. ఈ గ్రంథంలోని మూడో సూర అల్‌ ఇమ్రాన్‌లో ‘ఓ ప్రవక్తా సజీవుడు నిత్యుడు అయిన అల్లాహ్‌ ఈ గ్రంథాన్ని నీపై అవతరింప జేశాడు. ఇది సత్యాన్ని తీసుకువచ్చింది. ఇంతకుముందు అవతరించిన తౌరాత్‌, ఇంజీల్‌ గ్రంథాలను ధ్రువపరుస్తుంది’ అని స్పష్టంగా అల్లాహ్‌ సందేశం ఉంది. ఋజుమార్గాన్ని చూపే జ్యోతి ఖురాన్‌ గ్రంథాన్ని ప్రతి ఒక్క దాసుడు పారాయణం చేయాలి. దానధర్మాలు రహస్యంగా చేయమన్న ఖురాన్‌ గ్రంథ ఆదేశాన్ని అందరూ పాటించాలి. బలహీనమైన అలవాట్లను కట్టడి చేసి అల్లాహ్‌ ఆరాధనకు తమను తాము సమర్పించుకొని ఆత్మలను సంస్కరించుకోవాలి. చేసిన తప్పిదాలను గుర్తించి మన్నింపు వేడుకునే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. తిరిగి ఆ తప్పులు జీవితకాలంలో జరగకుండా జాగ్రత్తపడాలి. బాహ్యాంతర పరిస్థితులన్నీ తెలిసిన అల్లాహ్‌ అనుగ్రహానికై ప్రతి నమాజులో శిరసు వంచాలి. మనసులోనూ ఏ పాపపు ఆలోచనకు తావివ్వనివారికి అల్లాహ్‌ ప్రసన్నత లభిస్తుంది.

సహనం వహించి బీదసాదలపట్ల సానుభూతిని చూపవలసిన రంజాన్‌ మాసంలో సంతోషంగా అంతరప్రేరణతో సత్కార్యాలవైపు మొగ్గుచూపాలి. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికీ ఇతర రోజులతో పోలిస్తే డెబ్భైరెట్లు అధిక పుణ్యఫలాలు అందుతాయని పవిత్ర ఖురాన్‌ గ్రంథం బోధిస్తోంది. ఈ మాసంలోని ఒక రేయి వేయి నెలల కన్నా శుభప్రదమైనదిగా అల్లాహ్‌ అనుగ్రహిస్తాడు. ధనికులు తమ సంపాదన నుంచి రెండున్నరశాతం లెక్కించి జకాత్‌దానం చేయాలి. ఇది ఇస్లాం విధుల్లో ఒకటి. ఈ దైవీయ కార్యక్రమం సమాజంలోని వర్గ విభేదాలు సమసిపోయేందుకు కృషి చేస్తుంది. పిసినారులుగా ప్రవర్తించినవారికి చివరకు వారి సంపదలు వారికే కంఠపాశాలవుతాయి. ఈ అల్లాహ్‌ ఆజ్ఞలను శిరసా వహించి ధర్మాన్ని ఆచరిస్తున్న విశ్వాసులు దాసానుదాసులందరికీ అల్లాహ్‌ దయానుగ్రహం కలుగునుగాక. ఆమీన్‌.

షేక్‌ బషీరున్నీసా బేగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని