పోరుబాట మొదలు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్‌సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు.

Updated : 08 Dec 2021 11:34 IST

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు

కలెక్టరేట్లు, కార్యాలయాల ఎదుట నిరసన

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు పెద్ద ఎత్తున ఉద్యమం

ఉద్యమానికి విశాఖలో సంఘీభావం ప్రకటిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు,

సహాయ ఛైర్మన్‌ ఫణి పేర్రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు తదితరులు

ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన ఈ పరిస్థితి నా 40 ఏళ్ల   సర్వీసులో ఎన్నడూ చూడలేదు.

-బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే విస్మరించింది. ఉద్యోగుల సంయమనాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకోకూడదు.

-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌

ఈనాడు- అమరావతి, యంత్రాంగం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్‌సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు. తొలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల వరకూ అన్నిచోట్లా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. కార్యాలయాల వెలుపల ఉద్యోగుల ఐక్యవేదిక జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దుచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండు చేశారు. విధులకు హాజరయ్యే ముందు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కాసేపు నిలుచున్నారు.

కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు,

ఉద్యోగులు.. పాల్గొన్న ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు,

ఏపీ ఐకాస సెక్రటరీ జనరల్‌ హృదయరాజు తదితరులు

విశాఖ, కాకినాడల్లో బండి... కర్నూలులో బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో ఉద్యమస్ఫూర్తి నింపేందుకు విశాఖపట్నం, కాకినాడల్లో జరిగిన కార్యక్రమాల్లో ఏపీ ఐకాస ఛైర్మన్‌, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, నాయకులు ఫణి పేర్రాజు, ఈశ్వరరావు, కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు హృదయరాజు, శివారెడ్డి, బీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలు అందించి నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించారు. 210 సంఘాలకు చెందిన దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారని వారు వెల్లడించారు. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా నల్లబ్యాడ్జీలతో విధులకు వెళ్లనున్నారు.

రవాణా శాఖ కార్యాలయం వద్ద అడ్డగింత

* ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు విద్యాసాగర్‌, వై.వి.రావు, ఇక్బాల్‌ తదితరులు ఉద్యోగులకు మద్దతుగా విజయవాడలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం (ఆర్‌టీఏ)లోకి వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డగించారు. రవాణాశాఖ ఉద్యోగుల్ని కలిసేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అనుమతించారు.

* ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరు పంపుల చెరువు, ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

* గుంటూరు కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసనలో ఐకాస ఛైర్మన్‌ శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు.

* ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు.

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయవాడలోని

నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు

చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని