Andhra News: ఆర్థికభారం లేకుండానే ఓపీఎస్‌

ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పుగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) స్థానంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకాన్ని (జీపీఎస్‌) ప్రతిపాదించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీపీఎస్‌కు బదులు పాత

Updated : 27 Apr 2022 10:04 IST

ఇప్పటికే సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా రూ.7,667 కోట్ల చెల్లింపు
రూ.500 నుంచి 2వేల లోపు వచ్చేవారే ఎక్కువ
ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం నివేదిక

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పుగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) స్థానంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకాన్ని (జీపీఎస్‌) ప్రతిపాదించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీపీఎస్‌కు బదులు పాత పింఛను పథకాన్నే (ఓపీఎస్‌) అమలుచేయాలనే డిమాండు ఉద్యోగుల నుంచి పెరుగుతోంది. భవిష్యత్తులో సీపీఎస్‌ ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రభుత్వం జమచేయాల్సిన వాటా భారీగా పెరుగుతుందని, ఓపీఎస్‌కు మారితే ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా మిగులుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 10% చెల్లిస్తుండగా.. కేంద్రం 2019 జనవరి 31న ఇచ్చిన గెజిట్‌ ప్రకారం 14%కు పెంచాల్సి ఉందని, ఇది మరింత భారమవుతుందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సీపీఎస్‌ ఉద్యోగులు 1.99 లక్షలు ఉండగా.. రాబోయే రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగితే మరో 1.60 లక్షల మంది వస్తారు. ఓపీఎస్‌ అమలుచేస్తే ప్రభుత్వంపై పడే భారాలు, సీపీఎస్‌ రద్దుతో ఉద్యోగులకు కలిగే మేలుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం..

ప్రభుత్వం, ఉద్యోగుల వాటా రూ.15వేల కోట్లు

రాష్ట్రంలో సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబరు 1నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం, ఉద్యోగులు కలిపి రూ.15,335 కోట్లు తమ వాటాగా జమచేశారు. ఇందులో ప్రభుత్వం వాటా రూ.7,667.50 కోట్లు. సీపీఎస్‌ను అమలు చేయకపోతే ప్రభుత్వ వాటా మిగిలేది. ఇప్పటివరకు 1,967 మంది సీపీఎస్‌ ఉద్యోగులు పదవీవిరమణ చేశారు. వీరికి ఓపీఎస్‌ అమలుచేస్తే పింఛను కింద చెల్లించాల్సినది రూ.148 కోట్లే. ఓపీఎస్‌ అమలు చేసి ఉంటే రూ.7,667.50 కోట్లతోనే 2034 వరకు పింఛన్లు చెల్లించే అవకాశం ఉండేది. ప్రభుత్వం కొత్తగా చేసే నియామకాలన్నీ సీపీఎస్‌లోకి వెళ్తాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే సీపీఎస్‌ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుంది. వీరందరికీ ప్రభుత్వం తన వాటా చెల్లించాలి. ఓపీఎస్‌ను అమలుచేస్తే ఇప్పటివరకూ ప్రభుత్వం చెల్లించిన రూ.7,667.50 కోట్లను వెంటనే వెనక్కి తీసుకోలేకపోయినా భవిష్యత్తులో ఉద్యోగులు పదవీవిరమణ చేసే సమయంలో వెనక్కి తీసుకోవచ్చు. సీపీఎస్‌ను రద్దుచేసిన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఈ విధానాన్నే అమలు చేయబోతున్నాయి.

2020-21లో ప్రభుత్వం పింఛన్లు, పదవీవిరమణ ప్రయోజనాల కోసం రూ.17,470.23 కోట్లే ఖర్చుచేసింది. ఇందులో సీపీఎస్‌ వాటా రూ.860 కోట్లు.

2002-2003 నుంచి 2017-18 వరకు రెవెన్యూ వ్యయంలో పింఛన్లకు ఖర్చు చేస్తున్నది 10.84% లోపే ఉంది. ఇందులో పెద్దగా మార్పులు ఉండవు.

సీపీఎస్‌ 2004 సెప్టెంబరు 1న అమల్లోకి వచ్చినా ప్రభుత్వం తన వాటాను 2011 ఫిబ్రవరి నుంచి చెల్లించడం ప్రారంభించింది. దీంతో ఆయా సంవత్సరాల్లో పింఛన్ల వ్యయం పెరిగింది.

పింఛను కంటే వాటానే ఎక్కువ

సీపీఎస్‌ ఉద్యోగుల్లో 2035 నాటికి 21,576 మంది పదవీవిరమణ పొందుతారు. ప్రభుత్వం ఓపీఎస్‌ను అమలుచేస్తే ఏడాదికి రూ.1,445 కోట్లు చెల్లించాలి. ఇదే సమయంలో ప్రభుత్వం సీపీఎస్‌ కింద ఏడాదికి చెల్లించే వాటా రూ.4,331 కోట్లు. ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిన రూ.7,667.50 కోట్లను వెనక్కి తీసుకురాగలిగితే 2033 వరకు ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు. 2034లో రూ.1,122 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

నెలకు రూ.2,500 కూడా రాని దుస్థితి

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,967 మంది సీపీఎస్‌ ఉద్యోగులు పదవీవిరమణ పొందగా.. వీరిలో పింఛను తీసుకుంటున్న వారు 400 మందే. సీపీఎస్‌ నిబంధనలు, తక్కువ పింఛను వస్తుందనే ఉద్దేశంతో కొందరు పింఛను ప్రక్రియనే పూర్తిచేయలేదు. నెలకు కేవలం రూ.500 పింఛనును అందుకుంటున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం వైఎస్సార్‌ పింఛను కానుక కింద నెలకు ఇస్తున్న రూ.2,500 కూడా రానివారు 362 మంది. రూ.1,500-2వేల మధ్య పింఛను పొందుతున్నవారే 112 మంది ఉన్నారు. కొత్త పీఆర్సీ అమలు ప్రకారం కనీస పింఛను రూ.10వేలు. ఇంత మొత్తాన్ని అందుకుంటున్న వారు ఒక్కరూ లేరు. సూర్యవెంకట సుబ్బలక్ష్మి అనే సీపీఎస్‌ ఉద్యోగి సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 కింద 15ఏళ్లు పని చేసి, 2020 జూన్‌లో పదవీవిరమణ పొందారు. అప్పటికి ఆమె మూలవేతనం రూ.36,070. ఆమెకు వస్తున్న పింఛను రూ.3,155 మాత్రమే. అదే ఓపీఎస్‌ ఉంటే రూ.16,096 వచ్చేది. సీపీఎస్‌ కారణంగా ఉద్యోగులకు వృద్ధాప్యంలో భద్రత లేకుండా పోతుండగా.. మరో పక్క ప్రభుత్వంపై పడే భారంలో పెద్దగా మార్పు ఉండదు.


ప్రభుత్వ వాటా లేనందున ఇబ్బంది ఉండదు

- ఎల్వీ యుగేంధర్‌, రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

‘సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడదు. ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ సీపీఎస్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. మరో పక్క ఉద్యోగులకు భద్రత లేకుండా పోతోంది. ఓపీఎస్‌ అమలుచేస్తే ఉద్యోగులు కనీసం 6% జీపీఎస్‌, పీఎఫ్‌ కింద జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు. ఉద్యోగి పదవీవిరమణ చేసే వరకు ప్రభుత్వం వాటా చెల్లించాల్సిన అవసరం లేనందున ఎలాంటి భారం ఉండదు. భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సీపీఎస్‌ కింద వాటా చెల్లిస్తున్నందున ప్రభుత్వ వాటా చెల్లింపులు ఎక్కువగానే ఉంటాయి.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని