Andhra News: విలువలకు మారుపేరు బొజ్జల

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. అహానికి పోకుండా సాధారణ జీవితం గడిపేవారని, హుందాగా వ్యవహరించేవారని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని తెలిపారు.

Updated : 09 May 2022 04:31 IST

 చంద్రబాబు ఘన నివాళి
అంత్యక్రియలకు హాజరై, పాడె మోసిన తెదేపా అధినేత  
ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ ఆవేదన

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే- శ్రీకాళహస్తి: విలువలు, విశ్వసనీయతకు మారుపేరు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. అహానికి పోకుండా సాధారణ జీవితం గడిపేవారని, హుందాగా వ్యవహరించేవారని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని తెలిపారు. సుదీర్ఘకాలం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఆయన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఊరందూరులో ఆదివారం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న చంద్రబాబు నేరుగా వ్యవసాయ క్షేత్రం వద్దకు చేరుకుని బొజ్జల పాడె మోశారు. ఆయనతోపాటు మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, నగరి తెదేపా ఇన్‌ఛార్జి భానుప్రకాశ్‌ పాడె పట్టారు. ఈ సందర్భంగా బొజ్జల జ్ఞాపకాలను తలచుకుని భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం బొజ్జల ఇంటికి వచ్చి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

40 ఏళ్లకు పైగా స్నేహం మాది
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. గోపాలకృష్ణారెడ్డి వంటి ఆప్తమిత్రుణ్ని, ఒక్క మాట చెబితే ఏ పనైనా తూచా తప్పకుండా పాటించే అనుచరుణ్ని కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లకుపైగా యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచే తమ మధ్య స్నేహం ఉండేదని గుర్తు చేసుకున్నారు. బొజ్జల ఏ హోదాలో ఉన్నా వ్యక్తిగత పని కోసం కాకుండా.. శ్రీకాళహస్తి అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల గురించే పని చేశారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న సమయంలో తనకు అండగా ఉంటూ సూచనలు చేసిన బొజ్జల ఎవరైనా తనను విమర్శిస్తే ఒక్క నిమిషం ఊరుకునేవారు కాదని చెప్పారు. ఆయన కుమారుడు సుధీర్‌ ప్రజాసేవలో ఆయన వారసుడిగా పని చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
బొజ్జలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా అనే సంశయం నెలకొన్నా.. చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీకాళహస్తి ఆర్డీవో హరిత దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం తెదేపా జెండాతో ఉన్న ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని