అర్ధరాత్రి గోడదూకి.. గడియ పగలగొట్టి

పల్నాడు జిల్లాలో సీఐడీ పోలీసుల చర్యలు గురువారం కలకలం రేపాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు అర్ధరాత్రి గోడలుదూకి

Updated : 01 Jul 2022 06:25 IST

తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ సిబ్బంది చర్యలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ విచారణ

ఈనాడు-అమరావతి, అమరావతి గ్రామీణం-న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో సీఐడీ పోలీసుల చర్యలు గురువారం కలకలం రేపాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు అర్ధరాత్రి గోడలుదూకి రావడం, గడ్డపారలతో తలుపులు పగలకొట్టడం, నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లడంతో ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. నిరసన తెలిపిన తెదేపా నాయకులపైనా కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్ని సృష్టస్తోంది. తెదేపా కార్యకర్తలు గార్లపాటి వెంకటేష్‌, సాంబశివరావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వెంకటేష్‌ న్యూస్‌-25 పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వేళ ఐదుగురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి సీఐడీ పోలీసులమని, వెంకటేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వ్యాప్తి చేస్తున్నందున అరెస్టు చేయడానికి వచ్చామంటూ తమ ఇంట్లోకి ప్రవేశించారని అతని తల్లిదండ్రులు బ్రహ్మయ్య, వెంకాయమ్మ వాపోయారు. ‘నోటీసు ఇవ్వాలని కోరగా, ఇవ్వలేదు. తలుపు గడియ, తాళాలు గడ్డపలుగుతో పగలగొట్టారు. ఇంట్లోకి చొరబడి, మా అబ్బాయిని లాక్కెళ్లారు. కంప్యూటర్‌ హార్డు డిస్క్‌లు, సెల్‌ఫోన్లు పట్టుకెళ్లారు. మా కుమారుడిని విడిచిపెట్టాలని ప్రాధేయపడితే మమ్మల్ని పక్కకు నెట్టివేశారు. ఏం పోస్టులు పెట్టారు? ఎందుకింత అర్ధరాత్రి పట్టుకెళ్తున్నారు అని అడిగితే సమాధానమివ్వలేదు. ఇదేనా అరెస్టు చేసే విధానం?’ అని వారు ప్రశ్నించారు. వెంకటేష్‌కు ఏదైనా జరిగితే తాము ఉరివేసుకొని ఆత్మహత్య చేసకుంటామని, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. స్థానిక పోలీసుల సహకారంతో తొలుత వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు తర్వాత మంగళగిరిలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా సోషల్‌ మీడియా కార్యకర్త మోకరాల సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి, ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ వేర్వేరుగా విచారిస్తూనే ఉన్నారు. సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక సైబర్‌ నేరాల బృందం, గుంటూరు సీఐడీ పోలీసులు కలిసి వెంకటేష్‌పై ప్రశ్నలు సంధించారు.  అనంతరం వెంకటేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తర్వాత మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. సాంబశివరావును సెక్షన్‌ 41 కింద నోటీసులిచ్చి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అయితే, విచారణలో పోలీసులు తనను కొట్టారని వెంకటేష్‌ కోర్టు వద్దకు వచ్చిన తెదేపా నేతలకు చూపించారు.


ఆందోళన చేసిన నేతల అరెస్టు
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి ఇద్దరిని అదుపులోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై అరెస్టు చేయరాదని గతంలో కోర్టు ఆదేశించినా వెంకటేష్‌ను దౌర్జన్యంగా పట్టుకెళ్లారంటూ తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులతో ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందని విమర్శించారు. ఇద్దరు కార్యకర్తలను చూపించాలంటూ సీఐడీ కార్యాలయం వెలుపల రహదారిపై కనపర్తి శ్రీనివాసరావుతో పాటు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, యల్లావుల అశోక్‌యాదవ్‌, రాయపాటి అమృతరావు, వేల్చూరి కిరణ్‌ బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి నగరంపాలెం స్టేషన్‌కు తరలించారు. బాధితుల కుటుంబీకులు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు.

పోలీసులా? దోపిడీ దొంగలా?: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘అర్ధరాత్రి గోడలు దూకి ఇళ్లల్లోకి వెళ్లడం, గునపాలతో గొళ్లెం పగలగొట్టి చొరబడటం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్లడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్త, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేష్‌, సామాజిక మాధ్యమ కార్యకర్త సాంబశివరావును సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని