జప్తు చేసిన ఎఫ్‌డీలను ఈడీ నగదుగా మార్చిందా!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సున్నపురాయి గనుల కేటాయింపులో జప్తు చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (ఎఫ్‌డీలు) ఈడీ సొమ్ము చేసుకుందా (ఎన్‌క్యాష్‌మెంట్‌).

Updated : 07 Feb 2023 06:32 IST

ఈ అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయండి
భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సున్నపురాయి గనుల కేటాయింపులో జప్తు చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (ఎఫ్‌డీలు) ఈడీ సొమ్ము చేసుకుందా (ఎన్‌క్యాష్‌మెంట్‌) అనే అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఈ సంస్థకు చెందిన సుమారు రూ.150 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకు హామీ తీసుకొని విడుదల చేయాలని అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ 2019లో తీర్పు ఇచ్చింది. దీనిని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. భారతి సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. బ్యాంకు హామీలు పొందిన తర్వాత కూడా సుమారు రూ.150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ సొమ్ము చేసుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) సంజయ్‌ జైన్‌ జోక్యం చేసుకుంటూ ఇరవై శాతం బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మొత్తం డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఎఫ్‌డీలను విడుదల చేస్తే వాటిని జప్తు చేసి ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ ఎఫ్‌డీలను ఏడాది క్రితమే సొమ్ము చేసుకోవడంతో బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన తాము ఇరుక్కుపోయామని తెలిపారు. రోహత్గీ వాదనతో ఏఎస్‌జీ సంజయ్‌ జైన్‌ విభేదించారు. తనకు ఉన్న సమాచారం మేరకు ఈడీ ఎఫ్‌డీలను సొమ్ము చేసుకోలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకొని ఎఫ్‌డీలను ఈడీ సొమ్ము చేసుకుందో లేదో తెలియజేస్తూ వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతి సిమెంట్‌ను ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని సంజయ్‌ జైన్‌ విజ్ఞప్తి చేశారు. భారతి సిమెంట్స్‌ అఫిడవిట్‌, ఈడీ సమాధానం తర్వాత కేసు విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని