Margadarsi: మార్గదర్శి మేనేజర్లపై కఠిన చర్యలొద్దు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీచేసిన మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 05 Apr 2023 08:03 IST

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
దర్యాప్తు కక్షసాధింపు ధోరణితో సాగుతోంది
సహకరిస్తున్నా అరెస్టు చేస్తున్నారు
దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్‌
దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయండి
మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీల మధ్యంతర పిటిషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీచేసిన మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మార్గదర్శిపై నమోదు చేసిన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ వెలుపల స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ సీహెచ్‌.శైలజ మంగళవారం ఉదయం అత్యవసరంగా మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాది విమల్‌ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ ‘‘ఈ కేసులో దర్యాప్తు కక్షసాధింపు చర్యతో కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి పిటిషనర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చిట్‌ఫండ్‌ సంస్థను మూసేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. దర్యాప్తు సమాచారాన్ని వారి అనుకూల మీడియాకు లీక్‌ చేస్తున్నారు. సోమవారం విచారణకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఛైర్మన్‌ ఫొటోను తీసి సాక్షి మీడియాకు పంపారు. 6న ఎండీ విచారణ ఉందంటూ ఫొటోతో పత్రికల్లో వేస్తున్నారు. విచారణలో వేసిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలు పత్రికలో వస్తున్నాయి. సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు వివరాలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఓ వైపు విచారణకు సహకరిస్తున్నా 30 మంది మేనేజర్లకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు పేరుతో పిలిచి అరెస్టు చేస్తారని ఆందోళన ఉంది. దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. సమాచారం అందించడానికి వెళ్లిన ఆడిటర్‌ శ్రావణ్‌ను నిర్బంధించి, అనంతరం అరెస్టు చేశారు. ఆయన గొంతు, మెడపై గాయాలున్నాయి. శ్రావణ్‌ రిమాండ్‌ రిపోర్టులో బాత్రూంకు వెళ్లి తానే గాజుతో గాయపరచుకున్నారని, కింద పడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. పొద్దుపోయాక ఇంటికి వెళ్లాలని చెప్పినా శ్రావణ్‌ వెళ్లలేదంటూ చెబుతున్నారు. కానీ ఎవరూ పోలీసుస్టేషన్‌లో ఉండాలని కోరుకోరు’’ అని తెలిపారు. తమ తరఫు వాదనలు వినిపించడానికి ఏజీ వస్తారని, వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి కోరారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఛైర్మన్‌, ఎండీలకు ఉన్న రక్షణను వారి ఉద్యోగులకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. దర్యాప్తును నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వట్లేదని, కేవలం కఠిన చర్యలు తీసుకోరాదనే ఇస్తున్నామని చెప్పారు. 30 మందిని అరెస్టు చేయబోతున్నారా అని ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని ఏపీ న్యాయవాది తెలిపారు. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసే పరిధి హైకోర్టులకు లేదని, సుప్రీంకోర్టుకే ఉందని తెలిపారు. ఇదో పెద్ద కుంభకోణం అని, దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఏమీ తేలకపోతే అదే విషయాన్ని తుది నివేదికలో పేర్కొంటామని జీపీ పేర్కొన్నారు.

కుంభకోణం కాదు... అప్రతిష్ఠపాలు చేయడమే

ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ‘‘మార్గదర్శి వ్యవహారంలో కుంభకోణం ఏమీ లేదు. అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా దర్యాప్తు సాగుతోంది. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దర్యాప్తును బదిలీ చేయడానికి బలమైన కారణం ఉందని హైకోర్టు గత ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దర్యాప్తునకు సహకరిస్తామంటున్నా బెదిరిస్తున్నారు. విచారణకు వచ్చిన ఆడిటర్‌ను అరెస్టు చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా బ్రాంచ్‌ మేనేజర్లను వేధిస్తూ, అరెస్టు చేస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బ్రాంచ్‌ మేనేజర్లపై కఠినచర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏపీలోని బ్రాంచ్‌ మేనేజర్లకు సంబంధించి ఉత్తర్వులిచ్చే పరిధి ఈ కోర్టుకు ఏమిటని ప్రశ్నించగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ అన్ని బ్రాంచ్‌ల నుంచి నగదు ఇక్కడికి బదిలీ అవుతోందన్నదే ప్రధాన ఆరోపణ అని.. ఛైర్మన్‌, ఎండీల నివాసం కూడా ఇక్కడేనని తెలిపారు. ఛైర్మన్‌, ఎండీలకు రక్షణ కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చినా, ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. బ్రాంచ్‌ మేనేజర్లందరికీ నోటీసులు జారీచేశారని, అందుకే కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి... నోటీసులు అందుకున్న బ్రాంచ్‌ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకు వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వరాదనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ జారీచేసిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, బుధవారం ఇంటివద్ద అయినా దాన్ని విచారించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని